సాకారమైన కల
‘‘ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ప్రత్యేక తెలంగాణ స్వప్నం సాకారం అయింది. ఈ సమయంలో గెలుపు ఓటముల ప్రసక్తి పక్కనబెట్టాలి.’’
మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన ఘట్టం చరిత్ర పుటలలో చోటు చేసుకుంది. చాలా ఏళ్లుగా నలుగు తూ వచ్చిన సమస్యకు ‘ముగింపు’ దొరికింది. పడింది ‘శుభం’ కార్డా, కొత్త సమస్యకు అంకురార్పణా అన్న చర్చ అనవసరం. దాన్ని కాలమే తేలుస్తుంది. ఎందుకంటే 1956 లో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ‘ఆంధ్రప్రదేశ్’ ఏర్పడినప్పుడు ఇలాగే సందేహించినవారున్నారు. వారి భయాలను తేలిగ్గా కొట్టివేయడం కూడా తగదు.
ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ప్రత్యేక తెలంగాణ స్వప్నం సాకారం అయింది. ఈ సమయంలో గెలుపు ఓటముల ప్రసక్తి పక్కనబెట్టాలి. ఇంత కాలం జరిగింది యుద్ధమూ కాదు, ఆటా కాదు. ఉభయప్రాంతాల ప్రజల ఆకాంక్షకు వ్యక్తీకరణ. కొందరు రాజకీయులు దీనికి అగ్గి రాజేశారు. వారిని గురించి పట్టించుకోవాల్సిన అగత్యం లేదు. ఇకనుంచయినా, రెండు ప్రాంతాల ప్రజలు రాజకీయుల చేతుల్లో పావులు కాకుండా తమ ప్రాంతాల సత్వర అభివృద్ధిలో స్వయంగా భాగస్వాములు కావాలి. నిజమే. సుదీర్ఘ కాలం సాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం 1969 నాటి ఆందో ళనతో పోలిస్తే మొత్తం మీద శాంతియుతంగా జరిగిందని దానికి నాయకత్వం వహించిన వాళ్లు చెప్పుకోవచ్చు.
కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక మంది యువకులు చేసిన బలిదానాల మాటేమిటి? ప్రాంతీయంగా విడిపోయినా మానసికంగా కలిసివుందామని కోరుకునే వారి నడుమ రాజకీయులు తమ స్వార్థం కోసం రగల్చిన సంఘర్షణల మాటేమిటి? ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల తల్లిదండ్రుల మానసిక క్లేశాలకు ఖరీదు కట్టే షరాబులు దొరకరు. అందు చేత అలాంటి వారికి సాంత్వన కలిగించడం తెలంగాణ నాయకుల ప్రథమ కర్తవ్యం. ప్రజల మనసులకు తగిలిన గాయాలు నయం కావడానికి కొంత సమయం పడుతుంది. వాటిని తమ మాటలు, చేతలతో మరింత ముదిరేలా చేసి వ్రణాలుగా తయారు చేయకపోతే అదే పదివేలు. దాదాపు అరవై ఏళ్లు కలసి మెలసి ఉండి విడిపోయే తరుణంలో బాధప డని వారు ఉండరు. విడిపో వడం తప్పనిసరి అయినప్పుడు కలిసివున్నప్పటి రోజుల్లోని అనుబంధాలను గుర్తు చేసుకొని వాటిని పదిలపరచుకోవడం, పెంచుకోవడం విజ్ఞుల లక్షణం.
మరో వారం తిరగగానే తెలుగు ప్రజల చరిత్రలో ఇంకో నూతన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. పదమూడు జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ అనే పాత పేరుతోనే మరో కొత్త రాష్ట్రం రూపుదిద్దుకో బోతోంది. తెలంగాణకు, వడ్డించిన విస్తరి మాదిరిగా అన్ని హంగులతో కూడిన రాజధాని నగరం ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం అన్నీ మొదలు పెట్టి వేగంగా సాగాలి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల దూరదృష్టి లోపం కారణంగా అభివృద్ధి హైదరాబాద్, దాని చుట్టుపక్కల కేంద్రీకృతమైంది అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, విద్య, వైద్యాలయాలు అన్నీ ఒక్కచోటునే మఠం వేశాయి. చదువుల కోసం, వైద్యం కోసం, ఉద్యోగాలు, ఉపాధిల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ రావడానికి అలవాటు పడిన వారికి ఇప్పుడు ఇబ్బందే. సీమాంధ్ర ప్రాంతం నూతన ప్రభుత్వ వ్యవస్థకు ఎదురయ్యే తొలి సవాలు ఇదే.
అభివృద్ధి బంతి ఇప్పుడు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు నాయకత్వం వహించే వారి కోర్టులో ఉంది. ఒక రాష్ట్రాన్ని నిర్మించుకోవాలి. మరో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి. ఉన్న వ్యవధానం చాలా తక్కువ.
ఐదేళ్ల పుణ్యకాలం ఇట్టే గడిచిపోతుంది. కాబట్టి లేనిపోని గిల్లికజ్జాలతో, ఆరోపణలు ప్రత్యారోపణలతో అనుదినం పొద్దుపుచ్చకుండా, ప్రజలకు ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకుంటూ, వారి ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటూ, సత్వర కార్యాచరణకు నడుం కట్టాలి. మాటలు చెప్పి, గీతలు గీసి విభజించినంత సులభం కాదు, కొత్త రాష్ట్రాలను తీర్చిదిద్దడం. పెనుభారంతో కూడిన ఈ బాధ్యతను రెండు ప్రభుత్వాలు అత్యంత శ్రద్ధాసక్తులతో, నిష్టతో నిర్వహించ గలిగితేనే రెండు ప్రాంతాలకు ఫలితాలు సిద్ధిస్తాయి. లేకుంటే పాఠ్య పుస్తకాల్లో మ్యాపులుగా మాత్రమే ఈ రెండు రాష్ట్రాలు మిగిలిపోతాయి.
(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు)