సాక్షి, డిండి(నల్లగొండ) : ఓ వివాహ వేడుకలో డీజే సౌండ్‌ను బంద్ చేయాలని చెప్పినందుకు పలువురు వ్యక్తులు పోలీసులపై దాడి చేశారు. ఈ సంఘటన సోమవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. దేవరకొండ నియోజకవర్గంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో మండలంలో లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మండల పరిధిలోని చెర్కుపల్లి సమీపంలోనున్న గ్రామాలకు పోలీసులు పర్యవేక్షణకు వెళ్తున్న క్రమంలో డీప్‌కట్ సమీపంలోకి వెళ్లగానే డీజే సాంగ్స్, కేరింతలు వినిపించాయి. బురాన్‌పూర్‌తండాకు చెందిన కట్రావత్ శ్రీకాంత్ వివాహ వేడుకల్లో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను డీజే సౌండ్ బాక్స్, ఆంప్లిఫైర్‌ను పోలీసు వాహనంలో వేశారు. దీంతో ఆగ్రహించిన మూడావత్ మల్లేష్, మూడావత్ బాలు, కాట్రావత్ భాస్కర్‌మూడావత్ జగన్, వడ్త్య రాము, కట్రావత్ బుజ్జి పోలీసులపై దాడికి దిగారు.
పోలీసు వాహనం ధ్వంసం కావడంతోపాటు పీఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న కళ్యాణ్‌కుమార్‌కు గాయాలయ్యాయి. మంగళవారం డిండి రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ.శోభన్‌బాబు, పోలీసులు బురాన్‌పూర్‌కు చేరుకొని దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని ఎస్పీ రంగనాథ్ ఆదేశాల మేరకు వారిని నల్లగొండకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment