Special telangana
-
వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ
ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే భారతదేశ సమైక్యత దెబ్బతింటుందని వలస పాలకులు ్రప్రచారం చేశారు. దేశం నుండి విడిపోకుండా ఎన్ని రాష్ట్రాలు ఏర్పడితే ఏమయిందని కాళోజీ భావన. సమైక్యంగా ఉండటానికి రాష్ర్ట ఏర్పాటు అడ్డంకి కాదని కాళోజీ వాదించారు. కాళోజీ నారాయణరావు కవిత్వమంతా నిరంతరం తన చుట్టూ జరుగుతున్న సామాజిక సంఘటనలను ఆశ్రమించి ఉంటుంది. వైయక్తిక జీవితానికీ, కవిత్వానికీ మధ్య ఏ విధమైన వైరుధ్యం కాళోజీ కవిత్వంలో కనిపించదు. తన భావాలను వీలున్నంత తేలికగా వ్యక్తం చేయడమే కాళోజీ లక్ష్యం. తన కవిత్వంలో ప్రజా జీవితాన్ని చిత్రించిన ప్రజాకవి కాళోజీ. అవనిపై జరిగేటి అవకతవకలు జూచి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు? అంటూ ప్రజల కోసం పరితపించిన ప్రజాకవి కాళోజీ. ఆయనకు మొదటి నుంచి రాజకీయ నాయకులతో పేచీ ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలను నిర్లక్ష్యం చేసేవాళ్లంటే ఆగ్రహం. నా ఓటుకు పుట్టి నన్నే కాదంటే ఎట్ల కొడక మా ఓట్లకు పుట్టి మమ్మె కాదంటె ఎట్ల కొడక అని రాశాడు. ఆయన మొదట విశాలాంధ్రను సమర్థించాడు. రెండు ప్రాంతాలు కలిసుంటే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నమ్మాడు. కానీ ఎక్కడా ఎప్పుడూ కాళోజీ ఆశించినట్లు జరగలేదు. జరుగుతున్న అన్యాయాన్ని చూసి కాళోజీ సహించలేకపోయాడు. కొందరి నాయకుల మోసపూరిత విధానాలను ఖండిస్తూ తన కవిత్వంలో తూర్పార బట్టారు. భారతదేశంలో ‘ఆంధ్ర రాజకీయాలు’ ఉన్నప్పుడు ‘తెలంగాణ’ రాజకీయాలు కూడా ఉండక తప్పదు అన్నాడు కాళోజీ. పంటలు, సంపద, పెట్టుబడి, అధికారం క్రమ పరిణామమైనప్పుడు ఆక్రమాన్ని ఛేదించక తప్పదు. ప్రత్యేక అధికారం, ప్రజల అధికారం కోసం ప్రత్యేక ఉద్యమాలు తలెత్తుతుంటాయి. కాళోజీ ముందు చూపుతో ప్రజల వైపు నిలిచాడు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో నడిచిండు. బాధ్యతగా ఆ చైతన్యాన్ని చిత్రించిండు. ‘ఎవరుకున్నావు? ఇట్లేనని ఎవరనుకున్నావు?’ అనే కవితలో తెలంగాణకు జరిగిన అన్యాయాల్ని సాగుతున్న పక్షపాత వైఖరినీ తేటతెల్లం చేశారు. ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు ఆంధ్ర తెలంగాణలకు అన్యత ఏర్పడుతుందని హామీలిచ్చిన వారే అంతా స్వాహా చేస్తారని తప్పుడు లెక్కలతో తమ్ములనెప్పుడు ఒప్పిస్తారని అంకెల గారడీ చేస్తూ చంకలు ఎగిరేస్తారని ఆత్మహత్య ధోరణులను హంగామా చేస్తారని ఎవరనుకున్నారు... 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం సాగుతున్నప్పుడు కాళోజీ తెలంగాణ రాష్ట్రం కాంక్షిస్తూ కవిత్వం రాశాడు. అందులో తెలంగాణ వేరైతే అన్న కవితలో ఇలా అంటాడు. తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్తా తెలంగాణ వేరైతే కిలోగ్రాము మారుతుందా తెలంగాణ వేరైతే తెలివి తగ్గిపోతుందా తెలంగాణ వేరైతే చెలిమి తుట్టి పడుతుందా తెలంగాణ వేరైతే తొలి సంజల పూస్తున్నది ప్రజల శక్తి ప్రజ్వలించి ప్రభల ప్రసారిస్తున్నది ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా 1969 మే నెల ఒకటవ తేదీన వరంగల్లులో జరిగిన ప్రజాసమితి సదస్సులో తెలంగాణ ప్రాంతంలో ఉంటూ తెలంగాణకు ద్రోహం చేసే నాయకుల్ని గుర్తించాడు. అమ్ముడుపోతున్న తెలంగాణ నాయకులను హెచ్చరించాడు. ‘ప్రాంతం వాడే దోపిడీ చేస్తే’ అన్న కవితలో దోపిడిదారుడు ఎవరైనా సరే తన్ని తరమాలన్నాడు. దోపిడి చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతం ప్రాంతం వాడే దోపిడి చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తం ప్రాంతేతరుని దోపిడీకన్నా ప్రాంతం వాడి దోపిడీని తీవ్రమైనదిగా కాళోజీ పరిగణించడాన్ని గమనించాలి. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే భారతదేశ సమైక్యత దెమ్బతింటుందని వలస పాలకులు ప్రాచారం చేశారు. దేశం నుండి విడిపోకుండా ఎన్ని రాష్ట్రాలు ఏర్పడితే ఏమయిందని కాళోజీ భావన. సమైక్యంగా ఉండటానికి రాష్ర్ట ఏర్పాటు అడ్డంకి కాదని కాళోజీ వాదించారు. పాలనలో ప్రత్యేకమే తప్ప ప్రజల జీవనంలో సంబంధాల్లో అరమరికలు ఉండనవసరం లేదని చెప్పారు. ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడానికి వీర తెలంగాణ పోరాటం చేసిన వారసులు, వేరు తెలంగాణ కోరుకోరని కొందరు కవులు పద చమత్కారం చేస్తే కాళోజీ అంతే నైపుణ్యంతో చమత్కరించిండు. వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది వేరై కూడ తెలంగాణ వీర తెలంగాణ ముమ్మాటికి వీర, వేరు రెండు తెలంగాణలుండవని, చారిత్రక సందర్భం నుంచే రెండు దశలు ఉత్పన్నమయినాయని అన్ని వేళల్లో వీర తెలంగాణగానే ఉంటుందని ప్రకటించిండు. కాళోజీ కల సాకారమైంది. తెలంగాణ సాకారమైంది. ఇక నవ తెలంగాణను నిర్మించుకోవడమనే కర్తవ్యం మనముందుంది. ‘రాజకీయాలు’ పదానికి ప్రత్యామ్నాయంగా కాళోజీ సృష్టించిన పదం ‘ప్రజాకీయాలు’. ఆ శీర్షికతో కాళోజీ రచించిన కవితతో నా వ్యాసాన్ని ముగిస్తాను. నేతలకు అలవడింది రాజనీతి దండిగ అదే రాజకీయాల నాటిది పంచతంత్రం బాపతుది రాజనీతికి బదులు నేతకు ఉండవలసింది ప్రజాభీతి - మూడ్ రాజు, 9640499526 -
సాకారమైన కల
‘‘ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ప్రత్యేక తెలంగాణ స్వప్నం సాకారం అయింది. ఈ సమయంలో గెలుపు ఓటముల ప్రసక్తి పక్కనబెట్టాలి.’’ మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన ఘట్టం చరిత్ర పుటలలో చోటు చేసుకుంది. చాలా ఏళ్లుగా నలుగు తూ వచ్చిన సమస్యకు ‘ముగింపు’ దొరికింది. పడింది ‘శుభం’ కార్డా, కొత్త సమస్యకు అంకురార్పణా అన్న చర్చ అనవసరం. దాన్ని కాలమే తేలుస్తుంది. ఎందుకంటే 1956 లో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ‘ఆంధ్రప్రదేశ్’ ఏర్పడినప్పుడు ఇలాగే సందేహించినవారున్నారు. వారి భయాలను తేలిగ్గా కొట్టివేయడం కూడా తగదు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ప్రత్యేక తెలంగాణ స్వప్నం సాకారం అయింది. ఈ సమయంలో గెలుపు ఓటముల ప్రసక్తి పక్కనబెట్టాలి. ఇంత కాలం జరిగింది యుద్ధమూ కాదు, ఆటా కాదు. ఉభయప్రాంతాల ప్రజల ఆకాంక్షకు వ్యక్తీకరణ. కొందరు రాజకీయులు దీనికి అగ్గి రాజేశారు. వారిని గురించి పట్టించుకోవాల్సిన అగత్యం లేదు. ఇకనుంచయినా, రెండు ప్రాంతాల ప్రజలు రాజకీయుల చేతుల్లో పావులు కాకుండా తమ ప్రాంతాల సత్వర అభివృద్ధిలో స్వయంగా భాగస్వాములు కావాలి. నిజమే. సుదీర్ఘ కాలం సాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం 1969 నాటి ఆందో ళనతో పోలిస్తే మొత్తం మీద శాంతియుతంగా జరిగిందని దానికి నాయకత్వం వహించిన వాళ్లు చెప్పుకోవచ్చు. కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక మంది యువకులు చేసిన బలిదానాల మాటేమిటి? ప్రాంతీయంగా విడిపోయినా మానసికంగా కలిసివుందామని కోరుకునే వారి నడుమ రాజకీయులు తమ స్వార్థం కోసం రగల్చిన సంఘర్షణల మాటేమిటి? ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల తల్లిదండ్రుల మానసిక క్లేశాలకు ఖరీదు కట్టే షరాబులు దొరకరు. అందు చేత అలాంటి వారికి సాంత్వన కలిగించడం తెలంగాణ నాయకుల ప్రథమ కర్తవ్యం. ప్రజల మనసులకు తగిలిన గాయాలు నయం కావడానికి కొంత సమయం పడుతుంది. వాటిని తమ మాటలు, చేతలతో మరింత ముదిరేలా చేసి వ్రణాలుగా తయారు చేయకపోతే అదే పదివేలు. దాదాపు అరవై ఏళ్లు కలసి మెలసి ఉండి విడిపోయే తరుణంలో బాధప డని వారు ఉండరు. విడిపో వడం తప్పనిసరి అయినప్పుడు కలిసివున్నప్పటి రోజుల్లోని అనుబంధాలను గుర్తు చేసుకొని వాటిని పదిలపరచుకోవడం, పెంచుకోవడం విజ్ఞుల లక్షణం. మరో వారం తిరగగానే తెలుగు ప్రజల చరిత్రలో ఇంకో నూతన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. పదమూడు జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ అనే పాత పేరుతోనే మరో కొత్త రాష్ట్రం రూపుదిద్దుకో బోతోంది. తెలంగాణకు, వడ్డించిన విస్తరి మాదిరిగా అన్ని హంగులతో కూడిన రాజధాని నగరం ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం అన్నీ మొదలు పెట్టి వేగంగా సాగాలి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల దూరదృష్టి లోపం కారణంగా అభివృద్ధి హైదరాబాద్, దాని చుట్టుపక్కల కేంద్రీకృతమైంది అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, విద్య, వైద్యాలయాలు అన్నీ ఒక్కచోటునే మఠం వేశాయి. చదువుల కోసం, వైద్యం కోసం, ఉద్యోగాలు, ఉపాధిల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ రావడానికి అలవాటు పడిన వారికి ఇప్పుడు ఇబ్బందే. సీమాంధ్ర ప్రాంతం నూతన ప్రభుత్వ వ్యవస్థకు ఎదురయ్యే తొలి సవాలు ఇదే. అభివృద్ధి బంతి ఇప్పుడు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు నాయకత్వం వహించే వారి కోర్టులో ఉంది. ఒక రాష్ట్రాన్ని నిర్మించుకోవాలి. మరో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి. ఉన్న వ్యవధానం చాలా తక్కువ. ఐదేళ్ల పుణ్యకాలం ఇట్టే గడిచిపోతుంది. కాబట్టి లేనిపోని గిల్లికజ్జాలతో, ఆరోపణలు ప్రత్యారోపణలతో అనుదినం పొద్దుపుచ్చకుండా, ప్రజలకు ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకుంటూ, వారి ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటూ, సత్వర కార్యాచరణకు నడుం కట్టాలి. మాటలు చెప్పి, గీతలు గీసి విభజించినంత సులభం కాదు, కొత్త రాష్ట్రాలను తీర్చిదిద్దడం. పెనుభారంతో కూడిన ఈ బాధ్యతను రెండు ప్రభుత్వాలు అత్యంత శ్రద్ధాసక్తులతో, నిష్టతో నిర్వహించ గలిగితేనే రెండు ప్రాంతాలకు ఫలితాలు సిద్ధిస్తాయి. లేకుంటే పాఠ్య పుస్తకాల్లో మ్యాపులుగా మాత్రమే ఈ రెండు రాష్ట్రాలు మిగిలిపోతాయి. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) -
‘అయ్యవార్ల’కు చాలు పప్పుబెల్లాలు!
సమైక్యానికి స్వస్తి.. ప్యాకేజీలపై దృష్టి అధిష్టానం దారిలోకి సీమాంధ్ర కేంద్ర మంత్రులు కావూరి, పల్లంరాజు నివాసాల్లో రెండు దఫాలుగా మంతనాలు సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్రం శరవేగంగా ముందుకు తీసుకెళ్తుండడంతో ఇక సమైక్య రాష్ట్ర డిమాండ్‌కు స్వస్తి చెప్పడమే మంచిదని సీమాంధ్ర కేంద్ర మంత్రులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం నుండి వెనక్కు తగ్గేది లేదంటున్న అధిష్టానంతో సహకరించి సీమాంధ్ర ప్రాంతానికి ఎక్కువ అన్యాయం జరుగకుండానైనా చూసుకుందామనే అభిప్రాయానికి వచ్చారు. గురువారం రెండు దఫాలుగా సమావేశమై తెలంగాణేతర ప్రాంతాలతో మిగిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సత్వరాభివృద్ధికి కేంద్రం నుండి రాబట్టుకోవాల్సిన అదనపు నిధులు, సంస్థలు, పథకాల జాబితాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. కావూరి సాంబశివరావు, ఎం.ఎం.పల్లంరాజు, దగ్గుబాటి పురందేశ్వరి, కిల్లి కృపారాణి, జె.డి.శీలం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఉదయం పల్లంరాజు నివాసంలో, పురందేశ్వరి, కృపారాణి మినహా మిగిలినవారు సాయంత్రం మరోసారి కావూరి నివాసంలో సమావేశమై సీమాంధ్ర అవసరాలపై సుదీర్ఘ కసరత్తు చేసినట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది. విభజనతో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన ఏడుగురు మంత్రుల కమిటీ (జీవోఎం) శుక్రవారం సమావేశం కానున్న నేపథ్యంలో తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి కేంద్రం తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని సీమాంధ్ర మంత్రులు నిర్ణయించుకున్నారు. కేంద్రం నుండి తమ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఉన్నత విద్యా సంస్థలు సాధించడం ద్వారానైనా సమైక్యాంధ్ర కోసం రెండు మాసాలుగా ఉద్యమిస్తున్న ప్రజల ఆగ్రహాన్ని కొంతవరకైనా తగ్గించే ప్రయత్నం చేయాలన్నది వీరి ఉద్దేశంగా చెబుతున్నారు. కేంద్ర మంత్రిపదవులకు రాజీనామా చేసే విషయంలో సీమాంధ్రకు చెందిన తొమ్మిది మంది మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కొరవడడం, తామెంత వత్తిడి తెచ్చినా అధిష్టానం నిర్ణయాన్ని పునఃపరిశీలించే అవకాశమే లేదని తేలిపోవడంతో ఒకరి తర్వాత ఒకరుగా అంతా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండక తప్పదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వారు మంత్రి కిశోర్‌చంద్రదేవ్ మార్గాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన వెంటనే సీమాంధ్ర రాష్ట్రానికి విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలనడంతో పాటు కొత్త రాష్ట్రం అభివృద్ధికి వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థలు, రక్షణ, వ్యవసాయరంగ పరిశోధనా సంస్థలు, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు ప్రాజెక్టు మంజూరు చేయాలని కోరుతూ కిశోర్‌చంద్రదేవ్ ఆంటోనీ కమిటీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. బుధ, గురువారాలలో దీనిపై ప్రాథమిక కసరత్తు మాత్రమే జరిగిందని, వచ్చే 15వ తేదీన గురువారం హాజరుకాని చిరంజీవి, కిశోర్‌చంద్ర దేవ్‌లతో పాటు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులతో కలిసి మరోసారి చర్చించిన తర్వాత ‘ప్యాకేజీలపై’ తమ ప్రతిపాదనలతో షిండే నేతృత్వంలోని జీవోఎంతో భేటీ కావాలని కేంద్ర మంత్రులు నిర్ణయించుకొన్నారు. సోనియాతో కావూరి, పురందేశ్వరి చర్చలు ఉదయం సమావేశం ముగిసిన తర్వాత కావూరి సాంబశివరావు, పురందేశ్వరి విడివిడిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. చర్చల వివరాలను వెల్లడించడానికి వారు నిరాకరించినప్పటికీ రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమౌతున్న భయాందోళనలను, సమస్యల తీవ్రతను వివరించి విభజన తర్వాత దేశంలో అతిపేద రాష్ట్రంగా మిగిలిపోకుండా కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.