తూముల వర్గాన్ని ఆహ్వానించకుండా మంత్రి ప్రెస్‌మీట్
బొబ్బిలి విజయనగరం : బొబ్బిలి నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు బట్టబయలైంది. మొదటినుంచీ టీడీపీలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించే తూముల భాస్కరరావుకు చెక్ పెట్టేందుకు రాజులు ప్రయత్నిస్తున్నారనే దుమారం ఇటీవల పలు సందర్భాల్లో చర్చకువచ్చింది. తాజాగా విడుదల చేసిన వార్డు దర్శిని కార్యక్రమం షెడ్యూల్ లిస్టు ఆ వివాదానికి ఆజ్యం పోసింది.
మున్సిపల్ చైర్మన్ గిరీతో పాటు పట్టణంలో అధికారిక కార్యకలాపాలకు కీలకంగా వ్యవహరిస్తున్న తూముల భాస్కరరావు, ఆమె సతీమణి చైర్‌పర్సన్ అచ్యుతవల్లికి సంబంధం లేకుండా జన్మభూమి కమిటీ నాయకుడు అల్లాడ భాస్కరరావుకు వార్డు దర్శిని బాధ్యతలు అప్పగించడం ఈ వివాదానికి కారణమైంది. మునిసిపాలిటీ బాధ్యతలు చూస్తున్న తమకు తెలియకుండా షెడ్యూల్ ఎలా నిర్ణయిస్తారని తూముల మండిపడుతున్నారు.
చిచ్చు రేపిన షెడ్యూల్
షెడ్యూల్‌లో రాష్ట్ర మంత్రి సుజయ కృష్ణ రంగా రావు, పార్టీ ఇన్‌చార్జి తెంటు లకు‡్ష్మనాయుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆర్.వి.ఎస్.కె.కె.రంగారావు పాల్గొంటారని పేర్కొన్నారు గానీ మున్సిపాలిటీలో నిర్వహించే కార్యక్రమ షెడ్యూల్‌లో ఎక్కడా తూముల దంపతుల పేర్లు లేకపోవడంతో రాజులపై ఆ వర్గం మండిపడుతోంది.
దీనిని తీవ్రంగా పరిగణించిన భాస్కరరావు మంత్రి రంగారావుకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని తెల్సింది. చివరకు బేబీనాయనతో ఫోన్‌లో మాట్లాడి ఇదేం సంప్రదాయమని అడిగినట్టు భోగట్టా. గురువారం సాయంత్రం నుంచి ఈ విషయమై ఇరు వర్గాల మధ్య అంతర్యుద్ధం నడుస్తున్నట్టు సమాచారం. దీనిపై మంత్రి రంగారావు ఎదుటే శుక్రవారం తేల్చుకునేందుకు వారు సిద్ధమవుతున్నారని విశ్వసనీయ సమాచారం.
ఇక తాడో పేడో...
తనను ఇలా వేరు చేయడంలో రాజుల ఆంతర్యమేమిటో తెలుసుకోవాలని తూముల నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఎన్నో కార్యక్రమాలు, కష్ట సమయాల్లో పార్టీకి అండగా ఉండే తనను ఇలా అవమానించడం వెనుక ఉన్న నాయకులను గుర్తించే పనిలో ఉన్న భాస్కరరావు ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాననీ, దీనిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించాలనీ తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు బొబ్బిలి టీడీపీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
శుక్రవారం తెర్లాంలో నిర్వహించే నియోజకవర్గ సమావేశంలో ఈ విషయాలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. మంత్రి మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో గొల్లపల్లిలో చెరువు కప్పేసిన మాజీ కౌన్సిలర్‌ను పక్కనే కూర్చుండబెట్టుకున్న మంత్రి రంగారావు పార్టీ ఆదేశించిన ఆ కార్యక్రమానికి తనను కానీ మునిసిపల్ చైర్‌పర్సన్‌ను కానీ ఆహ్వానించకపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.
కొన్ని కార్యక్రమాలకు తనను దూరంపెట్టే వ్యవహారాలు నడుపుతున్న రాజులతో తూముల ఈ వ్యవహారంపై సీరియస్‌గా పరిగణిస్తున్నట్టు ఆయన వర్గీయులు బాహాటంగా చర్చించుకుంటున్నారు. దీనిపై ఏమవుతుందో తెలియాల్సి వుంది.
Comments
Please login to add a commentAdd a comment