‘వెలిగొండ’పై వైఎస్సార్‌సీపీ గళం
ఒంగోలు అర్బన్ : జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి సమావేశాల్లో వైఎస్సార్ సీపీ శాసన సభ్యులు తమ వాణి వినిపించారు. సమావేశాలు గురువారం మొదలై జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌ను అభినందిస్తూ మాట్లాడే అవకాశం జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలకు లభించింది. వారిలో వైఎస్సార్‌సీపీ నుంచి యర్రగొండపాలెం, మార్కాపురం ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి ఉన్నారు. తొలుత స్పీకర్‌గా ఎంపికైన డాక్టర్ కోడెల శివప్రసాద్‌రావును అభినందించారు.
ఈ సందర్భంగా వారిద్దరూ ప్రధానంగా వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. పశ్చిమ ప్రాంతం ప్రజల కష్టాలు వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితేనే తీరుతాయని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయిందని గుర్తుచేశారు. సభాపతి గతంలో భారీ నీటిపారుదల శాఖామాత్యులుగా పనిచేశారని వారికి వెలిగొండ ఆవశ్యకత తెలుసని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనికి స్పీకర్ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తాగు, సాగునీటి సమస్య తీరి పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందన్నారు.