disputes in tdp
-
ఎన్నికలకు రెండేళ్ల ముందే.. టీడీపీలో టిక్కెట్ల లొల్లి!
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఎన్నికలకు రెండేళ్ల ముందే టీడీపీలో టిక్కెట్ల లొల్లి మొదలైంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు అవకాశాలను బేరీజు వేసుకుని ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది? అందుకు ఇప్పటి నుంచే ఎలా సన్నద్ధం కావాలి? అనే దిశగా టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. టీడీపీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కనీసం కొన్ని స్థానాలైనా గెలిచి ఉనికి కాపాడుకోవాలని, అందుకు తగ్గట్లు ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందని ఇటీవల పార్టీ ముఖ్యులతో చర్చించినట్లు తెలుస్తోంది. చదవండి: సీఎం జగన్ స్పీచ్ ప్రారంభం కాగానే.. ఇందులో భాగంగా కర్నూలు పార్లమెంట్ పరిధిలో టిక్కెట్ల కేటాయింపుపై మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డితో చంద్రబాబు చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాయలసీమలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లాలలో వైఎస్సార్, కర్నూలు మొదటిస్థానంలో ఉన్నాయి. జిల్లాలో 2004 నుంచి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అత్యధికంగా గెలిచిన ఎమ్మెల్యే సీట్లు కేవలం నాలుగు మాత్రమే. గత ఎన్నికల్లో టీడీపీ ఉనికి లేకుండా పోయింది. ఆ పార్టీ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో కూడా ప్రతికూల ఫలితాలే తప్పవని తేలినట్లు తెలుస్తోంది. దీంతో మార్పులు, చేర్పులపై చర్చించి నియోజకవర్గాలకు బాధ్యులను నియమించి పూర్తి స్వేచ్ఛ ఇస్తే బాగుంటుందని చంద్రబాబు భావించారు. ఎమ్మెల్యేగా పోటీచేసే యోచనలో కోట్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజుల్లో కర్నూలు పార్లమెంట్ స్థానంలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తిరుగులేని నేత. తమకు పార్టీ బలం కాదని, పార్టీకి తామే బలమనే యోచనలో ఆయన ఉండేవారు. 2014లో కాంగ్రెస్, 2019లో టీడీపీ నుంచి పోటీ చేసిన కోట్ల ప్రస్తుతం ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. రెండు దఫాలుగా ఓటమి ఎదురవడంతో స్వతహాగా తనకు గెలిచే శక్తి లేదని, పార్టీ బలం కీలకమనే వాస్తవంలోకి వచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2024లో కూడా కర్నూలు పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం ఉంటుందని గ్రహించారు. అత్యధిక అసెంబ్లీ సీట్లు ఆపార్టీ గెలుస్తుందనే నిర్ణయానికి వచ్చారు. పైగా టీడీపీ 40ఏళ్ల చరిత్రలో 1984లో ఏరాసు అయ్యపురెడ్డి, 1999లో కేఈ కృష్ణమూర్తి మినహా కర్నూలు పార్లమెంట్ స్థానంలో టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. 2004 నుంచి జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పలేదు. ఈ క్రమంలో ఎంపీగా పోటీచేస్తే ఓటమి తప్పదని, అదే జరిగితే రాజకీయంగా ఇక శుభం కార్డు పడినట్లే అని కోట్ల ఆత్మరక్షణలో పడ్డారు. అసెంబ్లీకి పోటీచేస్తే కనీసం నియోజకవర్గంపై శ్రద్ధపెట్టి గెలిచేందుకు ప్రయతి్నంచొచ్చని ఎమ్మిగనూరు బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. కుటుంబానికి ఒకే టిక్కెట్ కోటాలో సుజాతమ్మ ఔట్ కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇస్తామనే నిర్ణయాన్ని టీడీపీ అమలు చేస్తే కోట్ల సుజాతమ్మ ఆలూరు నుంచి తప్పుకోక తప్పదు. ఇప్పటికే ఆలూరు టిక్కెట్ రేసులో ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, వీరభద్రగౌడ్ కూడా ఉన్నారు. వీరితో పాటు వైకుంఠం మల్లికార్జున చౌదరి కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గాలు బోయ, కురబ. ఈ క్రమంలో బోయ సామాజిక వర్గానికి టిక్కెట్ ఇవ్వాలని టీడీపీ భావిస్తే వీరిని కాదని చివరి నిమిషంలో కొత్త ముఖాన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కర్నూలు టిక్కెట్ మైనార్టీలకే ఇచ్చే యోచన కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా టీజీ భరత్ ఉన్నారు. రాజకీయంగా చురుగ్గా లేకపోవడం, టీజీ వెంకటేశ్ బీజేపీలో, భరత్ టీడీపీలో ఉంటూ రాజకీయంగా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. పైగా వైఎస్సార్సీపీ కర్నూలులో అత్యంత బలంగా ఉంది. ఈ క్రమంలో టీజీ కుటుంబానికి టిక్కెట్ ఇస్తే ఓటమి తప్పదని, తాము కూడా మైనార్టీ నేతను బరిలోకి దింపితే కనీసం గట్టిపోటీ అయినా ఇవ్వగలమనే యోచనకు చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది. డీసీసీ మాజీ అధ్యక్షుడు అహమ్మద్ అలీఖాన్‌ను కర్నూలు బరిలో నిలిపేందుకు దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కోట్ల చొరవతోనే అహమ్మద్ అలీఖాన్ కాంగ్రెస్ పారీ్టకి రాజీనామా చేశారని తెలిసింది. ఈ క్రమంలో ఐదునెలల కిందట కర్నూలు అసెంబ్లీ సీటుపై చంద్రబాబుతో జరిగిన సమీక్షలో భరత్ ఈ విషయాన్ని ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు నుంచి భరోసా రాలేదు. దీంతో భరత్ నిరాశగా వెనుదిరిగారు. టీజీ వెంకటేశ్ కూడా టీడీపీలో చేరితే అప్పుడు కర్నూలు ఎంపీ లేదా రాజ్యసభ ఇచ్చి, అసెంబ్లీ నుంచి పక్కనపెట్టే యోచనకు టీడీపీ వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మిగనూరు టీడీపీ వర్గాన్ని కలుపునేలా పావులు ఎమ్మిగనూరులో గత డిసెంబర్లో టీడీపీ కార్యాలయాన్ని కోట్ల ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి లేకుండానే ఈ కార్యక్రమాన్ని చేశారు. జయనాగేశ్వరరెడ్డి వ్యతిరేక వర్గీయులైన గోనెగండ్ల మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు పరమేశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్ రంగమునితో పాటు పలువురిని ఆహ్వానించారు. పైగా పార్టీ ఆదేశిస్తే ఎవ్వరైనా పోటీ చేయొచ్చని కోట్ల ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ లద్దగిరిలోని ఆయన నివాసానికి వచ్చేవారిలో అత్యధిక శాతం ఎమ్మిగనూరు నేతలు, కార్యకర్తలే ఉంటున్నారు. జయనాగేశ్వరరెడ్డి కూడా నియోజకవర్గానికి అందుబాటులో లేకుండా హైదరాబాద్‌లో మకాం వేశారు. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో కోట్లనే బరిలోకి దిగుతారని ఎమ్మిగనూరులోని కీలక టీడీపీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. -
అసమ్మతి సెగలు
రాజాం శ్రీకాకుళం : రాజాం టీడీపీలో వర్గ పోరు తారస్థాయికి చేరుతోంది. ఒక వర్గం అక్రమాల చిట్టాను మరొక వర్గం బయటపెడుతోంది. మొన్న టీడీపీ ఇన్చార్జి ప్రతిభాభారతి అక్రమాలను కళా వర్గీయులు, పార్టీ సీనియర్ నేతలు బట్టబయలు చేయగా.. నిన్న కళా వర్గీయులు, టీడీపీ సీనియర్ నేతల బండారాన్ని ప్రతిభాభారతి అనుచరులు బయటపెట్టారు. ఇటు గ్రామస్థాయి నుంచి అటు రాష్ట్ర స్థాయి వరకూ, ఇటు పింఛన్ల నుంచి అటు స్వీపర్ పోస్టుల వరకూ ఎంతెంత వసూలు చేస్తున్నారో బట్టబయలు చేస్తున్నారు. గంటసేపు మంతనాలు ఈ నెల 28న టీడీపీ ఇన్చార్జ్ ప్రతిభాభారతికి వ్యతిరేకంగా రాజాం, రేగిడి, వంగర మండలాలకు చెందిన పలువురు టీడీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు అసమ్మతి సమావేశం పెట్టి మీడియా ముందుకు వచ్చి ఆమె అవినీతిని బయటపెట్టారు. ఈ అనూహ్య పరిణామంతో టీడీపీలోని మరో వర్గం తీవ్రంగా ప్రతిఘటించింది. ప్రతిభాభారతి క్యాంపు కార్యాలయం వద్ద రాజాం నగర పంచాయతీకి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గంట సేపు మంతనాలు జరిపి.. కార్యాలయం నుంచి బయటకు వచ్చి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతిభా భారతిపై గిట్టని నేతలు బురద జల్లుతున్నారని ఆరోపిస్తూ నిప్పుల వర్షం కురిపించారు. ఆరోపణలు రుజువుచేస్తే రాజకీయ సన్యాసం రాజాం ఏఎంసీ వైస్ చైర్మన్ టంకాల కన్నంనాయుడు, జన్మభూమి కమిటీ మెంబర్లు అంపోలు శ్రీను, వాకముల్ల ప్రసాద్, ఉంగటి సత్యం తదితరులు మాట్లాడుతూ టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్సీగా ప్రతిభాభారతి ఎంతో కృషిచేశారని తెలిపారు. ఒక్క పైసా కూడా స్వలాభం చూసుకోలేదని అన్నారు. నాలుగేళ్లుగా రాజాంలో ఉంటూ టీడీపీకి సేవచేస్తున్నారని వివరించారు. ఆమె పేరు చెప్పి ఎంతో మంది టీడీపీ నేతలు డబ్బులు సంపాదించుకుని జేబులు నింపుకొన్నారని పేర్కొన్నారు. ఆమెకు తెలియకుండా డబ్బులు దండుకుని ఇప్పుడు నిందలు మోపడం సమంజసం కాదని అన్నారు. ప్రతిభాభారతి అక్రమ వసూళ్లుకు పాల్పడ్డారని నిరూపిస్తే తామంతా రాజకీయ సన్యాసం తీసుకుంటామని సవాలు విసిరారు. ప్రతిభాభారతి పేరుతో డబ్బులు వసూలు చేసిన వారి పేర్లు నిర్బయంగా తెలపాలని, వాటిని అక్రమార్కులు నుంచి రికవరీ చేయిస్తామని అన్నారు. ఆ నేతలు ఎటువైపు ఈ నెల 28న జరిగిన సమావేశానికి గైర్హాజరైన టీడీపీ సీనియర్ నేతలు ప్రతిభాభారతి అనుచరుల సమావేశానికి కూడా రాలేదు. రాజాం ఏఎంసీ చైర్మన్ పైల వెంకటరమణతో పాటు పార్టీ నేతలు గురవాన నారాయణరావు, సంతకవిటి మండల మాజీ ఎంపీపీ కొల్ల అప్పలనాయుడు, వైస్ ఎంపీపీ గండ్రేటి కేసరి తదితర నేతలు ఈ సమావేశంలో కనిపించలేదు. -
బొబ్బిలి టీడీపీలో యుద్ధం
బొబ్బిలి విజయనగరం : బొబ్బిలి నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు బట్టబయలైంది. మొదటినుంచీ టీడీపీలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించే తూముల భాస్కరరావుకు చెక్ పెట్టేందుకు రాజులు ప్రయత్నిస్తున్నారనే దుమారం ఇటీవల పలు సందర్భాల్లో చర్చకువచ్చింది. తాజాగా విడుదల చేసిన వార్డు దర్శిని కార్యక్రమం షెడ్యూల్ లిస్టు ఆ వివాదానికి ఆజ్యం పోసింది. మున్సిపల్ చైర్మన్ గిరీతో పాటు పట్టణంలో అధికారిక కార్యకలాపాలకు కీలకంగా వ్యవహరిస్తున్న తూముల భాస్కరరావు, ఆమె సతీమణి చైర్పర్సన్ అచ్యుతవల్లికి సంబంధం లేకుండా జన్మభూమి కమిటీ నాయకుడు అల్లాడ భాస్కరరావుకు వార్డు దర్శిని బాధ్యతలు అప్పగించడం ఈ వివాదానికి కారణమైంది. మునిసిపాలిటీ బాధ్యతలు చూస్తున్న తమకు తెలియకుండా షెడ్యూల్ ఎలా నిర్ణయిస్తారని తూముల మండిపడుతున్నారు. చిచ్చు రేపిన షెడ్యూల్ షెడ్యూల్లో రాష్ట్ర మంత్రి సుజయ కృష్ణ రంగా రావు, పార్టీ ఇన్చార్జి తెంటు లకు‡్ష్మనాయుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆర్.వి.ఎస్.కె.కె.రంగారావు పాల్గొంటారని పేర్కొన్నారు గానీ మున్సిపాలిటీలో నిర్వహించే కార్యక్రమ షెడ్యూల్లో ఎక్కడా తూముల దంపతుల పేర్లు లేకపోవడంతో రాజులపై ఆ వర్గం మండిపడుతోంది. దీనిని తీవ్రంగా పరిగణించిన భాస్కరరావు మంత్రి రంగారావుకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని తెల్సింది. చివరకు బేబీనాయనతో ఫోన్లో మాట్లాడి ఇదేం సంప్రదాయమని అడిగినట్టు భోగట్టా. గురువారం సాయంత్రం నుంచి ఈ విషయమై ఇరు వర్గాల మధ్య అంతర్యుద్ధం నడుస్తున్నట్టు సమాచారం. దీనిపై మంత్రి రంగారావు ఎదుటే శుక్రవారం తేల్చుకునేందుకు వారు సిద్ధమవుతున్నారని విశ్వసనీయ సమాచారం. ఇక తాడో పేడో... తనను ఇలా వేరు చేయడంలో రాజుల ఆంతర్యమేమిటో తెలుసుకోవాలని తూముల నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఎన్నో కార్యక్రమాలు, కష్ట సమయాల్లో పార్టీకి అండగా ఉండే తనను ఇలా అవమానించడం వెనుక ఉన్న నాయకులను గుర్తించే పనిలో ఉన్న భాస్కరరావు ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాననీ, దీనిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించాలనీ తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు బొబ్బిలి టీడీపీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. శుక్రవారం తెర్లాంలో నిర్వహించే నియోజకవర్గ సమావేశంలో ఈ విషయాలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. మంత్రి మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో గొల్లపల్లిలో చెరువు కప్పేసిన మాజీ కౌన్సిలర్‌ను పక్కనే కూర్చుండబెట్టుకున్న మంత్రి రంగారావు పార్టీ ఆదేశించిన ఆ కార్యక్రమానికి తనను కానీ మునిసిపల్ చైర్‌పర్సన్‌ను కానీ ఆహ్వానించకపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. కొన్ని కార్యక్రమాలకు తనను దూరంపెట్టే వ్యవహారాలు నడుపుతున్న రాజులతో తూముల ఈ వ్యవహారంపై సీరియస్‌గా పరిగణిస్తున్నట్టు ఆయన వర్గీయులు బాహాటంగా చర్చించుకుంటున్నారు. దీనిపై ఏమవుతుందో తెలియాల్సి వుంది. -
దేవినేని వల్లభనేని మధ్య కోల్డ్ వార్
-
దేవినేని వర్సెస్ వల్లభనేని
కృష్ణా జిల్లా : ఏపీ నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. పోలవరం కుడికాలువ పట్టిసీమపై ఏర్పాటు చేసిన పంపుసెట్లకు విద్యుత్తు సరఫరా విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మంత్రి ఉమ సొంత నియోజకవర్గం మైలవరంలో నీరు ఇచ్చి గన్నవరం నియోజకవర్గంలో రైతులకు నీరు ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గన్నవరం, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల్లో పట్టిసీమ నీరు అందక నారుమళ్లు, వరినాట్లు ఎండిపోతున్నాయి. రైతుల ఇబ్బందుల విషయమై విద్యుత్ శాఖ ఎండీ, చైర్మన్ నాయక్‌కు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ లేఖ రాశారు. దానికి ఉమ అడ్డుపడుతుండటంతో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి సమస్యల గురించి ప్రస్తావించనున్నారు. గత ఏడాది ఇదే సమస్య రావడంతో వల్లభనేని, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడంతో అధికారులు విద్యుత్ ఇచ్చారు. -
పార్వతీపురం టీడీపీలో ముసలం
పార్వతీపురం : పార్వతీపురం తెలుగుదేశం పార్టీలో విభేదాలు బట్టబయలయ్యాయి. పట్టణంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన కాగడాల ర్యాలీకి కౌన్సిలర్లు ఎవరూ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతలు కలసి నిర్వహించిన కార్యక్రమానికి పట్టుమని పదిహేనుమంది కూడా ర్యాలీలో పాల్గొనకపోవడం విశేషం. వాస్తవానికి కాగడాల ర్యాలీ చేపడుతున్న విషయం పట్టణ అధ్యక్షుడు కోలా వెంకట్రావు(బాబు) అందరికీ చెప్పాల్సి ఉంది. కాని ఈ విషయాన్ని స్వయంగా ఎమ్మెల్యే చిరంజీవులు కౌన్సిలర్లకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆయన నలుగురు కౌన్సిలర్లకు ఎమ్మెల్యే సమాచారాన్ని ఇవ్వక పోవడంతో కౌన్సిలర్లంతా ఏకమై కాగడాల ర్యాలీని బహిష్కరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడకు వచ్చిన పది మంది కార్యకర్తలతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ర్యాలీని మమ అనిపించారు. ఏఎంసీ చైర్మన్ పదవే వివాదానికి కారణం పార్వతీపురం పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. ఈ నామినేటెడ్ పదవిని పార్టీని నమ్ముకుని పార్టీకి విశేష సేవల అందించేవారికి ఇవ్వడం ఆనవాయితీ. ఈ పదవిని తెలుగుదేశం పార్టీకి చెందిన 2వ వార్డు కౌన్సిలర్ బార్నాల సీతారామారావు, పట్టణ అధ్యక్షుడు కోలా వెంకట్రావు ఆశిస్తూ వస్తున్నారు. గతంలో కోలా వెంకట్రావును ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ప్రోత్స హిస్తూ వచ్చారు. ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మాత్రం బార్నాల సీతారామారావుకు ఛైర్మన్ పదవిని ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో సీతారామారావుకు ఇవ్వడానికి ఎమ్మెల్యే ఎంతమాత్రం ఒప్పుకోలేదు. దీనివల్ల ఏడాది కాలంగా ఈ పదవి భర్తీ కావడంలేదు. ప్రస్తుతం ఆ పదవిని ఎమ్మెల్యే ఎవరికి తెలియకుండా బార్నాల సీతారామారావుకు ఇవ్వాలని సిఫారసు లేఖ రాసినట్టు తెలిసింది. స్థానిక కౌన్సిలర్లను సంప్రదించకుండా... ఏ ఒక్కరి అభిప్రాయం తెలుసుకోకుండా ఉన్న పళంగా గతంలో వ్యతిరేకించిన సీతారామారావుకు ఎలా ఇచ్చారని కౌన్సిలర్లు శుక్రవారం మున్సిపల్ వైస్ ఛైర్మన్ జయబాబు కార్యాలయంలో నిలదీశారు. ‘మిమ్మలను అడగకపోవడం నా తప్పే. నాకున్న ఒత్తిడి మేరకు అలా చేయాల్సి వచ్చింది తప్ప మిమ్ములను ధిక్కరించి నేను ఏదీ చేయలేదు’ అని చెప్పుకొచ్చారు. -
బొబ్బిలి టీడీపీలో ఆధిపత్యపోరు !
► తమ్ముళ్ల ఆదేశాలతో అధికారుల బెంబేలు ► ఎవరికి వారే తామే ముఖ్యమంటూ హెచ్చరికలు ► పార్కింగ్తో మొదలైన పోరుతో ఉద్రిక్తత బొబ్బిలి : ఒకరు సర్పంచ్... మరొకరు ఎంపీపీ కుమారుడు. ఒకరు ఉప్పు... మరొకరు నిప్పు. ఎవరికి వారే తామే ముఖ్యమంటూ ఆదేశాలు. ఒక పార్కింగ్ వివాదం చినికి చినికి గాలివానగా మారి ఎంపీడీఓ కార్యాలయంలో ఉద్రిక్తతకు దారితీసింది. ప్రజాప్రతినిధిగా తనకే హక్కుందని సర్పంచ్ అంటే... అభివద్ధిపై సమీక్షించే హక్కు తనకుందంటూ ఎంపీపీ కుమారుడి వితండ వాదన. వీరి మధ్య నలిగిపోతున్న దిగువస్థాయి అధికారులు. ఇదీ బొబ్బిలిలో గురువారం చోటు చేసుకున్న సంఘటన. సిబ్బంది బెంబేలు ‘ఎవడిని అడిగి బండి అడ్డంగా పెట్టాడు.. తీస్తాడా..? తియ్యడా...? అని ఒకరంటే పోర్టికోలో కారు పెట్టిందెవడు..? వాడేమైనా ప్రజాప్రతినిధా...? బండి తియ్యను...రేపు ట్రాక్టర్ అడ్డుపెడతాను ఏంచేస్తాడో చేసుకోమను..అని ఒకరు. ఉపాధి సిబ్బందితో ఎంపీపీ కుమారుడు సమావేశం ఏర్పాటుచేస్తే... కోన్‌కిస్కా గాడు సమావేశం పెడితే మీరెందుకు హాజరయ్యారు...? అని మరో తెలుగు తమ్ముడు ఇలా గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని అధికారులు సిబ్బంది భయపడిపోయారు. వివరాలిలా ఉన్నాయి... టీడీపీ నాయకుడు అల్లాడ భాస్కరరావు, ఇటీవల టీడీపీలో చేరిన రాజుల గ్రూపునకు చెందిన ఎంపీపీ కుమారుడు శ్రీనివాసరావు వర్గం పరోక్షపోరుకు ఎంపీడీఓ కార్యాలయం గురువారం వేదికయ్యింది. పారాది సర్పంచ్ అల్లాడ భాస్కరరావు గురువారం ఉదయం ఎంపీడీఓ కార్యాలయానికి ద్విచక్రవాహనంపై వచ్చి పోర్టికోలో నిలిపారు. కాసేపటికి ఎంపీపీ గోర్జ వెంకటమ్మ కుమారుడు శ్రీనివాసరావు తనకారుతో ఎంపీడీఓ కార్యాలయం పోర్టికోకు వచ్చి... ద్విచక్రవాహనం అడ్డంగా ఉంది ఎవడు పెట్టాడు...?కారు ఎలా ఉంచాలి..? అని ఆగ్రహం వ్యక్తం చేసారు. తక్షణమే సూపరింటెండెంట్ త్రినాథను పిలిచి ద్విచక్రవాహనం తీయమని చెప్పాలని ఆదేశించారు. ఎంపీడీఓ గదిలో ఉన్న భాస్కరరావుకు ఆ విషయం త్రినాథ తెలపగా ఎవడు తీయమంది..? పోర్టికోలో కారు ఎవడైనా పెడతాడా...? వాడేమైనా ప్రజాప్రతినిధా..? తీయను రేపు ట్రాక్టర్ అడ్డుపెడతాను ఏం చేస్తాడో చేసుకోమను అని తిరిగి సమాధానమిచ్చారు. మరో సీన్లో... ఎంపీపీ గదిలో శ్రీనివాసరావు ఉపాధి ఏపీఓ సుశీల, ఈసీ సంపతి, టీఏలతో శుక్రవారం జరగాల్సిన వనం మనంపై సమావేశం నిర్వహించారు. ఏపీడీ సాయిబాబా వచ్చి ఆ గదిలోనే శ్రీనివాసరావు సమక్షంలోనే సమావేశం నిర్వహించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ భాస్కరరావు ఉపాధి సిబ్బందికి ఫోన్‌చేసి అనధికార వ్యక్తి సమావేశంపెడితే ఎలా వెళ్లారు..? మీరు రండి మాట్లాడాలి అని పిలిచారు. సుమారు రెండున్నర గంటల సమావేశం అనంతరం ఉపాధి సిబ్బంది శ్రీనివాసరావు వద్దనుండి భాస్కరరావు వద్దకు వెళ్లారు. ఇక ఆగ్రహంతో ఆయన అనధికార వ్యక్తి సమావేశానికి పిలిస్తే మీరెందుకు వెళ్లారు..? అంటూ నిలదీశారు. ఎంపీపీ పిలిస్తే వెళ్లండి..అధికారులు పిలిస్తే వెళ్లండి. మీకేమైనా సమావేశం అని నోట్ ఆర్డర్ వచ్చిందా...? మీ ఉన్నతాధికారులు వెళ్లమన్నారా...? ఏపీడీ అక్కడకు సమావేశానికి వెళ్లడమేమిటని మండిపడ్డారు. ఏపీఓ సుశీల వెళ్తే ఒక సమస్య... వెళ్లకపోతే మరో సమస్యనీ... తాము నలిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువర్గాల అనుచరుల మోహరింపు... ఈ దశలో అక్కడ పరిస్థితి చేయిదాటుతోందని తెలుసుకున్న భాస్కరరావు వర్గానికి చెందిన టీడీపీ నాయకులు చింతల భాస్కరరావు, చొక్కాపు నారాయణరావు, కునుకు సత్యనారాయణ, రెడ్డిమోహనరావు, మీసాలశ్రీనివాసరావు, గోర్జశ్రీనివాసరావుకు చెందిన చింతాడ జయప్రదీప్, గొర్లె ఈశ్వర ప్రసాద్, బంకురు బాబూరావు తదితర రెండు వర్గాల అనుచరులు అక్కడ మోహరించడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కలిగింది. ఎంపీడీఓ చంద్రమ్మ మాత్రం కార్యాలయానికి రాలేదు. చివరకు రెండు వర్గాల వారు ఎవరిమట్టుకు వాళ్లు వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫిర్యాదు చేస్తా... అనధికారికంగా సమావేశాలు నిర్వహిస్తే సహించం. దీనిపై ఉన్నతాధికారులకు, పార్టీ నాయకులకు ఫిర్యాదు చేస్తానని దీనిపై అమీతుమీ తేల్చుకుంటానని తెగేసి చెప్పారు. మొత్తమ్మీద పాత టీడీపీ నాయకులకు, తాజాగా వెళ్లిన వారికి మధ్య సయోధ్య కుదరలేదనీ... ఉప్పునిప్పులా కాలుదువ్వుతున్నారని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.