‘అయ్యవార్ల’కు చాలు పప్పుబెల్లాలు!
సమైక్యానికి స్వస్తి.. ప్యాకేజీలపై దృష్టి
అధిష్టానం దారిలోకి సీమాంధ్ర కేంద్ర మంత్రులు
కావూరి, పల్లంరాజు నివాసాల్లో రెండు దఫాలుగా మంతనాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్రం శరవేగంగా ముందుకు తీసుకెళ్తుండడంతో ఇక సమైక్య రాష్ట్ర డిమాండ్‌కు స్వస్తి చెప్పడమే మంచిదని సీమాంధ్ర కేంద్ర మంత్రులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం నుండి వెనక్కు తగ్గేది లేదంటున్న అధిష్టానంతో సహకరించి సీమాంధ్ర ప్రాంతానికి ఎక్కువ అన్యాయం జరుగకుండానైనా చూసుకుందామనే అభిప్రాయానికి వచ్చారు. గురువారం రెండు దఫాలుగా సమావేశమై తెలంగాణేతర ప్రాంతాలతో మిగిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సత్వరాభివృద్ధికి కేంద్రం నుండి రాబట్టుకోవాల్సిన అదనపు నిధులు, సంస్థలు, పథకాల జాబితాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. కావూరి సాంబశివరావు, ఎం.ఎం.పల్లంరాజు, దగ్గుబాటి పురందేశ్వరి, కిల్లి కృపారాణి, జె.డి.శీలం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఉదయం పల్లంరాజు నివాసంలో, పురందేశ్వరి, కృపారాణి మినహా మిగిలినవారు సాయంత్రం మరోసారి కావూరి నివాసంలో సమావేశమై సీమాంధ్ర అవసరాలపై సుదీర్ఘ కసరత్తు చేసినట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది. విభజనతో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన ఏడుగురు మంత్రుల కమిటీ (జీవోఎం) శుక్రవారం సమావేశం కానున్న నేపథ్యంలో తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి కేంద్రం తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని సీమాంధ్ర మంత్రులు నిర్ణయించుకున్నారు.
కేంద్రం నుండి తమ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఉన్నత విద్యా సంస్థలు సాధించడం ద్వారానైనా సమైక్యాంధ్ర కోసం రెండు మాసాలుగా ఉద్యమిస్తున్న ప్రజల ఆగ్రహాన్ని కొంతవరకైనా తగ్గించే ప్రయత్నం చేయాలన్నది వీరి ఉద్దేశంగా చెబుతున్నారు. కేంద్ర మంత్రిపదవులకు రాజీనామా చేసే విషయంలో సీమాంధ్రకు చెందిన తొమ్మిది మంది మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కొరవడడం, తామెంత వత్తిడి తెచ్చినా అధిష్టానం నిర్ణయాన్ని పునఃపరిశీలించే అవకాశమే లేదని తేలిపోవడంతో ఒకరి తర్వాత ఒకరుగా అంతా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండక తప్పదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వారు మంత్రి కిశోర్‌చంద్రదేవ్ మార్గాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన వెంటనే సీమాంధ్ర రాష్ట్రానికి విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలనడంతో పాటు కొత్త రాష్ట్రం అభివృద్ధికి వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థలు, రక్షణ, వ్యవసాయరంగ పరిశోధనా సంస్థలు, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు ప్రాజెక్టు మంజూరు చేయాలని కోరుతూ కిశోర్‌చంద్రదేవ్ ఆంటోనీ కమిటీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. బుధ, గురువారాలలో దీనిపై ప్రాథమిక కసరత్తు మాత్రమే జరిగిందని, వచ్చే 15వ తేదీన గురువారం హాజరుకాని చిరంజీవి, కిశోర్‌చంద్ర దేవ్‌లతో పాటు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులతో కలిసి మరోసారి చర్చించిన తర్వాత ‘ప్యాకేజీలపై’ తమ ప్రతిపాదనలతో షిండే నేతృత్వంలోని జీవోఎంతో భేటీ కావాలని కేంద్ర మంత్రులు నిర్ణయించుకొన్నారు.
సోనియాతో కావూరి, పురందేశ్వరి చర్చలు
ఉదయం సమావేశం ముగిసిన తర్వాత కావూరి సాంబశివరావు, పురందేశ్వరి విడివిడిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. చర్చల వివరాలను వెల్లడించడానికి వారు నిరాకరించినప్పటికీ రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమౌతున్న భయాందోళనలను, సమస్యల తీవ్రతను వివరించి విభజన తర్వాత దేశంలో అతిపేద రాష్ట్రంగా మిగిలిపోకుండా కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.