ఏడాదికి 1000 కోట్లు
- మద్యంపై భారీ ఆదాయమే లక్ష్యం
- జిల్లాలో 234 వైన్ షాపుల ఏర్పాటుకు నిర్ణయం
- గత ఏడాది కంటే మూడు షాపులు అదనం
- నాలుగు కేటగిరీలుగా లెసైన్‌స ఫీజులు
- ఏజెన్సీలో ప్రత్యేక మార్గదర్శకాలతో 19 దుకాణాలు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మద్యం అమ్మకాల ద్వారా ఈ సంవత్సరం(2014-15)లో ప్రభుత్వం జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లా వ్యాప్తంగా 234 మద్యం దుకాణాలు (వైన్ షాపులు) ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. రెండేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలోని విధానానికి మార్పులు చేస్తూ కొత్త విధానం రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం... జిల్లాకు సంబంధించి ప్రత్యేక గెజిట్‌ను విడుదల చేసింది.
2011 జనాభా లెక్కల ఆధారంగా కొత్త షాపులను కేటాయించింది. గత ఏడాది జిల్లాలో 231 వైన్ షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయిరచగా... ఈ సారి మూడు షాపులు అదనంగా ఏర్పాటు చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలో గత సంవత్సరం వైన్ షాపుల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మూడు షాపులు మిగిలిపోయూయి. వాటిని ఈ ఏడాది మన జిల్లాకు కేటాయించారు. జిల్లాలో గత ఏడాది దరఖాస్తులు రాకుండా మిగిలిపోయిన భూపాలపల్లిలోని మూడు షాపులను కేసముద్రం, తొర్రూరు, మరిపెడకు... పరకాల షాపును వర్ధన్నపేటకు కేటాయించారు.
లెసైన్స్ ఫీజు ద్వారా రూ.93 కోట్లు
జనాభా ప్రాతిపదికన జిల్లాలో ఏర్పాటు చేయనున్న వైన్ షాపులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. రూ.32.5 లక్షల లెసైన్స్ ఫీజు మద్యం దుకాణాలు 86, రూ.34 లక్షలు లెసైన్స్ ఫీజు దుకాణాలు 84, రూ.42 లక్షల ఫీజు దుకాణాలు 24, రూ.68 లక్షల చొప్పున లెసైన్స్ పీజుల చెల్లించే మద్యం దుకాణాలు 40 ఉన్నాయి.
జిల్లాలో ఏర్పాటు చేయనున్న 234 వైన్ షాపులకు లెసైన్స్ రూపంలోనే రూ.93.59 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రానుంది. ఈ వైన్ షాపుల లెసైన్స్ కోసం చేసే దరఖాస్తు ఫీజు రూ.25 వేలు ఉంది. భారీగా రానున్న దరఖాస్తులతో ఈ మొత్తం కూడా భారీగానే ఉండనుంది.
ఈ షాపుల ఏర్పాటు తర్వాత విక్రయించే మద్యంతో ఏడాదిలో రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆదాయం తీరు చూసినా... ఇదే పరిస్థితి కనిస్తోంది. 2013-14 ఎక్సైజ్ సంవత్సరంలో మద్యం విక్రయాలపై నెలకు సగటున రూ.75 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఏడాదిలో రూ.900 కోట్లు వచ్చినట్లు అధికాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇది వెయ్యి కోట్ల రూపాయలు దాటుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఏజెన్సీలో 19 షాపులు
సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలోకి వచ్చే ఏజెన్సీ ప్రాంతాల్లో వైన్ షాపుల ఏర్పాటుకు ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయి. మన జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో 19 వైన్ షాపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏటూరునాగారం, ములుగు, గూడూరు ఎక్సైజ్ విభాగాల పరి ధిలోకి వచ్చే మండలాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.
ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో వైన్ షాపు ఏర్పాటు చేసేందుకు గ్రామసభల తీర్మానం తప్పనిసరి. మద్యం దుకాణం ఏర్పాటుకు ఇబ్బంది లేదని గ్రామసభ తీర్మానం చేస్తేనే అక్కడ వైన్ షాపు ఏర్పాటుకు అనుమతి ఉంటుంది. ఏజెన్సీలో వైన్ షాపు ల లెసైన్స్‌లను అక్కడి స్థానికలకే ఇస్తారు. ఐటీడీఏ పరిధిలో వైన్ షాపుల లెసైన్స్ కోసం దరఖాస్తు చేసే వారు స్థానికత, కులం సర్టిఫికెట్లు జత చేయాలి. వీటిని ప్రమాణికంగా తీసుకుని లాటరీలో దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రభుత్వ గెజిట్ ప్రకారం ప్రకారం జిల్లాలో మొత్తం 234 వైన్ షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ టెండర్ల ప్రక్రియను మొదలు పెట్టింది.
కొత్త విధానంలోనూ మద్యం దుకాణాల కేటాయింపునకు లాటరీ పద్ధతినే అవలంబించనున్నారు.
మద్యం దుకాణాల లెసైన్స్ పొందాలనుకునే వారు ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.25 వేలుగా నిర్ణయించారు. దరఖాస్తుతో పాటు ఫొటోలు, లెసైన్స్ ఫీజులో 10 శాతం ఈఎండీగా చెల్లించాలి. ఇది గరిష్టంగా రూ.5 లక్షలుగా నిర్ణయించారు.
ఈ నెల 23వ తేదీన హన్మకొండలోని రెడ్డి మ్యారేజ్ హాల్‌లో లాటరీ విధానం ద్వారా వైన్ షాపులను కేటాయించనున్నారు. ఒకరు ఎన్ని షాపులకు... ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా... లాటరీలో ఒక షాపు దక్కితే అక్కడితోనే సరిపెడతారు. మిగిలిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. లాటరీలో వైన్ షాపు దక్కిన వారు వెంటనే లెసైన్స్ ఫీజులో మూడో వంతు చెల్లించాలి.