The Communist Party
-
తెలంగాణ సాయుధ పోరాటం చేసిన చరిత్ర మాదే..
కందుకూరు, న్యూస్‌లైన్: స్వాతంత్య్రానికి పూర్వం నుంచే తెలంగాణ సాయుధ పోరాటం నడిపిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీలదేనని సీపీఎం సౌత్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఈఎస్‌ఎన్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో సోమవారం తెలంగాణ అవతరణ సందర్భంగా తెలంగాణ సమగ్రాభివృద్ధి పునరంకిత సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరవీరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కొత్త రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వాన కొలువుదీరిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై అన్నివర్గాల ప్రజలు కోటి ఆశల పెట్టుకున్నారన్నారు. ప్రజల ఆశల మేరకు ప్రభుత్వ పనితీరు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నివర్గాల వారికి సమన్యాయం జరిగే వరకు ప్రభుత్వానికి సీపీఎం మద్దతు తప్పకుండా ఉంటుందన్నారు. నిత్యావసరాల ధరలు అందుబాటులోకి తేవాలని, రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరాతోపాటు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి డి.రాంచందర్, డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు ఆర్.చందు, మండల కమిటీ సభ్యులు జి.పారిజాతం, సీహెచ్ నర్సింహ, శ్రీశైలం, డి.వెంకటరమణ, కె.భిక్షపతి, పి.శ్రీరాములు, నరహరి, ప్రభాకర్, శిమయ్య, మహేందర్, జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి సీపీఎం సంపూర్ణ మద్దతు అనంతగిరి : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీపీఎం సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకట్ అన్నారు. వికారాబాద్‌లోని సీపీఎం కార్యాలయంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ సభ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సమగ్ర అభివృద్ధి చేయాలన్నారు. పోలవరం డిజైన్ మార్పు చేయాలన్నారు. ఆర్డినెన్సును ఆపే విధంగా ఉద్యమించి కొత్త ముఖ్యమంత్రి చిత్తశుద్ది చూపించుకోవాలన్నారు. కేసీఆర్ ఇచ్చిన రైతుల రుణమాఫీ, సొంతిళ్లు, రూ.100 పెన్షన్ వంటి హామీలన్నింటినీ నెరవేర్చాలన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే ప్రజాపోరాటాలకు వెనుకాడబోమన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు కేటాయించిన నిధులను వారికే కేటాయించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నర్సంలు, అమరేశ్వర్, అశోక్, వెంకటేశం, వెంకటయ్య, శ్రీనివాస్, మహేందర్, మల్లేశం పాల్గొన్నారు. -
గతాన్ని మార్చేమహా మాయ
చైనా అధినేత క్సీ చైనా విప్లవం, కమ్యూనిస్టు పార్టీ చరిత్రను యథేచ్ఛగా మార్చి ‘జాతీయవాద’ చరిత్రగా పునర్నిర్మిస్తున్నారు. చైనా పంటి కింది రాయిలా ఉన్న తైవాన్ పాలకులు మాత్రం క్సీ ‘జాతీయవాదం’ ‘ఉదారవాదం’ చూసి రోజులు మూడినట్టేనని దడుచుకుంటున్నారు! వెనుక చూపే లేకుండా ముందుకు సాగే కాలంలో యథేచ్ఛగా గతంలోకి, భవిష్యత్తులోకి పయనించాలనే మనిషి ఉబలాటం వైజ్ఞానిక కాల్పనికతకు ఊపిరి. చైనా అధ్యక్షుడు క్సీ జింగ్పింగ్ నిజంగానే కాల చక్రాన్ని వెనక్కు తిప్పేసి, గతాన్ని యథేచ్ఛగా మార్చి పారేయగల శక్తివంతుడు. కాబట్టే ఆధునిక యుగం శిశువైన ప్రజాస్వామ్యం పుట్టుకను ఆయన క్రీస్తు పూర్వపు ప్రాచీన కాలానికి జరపగలిగారు. ‘పాశ్చాత్య ప్రజాస్వామ్యం ప్రాచీన గ్రీసు, రోమ్ల ప్రజాస్వామ్యం. అది వారి సాంప్రదాయం. మాకు మా సొంత ప్రజాస్వామ్యం ఉంది. అది మా సాంప్రదాయం’ అని పదే పదే చెప్పగలుగుతున్నారు. అంతరార్థం స్వయం విదితమే. చైనాలో ఇప్పుడున్నది నికార్సయిన చైనీయ ప్రజాస్వామ్యం. మరేదో ప్రజాస్వామ్యం కోసం అర్రులు చాచే అసమ్మతివాదులు, హక్కుల కార్యకర్తలంతా ‘ప్రజాస్వామ్య’ వ్యతిరేకులే! వారిని ఎవరు మాత్రం సహిస్తారు? ప్రాచీన గ్రీకు, రోమన్ సామ్రాజ్యాలు బానిస వ్యవస్థలు, కొద్ది మంది పౌరుల పరిమిత ప్రజాస్వామ్యాలనేది వేరే సంగతి. గతాన్ని మార్చగల ప్రతిభతో క్సీ 1930లు, 1940ల రైతాంగ విప్లవ చరిత్రను మటు మాయం చేసేశారు. తప్పదు మరి...140 కోట్ల జనాభాలో 47 శాతం గ్రామాల్లోనే నివసిస్తున్నారు. రాబోయే ఆరేళ్లలో వారిలో 10 కోట్ల మందిని నిర్వాసితులను చేసి వందలు లేదా వేల మైళ్ల దూరంలో ‘పునరావాసం’ కల్పించబోతున్నారు. యుద్ధ ప్రాతిపదికపై చైనా ఎడా పెడా నిర్మిస్తున్న భారీ నీటి ప్రాజెక్టులు, పారిశ్రామికీకరణల ప్రభావమిది. ఇప్పటికే అసంతృప్తితో ఉన్న రైతులకు, రైతాంగ పోరాటాలు, విప్లవాల గతాన్ని బోధించడం ఏం సబబు? వృద్ధి కోసం ‘త్యాగాలు’ తప్పపు. త్యాగాలను చేయించడానికి గతాన్ని మార్చడమూ తప్పదు. విప్లవ ప్రతీఘాతకునిగా చరిత్రకెక్కిన చాంగ్ కై షేక్ 1927లో షాంఘైలో వేల కొలది కమ్యూనిస్టులను ఊచకోత కోసి, వెంటాడి, వేటాడి తుడిచిపెట్టారు. విప్లవ విజయంతో (1949) ఫార్మోజాకు (నేటి తైవాన్) పారిపోయారు. క్సీ తన ‘కాల దండం’తో ఆయనను జాతీయవాదిగా మార్చేశారు. అలా అని పాఠ్య పుస్తకాలకు ఎక్కించడమే కాదు చైనా విప్లవ నేత మావో సే టుంగ్, సంస్కరణల కర్త డెంగ్ జియావో పింగ్ల సరసన నిలిపారు. అంతేకాదు చైనా విప్లవ మూలాలు క్రీ.పూ. 3వ శతాబ్ది నాటి క్వింగ్ రాచరిక పాలనలో ఉన్నాయని ‘కనిపెట్టారు.’ సహజంగానే ప్రజా చైనా రిపబ్లిక్ అవతరించిన 1949వ సంవత్సరం కూడా ప్రాధాన్యాన్ని కోల్పోయింది. ఇదంతా ఎందుకు? చైనాకు పోటీగా మరో ‘చైనా’గా ఉన్న తైవాన్ను విలీనం చేసేసుకోడానికి! చాంగ్ కై షేక్ మృత దేహం జన్మస్థలంలో తుది అంత్యక్రియలు జరుపుకోవడం కోసం తైవాన్‌లోని తాత్కాలిక సమాధిలో వేచి చూస్తోంది. ఉత్తర చైనాలోని ఫెంగువాలో చాంగ్ అంత్యక్రియలను ఘనంగా జరిపించి, స్మారక చిహ్నాన్ని నిర్మించ డానికి క్సీ సిద్ధమే. అమెరికా అండతో దశాబ్దాల తరబడి చైనా పంటి కింది రాయిలా ఉన్న తైవాన్ పాలకులు మాత్రం క్సీ ‘జాతీయవాదం’ ‘ఉదారవాదం’ చూసి రోజులు మూడినట్టేనని దడుచుకుంటున్నారు! క్సీ తన గ్రేటర్ చైనా ఆశలకు గతాన్ని మార్చడం మాత్రమే సరిపోదని కమ్యూనిస్టుల సాంస్కృతిక వారసత్వాన్ని క్రీస్తు పూర్వం 5, 6 శతాబ్దాల తత్వవేత్త కన్ఫ్యూషియస్ వరకు పొడిగించారు. ప్రతీఘాతుక తత్వవేత్తగా కమ్యూనిస్టుల విమర్శలకు గురైన కన్ప్యూషియస్ జన్మస్థలమైన క్సుఫును ఆయన గత ఏడాది సందర్శించారు. ఆయన నైతిక సూత్రావళి ఆదర్శం కావాలని సందేశం ఇచ్చారు. అంతేగాక మావో శైలిలో ‘మూడు చెడులపై పోరు.’ (వ్యభిచారం, జూదం, మాదకద్రవ్యాలు) ప్రారంభించారు. దీంతో హఠాత్తుగా గత నెలలో చైనా వ్యభిచార రాజధాని డోన్గ్గువాన్లోని రెండు లక్షల మంది సెక్స్ వర్కర్లపై దాడుల వార్తలు టీవీలో మారుమోగుతున్నాయి. అంతకు ముందే ప్రారంభించిన అవినీతిపై పోరులో ప్రజా విముక్తి సైన్యం మాజీ జనరల్ క్సు కై హూ, మాజీ ఆంతరంగిక భద్రతా మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు జోయాంగ్ కాంగ్‌లు ‘దొరికిపోయారు.’ చైనా నేతలందరికీ పదవులను అడ్డుపెట్టుకొని సంపదలను వెనకేసుకోవడం, జల్సాలు చేయడమూ ‘ఆమోదనీయమే.’ అందుకే వారిద్దరి అరెస్టులు సంచలనమయ్యాయి. పార్టీలో క్సీ ప్రత్యర్థి బో క్సిలాయ్కి వారిద్దరూ సన్నిహితులు కావడమే వారు చేసిన పాపమనేది బహిరంగ రహస్యం. జోరుగా సాగుతున్న ‘మూడు చెడులపై పోరు’ పార్టీ, ప్రభుత్వాలలోని అసమ్మతివాదుల నోళ్లు నొక్కడానికేనని అందరికీ తెలిసిందే. చైనాలో రాజకీయాలంటే నిప్పుతో చెలగాటమని నిన్నటిదాకా అనేవారు. చరిత్రతో చెలగాటమని కూడా చేర్చుకోవాలి. పి. గౌతమ్ -
తెల్లబోయిన ఎర్రజెండా
మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాలంలో 1951 ఎన్నికల్లో 12 నియోజకవర్గాలు ఉండేవి. నాలుగు ఇద్దరు ప్రతినిధుల నియోజకవర్గాలు ఉండేవి. ఒక సీటు జనరల్‌కు కేటాయించగా అదే నియోజకవర్గంలో రెండవ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించేవారు. జనరల్, రిజర్వు కేటగిరీల అభ్యర్థులు ఒకేసారి పోటీలో ఉంటారు. అందరిలో అత్యధికంగా ఓట్లు సంపాదించినవారు జనరల్ కేటగిరిలో విజేతలు అవుతారు. పోటీలో ఉన్న ఎస్సీ అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు గెలుచుకున్నవారు రిజర్వుడు స్థానం నుంచి గెలుపొందినట్టు ప్రకటిస్తారు. ఈ ప్రకారం జిల్లాలో 12 సీట్లలో 16 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. భద్రాచలం, కాకినాడ, అమలాపురం, రాజోలు ఇద్దరు అభ్యర్థుల నియోజకవర్గాలు. పిఠాపురం, రాజమండ్రి, కాకినాడ, రాజోలు నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులు విజయాలు సాధించారు. కాకినాడ, రాజమండ్రి, రాజోలు నియోజకవర్గాల్లో రిజర్వుడు అభ్యర్థులుగా కూడా కమ్యూనిస్టులే అసెంబ్లీకి వెళ్లారు. పిఠాపురం నుంచి ఆర్.వెంకట జగ్గారావు కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. రాజమండ్రి నుంచి చిట్టూరి ప్రభాకరచౌదరి కాంగ్రెస్‌కు చెందిన కె.ఎల్.నర్సింహారావుపై విజయం సాధించారు. కాకినాడ నుంచి చిత్తజల్లు వెంకట కృష్ణారావు కె.మోహన్‌రావుపై గెలుపొందారు. కాకినాడ రిజర్వుడు నియోజకవర్గం నుంచి కూడా కమ్యూనిస్టు పార్టీకే చెందిన సాకా వెంకటరావు అసెంబ్లీకి వెళ్లారు. రాజోలు నుంచి అల్లూరి వెంకట కృష్ణారావు కిసాన్ మజ్దూర్ పార్టీ అభ్యర్థి ఆకుల బులిస్వామిపై గెలిచారు. రిజర్వుడు అభ్యర్థిగా గంజి నాగేశ్వరరావు అసెంబ్లీకి వెళ్లారు. కమ్యూనిస్టుల విజయ పరంపర 1955 ఎన్నికల్లో కూడా కొనసాగింది. జిల్లాలో అంతర్భాగంగా ఉన్న భద్రాచలం నుంచి జనరల్, రిజర్వుడు అభ్యర్థులుగా ఇద్దరూ కమ్యూనిస్టులే అసెంబ్లీ గుమ్మం తొక్కారు. ఈసారి రాజమండ్రి, కాకినాడ స్థానాలు కోల్పోయి, సామర్లకోట, పెద్దాపురం, రాజోలు స్థానాల నుంచి గెలుపొందారు. రాజోలు నుంచి రిజర్వుడు అభ్యర్థిగా కూడా కమ్యూనిస్టు ప్రాతినిధ్యం వహించారు. భద్రాచలం నుంచి మహమ్మద్ తహసీల్ తన సమీప కమ్యూనిస్టు అభ్యర్థి శ్యామల సీతారామయ్యపై గెలుపొందారు. ద్వితీయ స్థానంలో ఉన్న సీతారామయ్య కూడా రిజర్వు అభ్యర్థిగా అసెంబ్లీకి వెళ్లారు. పెద్దాపురం నుంచి దూర్వాసుల వెంకట సుబ్బారావు తన సమీప అభ్యర్థి కృషీకార్ లోక్పార్టీకి చెందిన చల్లా అప్పారావుపై గెలుపొందారు. సామర్లకోట నుంచి పుత్సల వెంకటరావు కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీచేసి కృషీకార్ లోక్పార్టీకి చెందిన కాకరాల కామేశ్వరరావుపై గెలుపొందారు. రాజోలు నుంచి అల్లూరి వెంకటరామరాజు మరోసారి గెలి చారు. ప్రజాపార్టీకి చెందిన ఆకుల బాలాస్వామిపై గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి రిజర్వుడు అభ్యర్థిగా గంజి నాగేశ్వరరావు కూడా మరోసారి అసెంబ్లీకి వెళ్లారు. 1962 ఎన్నికల నుంచి కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. 1967 ఎన్నికలతో వీరి శకం ముగిసింది. 1972లో సీపీఐ, సీపీఎంలు రాజమండ్రి, పెద్దాపురం, పిఠాపురం, సంపర, నగరం స్థానాల్లో పోటీచేసినా ఒక్కచోటా గెలువలేదు. అప్పటి నుంచీ మరే ఎన్నికల్లోనూ జిల్లా నుంచి కమ్యూనిస్టులు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించలేకపోయారు. జిల్లా నుంచి 1962లో అనపర్తి నుంచి పాలచర్ల పరశురామన్న కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరెడ్డిపై గెలుపొందారు. చిట్టూరి ప్రభాకరచౌదరి 1967లో మరోసారి రాజమండ్రి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పీవీ రావుపై విజయం సాధించారు. పెద్దాపురం నుంచి ఉండవల్లి నారాయణమూర్తి కాంగ్రెస్ అభ్యర్థి కొండపల్లి కృష్ణమూర్తిపై విజయం సాధించారు. వీరిద్దరితో కమ్యూనిస్టుల జైత్రయాత్రకు జిల్లాలో తెర పడింది, నాటినుంచి కమ్యూనిస్టులను ప్రజా ఉద్యమకారులుగానే గుర్తించారు తప్ప ఓ రాజకీయ పార్టీగా పరిగణించి ఓట్లు వేయడం లేదు. కనీసం రెండు మూడు స్థానాలకు కూడా ఎగబాకలేని పరిస్థితికి చేరుకున్నారు.