మాట్లాడుతున్న ప్రతిభాభారతి అనుచరులు
రాజాం శ్రీకాకుళం : రాజాం టీడీపీలో వర్గ పోరు తారస్థాయికి చేరుతోంది. ఒక వర్గం అక్రమాల చిట్టాను మరొక వర్గం బయటపెడుతోంది. మొన్న టీడీపీ ఇన్‌చార్జి ప్రతిభాభారతి అక్రమాలను కళా వర్గీయులు, పార్టీ సీనియర్ నేతలు బట్టబయలు చేయగా.. నిన్న కళా వర్గీయులు, టీడీపీ సీనియర్ నేతల బండారాన్ని ప్రతిభాభారతి అనుచరులు బయటపెట్టారు. ఇటు గ్రామస్థాయి నుంచి అటు రాష్ట్ర స్థాయి వరకూ, ఇటు పింఛన్ల నుంచి అటు స్వీపర్ పోస్టుల వరకూ ఎంతెంత వసూలు చేస్తున్నారో బట్టబయలు చేస్తున్నారు.
గంటసేపు మంతనాలు
ఈ నెల 28న టీడీపీ ఇన్‌చార్జ్ ప్రతిభాభారతికి వ్యతిరేకంగా రాజాం, రేగిడి, వంగర మండలాలకు చెందిన పలువురు టీడీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు అసమ్మతి సమావేశం పెట్టి మీడియా ముందుకు వచ్చి ఆమె అవినీతిని బయటపెట్టారు. ఈ అనూహ్య పరిణామంతో టీడీపీలోని మరో వర్గం తీవ్రంగా ప్రతిఘటించింది.
ప్రతిభాభారతి క్యాంపు కార్యాలయం వద్ద రాజాం నగర పంచాయతీకి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గంట సేపు మంతనాలు జరిపి.. కార్యాలయం నుంచి బయటకు వచ్చి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతిభా భారతిపై గిట్టని నేతలు బురద జల్లుతున్నారని ఆరోపిస్తూ నిప్పుల వర్షం కురిపించారు.
ఆరోపణలు రుజువుచేస్తే రాజకీయ సన్యాసం
రాజాం ఏఎంసీ వైస్ చైర్మన్ టంకాల కన్నంనాయుడు, జన్మభూమి కమిటీ మెంబర్లు అంపోలు శ్రీను, వాకముల్ల ప్రసాద్, ఉంగటి సత్యం తదితరులు మాట్లాడుతూ టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్సీగా ప్రతిభాభారతి ఎంతో కృషిచేశారని తెలిపారు. ఒక్క పైసా కూడా స్వలాభం చూసుకోలేదని అన్నారు. నాలుగేళ్లుగా రాజాంలో ఉంటూ టీడీపీకి సేవచేస్తున్నారని వివరించారు.
ఆమె పేరు చెప్పి ఎంతో మంది టీడీపీ నేతలు డబ్బులు సంపాదించుకుని జేబులు నింపుకొన్నారని పేర్కొన్నారు. ఆమెకు తెలియకుండా డబ్బులు దండుకుని ఇప్పుడు నిందలు మోపడం సమంజసం కాదని అన్నారు. ప్రతిభాభారతి అక్రమ వసూళ్లుకు పాల్పడ్డారని నిరూపిస్తే తామంతా రాజకీయ సన్యాసం తీసుకుంటామని సవాలు విసిరారు. ప్రతిభాభారతి పేరుతో డబ్బులు వసూలు చేసిన వారి పేర్లు నిర్బయంగా తెలపాలని, వాటిని అక్రమార్కులు నుంచి రికవరీ చేయిస్తామని అన్నారు.
ఆ నేతలు ఎటువైపు
ఈ నెల 28న జరిగిన సమావేశానికి గైర్హాజరైన టీడీపీ సీనియర్ నేతలు ప్రతిభాభారతి అనుచరుల సమావేశానికి కూడా రాలేదు. రాజాం ఏఎంసీ చైర్మన్ పైల వెంకటరమణతో పాటు పార్టీ నేతలు గురవాన నారాయణరావు, సంతకవిటి మండల మాజీ ఎంపీపీ కొల్ల అప్పలనాయుడు, వైస్ ఎంపీపీ గండ్రేటి కేసరి తదితర నేతలు ఈ సమావేశంలో కనిపించలేదు.
Comments
Please login to add a commentAdd a comment