సాక్షి ప్రతినిధి కర్నూలు: ఎన్నికలకు రెండేళ్ల ముందే టీడీపీలో టిక్కెట్ల లొల్లి మొదలైంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు అవకాశాలను బేరీజు వేసుకుని ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది? అందుకు ఇప్పటి నుంచే ఎలా సన్నద్ధం కావాలి? అనే దిశగా టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. టీడీపీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కనీసం కొన్ని స్థానాలైనా గెలిచి ఉనికి కాపాడుకోవాలని, అందుకు తగ్గట్లు ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందని ఇటీవల పార్టీ ముఖ్యులతో చర్చించినట్లు తెలుస్తోంది.
చదవండి: సీఎం జగన్ స్పీచ్ ప్రారంభం కాగానే..
ఇందులో భాగంగా కర్నూలు పార్లమెంట్ పరిధిలో టిక్కెట్ల కేటాయింపుపై మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డితో చంద్రబాబు చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాయలసీమలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లాలలో వైఎస్సార్, కర్నూలు మొదటిస్థానంలో ఉన్నాయి. జిల్లాలో 2004 నుంచి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అత్యధికంగా గెలిచిన ఎమ్మెల్యే సీట్లు కేవలం నాలుగు మాత్రమే. గత ఎన్నికల్లో టీడీపీ ఉనికి లేకుండా పోయింది. ఆ పార్టీ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో కూడా ప్రతికూల ఫలితాలే తప్పవని తేలినట్లు తెలుస్తోంది. దీంతో మార్పులు, చేర్పులపై చర్చించి నియోజకవర్గాలకు బాధ్యులను నియమించి పూర్తి స్వేచ్ఛ ఇస్తే బాగుంటుందని చంద్రబాబు భావించారు.
ఎమ్మెల్యేగా పోటీచేసే యోచనలో కోట్ల
కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజుల్లో కర్నూలు పార్లమెంట్ స్థానంలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తిరుగులేని నేత. తమకు పార్టీ బలం కాదని, పార్టీకి తామే బలమనే యోచనలో ఆయన ఉండేవారు. 2014లో కాంగ్రెస్, 2019లో టీడీపీ నుంచి పోటీ చేసిన కోట్ల ప్రస్తుతం ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. రెండు దఫాలుగా ఓటమి ఎదురవడంతో స్వతహాగా తనకు గెలిచే శక్తి లేదని, పార్టీ బలం కీలకమనే వాస్తవంలోకి వచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2024లో కూడా కర్నూలు పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఉంటుందని గ్రహించారు. అత్యధిక అసెంబ్లీ సీట్లు ఆపార్టీ గెలుస్తుందనే నిర్ణయానికి వచ్చారు.
పైగా టీడీపీ 40ఏళ్ల చరిత్రలో 1984లో ఏరాసు అయ్యపురెడ్డి, 1999లో కేఈ కృష్ణమూర్తి మినహా కర్నూలు పార్లమెంట్ స్థానంలో టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. 2004 నుంచి జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పలేదు. ఈ క్రమంలో ఎంపీగా పోటీచేస్తే ఓటమి తప్పదని, అదే జరిగితే రాజకీయంగా ఇక శుభం కార్డు పడినట్లే అని కోట్ల ఆత్మరక్షణలో పడ్డారు. అసెంబ్లీకి పోటీచేస్తే కనీసం నియోజకవర్గంపై శ్రద్ధపెట్టి గెలిచేందుకు ప్రయతి్నంచొచ్చని ఎమ్మిగనూరు బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు.
కుటుంబానికి ఒకే టిక్కెట్ కోటాలో సుజాతమ్మ ఔట్
కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇస్తామనే నిర్ణయాన్ని టీడీపీ అమలు చేస్తే కోట్ల సుజాతమ్మ ఆలూరు నుంచి తప్పుకోక తప్పదు. ఇప్పటికే ఆలూరు టిక్కెట్ రేసులో ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, వీరభద్రగౌడ్ కూడా ఉన్నారు. వీరితో పాటు వైకుంఠం మల్లికార్జున చౌదరి కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గాలు బోయ, కురబ. ఈ క్రమంలో బోయ సామాజిక వర్గానికి టిక్కెట్ ఇవ్వాలని టీడీపీ భావిస్తే వీరిని కాదని చివరి నిమిషంలో కొత్త ముఖాన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
కర్నూలు టిక్కెట్ మైనార్టీలకే ఇచ్చే యోచన
కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా టీజీ భరత్ ఉన్నారు. రాజకీయంగా చురుగ్గా లేకపోవడం, టీజీ వెంకటేశ్ బీజేపీలో, భరత్ టీడీపీలో ఉంటూ రాజకీయంగా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. పైగా వైఎస్సార్‌సీపీ కర్నూలులో అత్యంత బలంగా ఉంది. ఈ క్రమంలో టీజీ కుటుంబానికి టిక్కెట్ ఇస్తే ఓటమి తప్పదని, తాము కూడా మైనార్టీ నేతను బరిలోకి దింపితే కనీసం గట్టిపోటీ అయినా ఇవ్వగలమనే యోచనకు చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది.
డీసీసీ మాజీ అధ్యక్షుడు అహమ్మద్ అలీఖాన్‌ను కర్నూలు బరిలో నిలిపేందుకు దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కోట్ల చొరవతోనే అహమ్మద్ అలీఖాన్ కాంగ్రెస్ పారీ్టకి రాజీనామా చేశారని తెలిసింది. ఈ క్రమంలో ఐదునెలల కిందట కర్నూలు అసెంబ్లీ సీటుపై చంద్రబాబుతో జరిగిన సమీక్షలో భరత్ ఈ విషయాన్ని ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు నుంచి భరోసా రాలేదు. దీంతో భరత్ నిరాశగా వెనుదిరిగారు. టీజీ వెంకటేశ్ కూడా టీడీపీలో చేరితే అప్పుడు కర్నూలు ఎంపీ లేదా రాజ్యసభ ఇచ్చి, అసెంబ్లీ నుంచి పక్కనపెట్టే యోచనకు టీడీపీ వచ్చినట్లు తెలుస్తోంది.
ఎమ్మిగనూరు టీడీపీ వర్గాన్ని కలుపునేలా పావులు
ఎమ్మిగనూరులో గత డిసెంబర్‌లో టీడీపీ కార్యాలయాన్ని కోట్ల ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి లేకుండానే ఈ కార్యక్రమాన్ని చేశారు. జయనాగేశ్వరరెడ్డి వ్యతిరేక వర్గీయులైన గోనెగండ్ల మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు పరమేశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్ రంగమునితో పాటు పలువురిని ఆహ్వానించారు. పైగా పార్టీ ఆదేశిస్తే ఎవ్వరైనా పోటీ చేయొచ్చని కోట్ల ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ లద్దగిరిలోని ఆయన నివాసానికి వచ్చేవారిలో అత్యధిక శాతం ఎమ్మిగనూరు నేతలు, కార్యకర్తలే ఉంటున్నారు. జయనాగేశ్వరరెడ్డి కూడా నియోజకవర్గానికి అందుబాటులో లేకుండా హైదరాబాద్‌లో మకాం వేశారు. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో కోట్లనే బరిలోకి దిగుతారని ఎమ్మిగనూరులోని కీలక టీడీపీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment