గతాన్ని మార్చేమహా మాయ | forget the Marcemaha past Maya | Sakshi
Sakshi News home page

గతాన్ని మార్చేమహా మాయ

Published Mon, Mar 31 2014 11:48 PM | Last Updated on Mon, Aug 13 2018 3:45 PM

గతాన్ని మార్చేమహా మాయ - Sakshi

గతాన్ని మార్చేమహా మాయ

 చైనా అధినేత క్సీ చైనా విప్లవం, కమ్యూనిస్టు పార్టీ చరిత్రను యథేచ్ఛగా మార్చి ‘జాతీయవాద’ చరిత్రగా పునర్నిర్మిస్తున్నారు.  చైనా పంటి కింది రాయిలా ఉన్న తైవాన్ పాలకులు మాత్రం క్సీ ‘జాతీయవాదం’ ‘ఉదారవాదం’ చూసి రోజులు మూడినట్టేనని దడుచుకుంటున్నారు!
 
 వెనుక చూపే లేకుండా ముందుకు సాగే కాలంలో యథేచ్ఛగా గతంలోకి, భవిష్యత్తులోకి పయనించాలనే మనిషి ఉబలాటం వైజ్ఞానిక కాల్పనికతకు ఊపిరి. చైనా అధ్యక్షుడు క్సీ జింగ్‌పింగ్ నిజంగానే కాల చక్రాన్ని వెనక్కు తిప్పేసి, గతాన్ని యథేచ్ఛగా మార్చి పారేయగల శక్తివంతుడు. కాబట్టే ఆధునిక యుగం శిశువైన ప్రజాస్వామ్యం పుట్టుకను ఆయన క్రీస్తు పూర్వపు ప్రాచీన కాలానికి జరపగలిగారు. ‘పాశ్చాత్య ప్రజాస్వామ్యం ప్రాచీన గ్రీసు, రోమ్‌ల ప్రజాస్వామ్యం. అది వారి సాంప్రదాయం. మాకు మా సొంత ప్రజాస్వామ్యం ఉంది. అది మా సాంప్రదాయం’ అని పదే పదే చెప్పగలుగుతున్నారు.
 
  అంతరార్థం స్వయం విదితమే. చైనాలో ఇప్పుడున్నది నికార్సయిన చైనీయ ప్రజాస్వామ్యం. మరేదో ప్రజాస్వామ్యం కోసం అర్రులు చాచే అసమ్మతివాదులు, హక్కుల కార్యకర్తలంతా ‘ప్రజాస్వామ్య’ వ్యతిరేకులే! వారిని ఎవరు మాత్రం సహిస్తారు? ప్రాచీన గ్రీకు, రోమన్ సామ్రాజ్యాలు బానిస వ్యవస్థలు, కొద్ది మంది పౌరుల పరిమిత ప్రజాస్వామ్యాలనేది వేరే సంగతి. గతాన్ని మార్చగల ప్రతిభతో క్సీ 1930లు, 1940ల రైతాంగ  విప్లవ చరిత్రను మటు మాయం చేసేశారు. తప్పదు మరి...140 కోట్ల జనాభాలో 47 శాతం గ్రామాల్లోనే నివసిస్తున్నారు. రాబోయే ఆరేళ్లలో వారిలో 10 కోట్ల మందిని నిర్వాసితులను చేసి వందలు లేదా వేల మైళ్ల దూరంలో ‘పునరావాసం’ కల్పించబోతున్నారు. యుద్ధ ప్రాతిపదికపై చైనా ఎడా పెడా నిర్మిస్తున్న భారీ నీటి ప్రాజెక్టులు, పారిశ్రామికీకరణల ప్రభావమిది. ఇప్పటికే అసంతృప్తితో ఉన్న రైతులకు, రైతాంగ పోరాటాలు, విప్లవాల గతాన్ని బోధించడం ఏం సబబు? వృద్ధి కోసం ‘త్యాగాలు’ తప్పపు. త్యాగాలను చేయించడానికి గతాన్ని మార్చడమూ తప్పదు.
 
  విప్లవ ప్రతీఘాతకునిగా చరిత్రకెక్కిన చాంగ్ కై షేక్ 1927లో షాంఘైలో వేల కొలది కమ్యూనిస్టులను ఊచకోత కోసి, వెంటాడి, వేటాడి తుడిచిపెట్టారు. విప్లవ విజయంతో (1949) ఫార్మోజాకు (నేటి తైవాన్) పారిపోయారు. క్సీ తన ‘కాల దండం’తో ఆయనను జాతీయవాదిగా మార్చేశారు. అలా అని పాఠ్య పుస్తకాలకు ఎక్కించడమే కాదు చైనా విప్లవ  నేత మావో సే టుంగ్, సంస్కరణల కర్త డెంగ్ జియావో పింగ్‌ల సరసన నిలిపారు. అంతేకాదు చైనా విప్లవ మూలాలు  క్రీ.పూ. 3వ శతాబ్ది నాటి క్వింగ్ రాచరిక పాలనలో ఉన్నాయని ‘కనిపెట్టారు.’ సహజంగానే ప్రజా చైనా రిపబ్లిక్ అవతరించిన 1949వ సంవత్సరం కూడా ప్రాధాన్యాన్ని కోల్పోయింది. ఇదంతా ఎందుకు? చైనాకు   పోటీగా మరో ‘చైనా’గా ఉన్న తైవాన్‌ను విలీనం చేసేసుకోడానికి! చాంగ్ కై షేక్ మృత దేహం జన్మస్థలంలో తుది అంత్యక్రియలు జరుపుకోవడం కోసం తైవాన్‌లోని తాత్కాలిక సమాధిలో వేచి చూస్తోంది. ఉత్తర చైనాలోని ఫెంగువాలో చాంగ్ అంత్యక్రియలను ఘనంగా జరిపించి, స్మారక చిహ్నాన్ని నిర్మించ డానికి క్సీ సిద్ధమే. అమెరికా అండతో దశాబ్దాల తరబడి చైనా పంటి కింది రాయిలా ఉన్న తైవాన్ పాలకులు మాత్రం క్సీ ‘జాతీయవాదం’ ‘ఉదారవాదం’ చూసి రోజులు మూడినట్టేనని దడుచుకుంటున్నారు!
 
 క్సీ తన గ్రేటర్ చైనా ఆశలకు గతాన్ని మార్చడం మాత్రమే సరిపోదని కమ్యూనిస్టుల సాంస్కృతిక వారసత్వాన్ని క్రీస్తు పూర్వం 5, 6 శతాబ్దాల తత్వవేత్త కన్‌ఫ్యూషియస్ వరకు పొడిగించారు. ప్రతీఘాతుక తత్వవేత్తగా కమ్యూనిస్టుల విమర్శలకు గురైన కన్‌ప్యూషియస్ జన్మస్థలమైన క్సుఫును ఆయన గత ఏడాది సందర్శించారు. ఆయన నైతిక సూత్రావళి ఆదర్శం కావాలని సందేశం ఇచ్చారు. అంతేగాక మావో శైలిలో ‘మూడు చెడులపై పోరు.’ (వ్యభిచారం, జూదం, మాదకద్రవ్యాలు) ప్రారంభించారు. దీంతో హఠాత్తుగా గత నెలలో చైనా వ్యభిచార రాజధాని డోన్‌గ్గువాన్‌లోని రెండు లక్షల మంది సెక్స్ వర్కర్లపై దాడుల వార్తలు టీవీలో మారుమోగుతున్నాయి.
 
 అంతకు ముందే ప్రారంభించిన అవినీతిపై పోరులో ప్రజా విముక్తి సైన్యం మాజీ జనరల్ క్సు కై హూ, మాజీ ఆంతరంగిక భద్రతా మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు జోయాంగ్ కాంగ్‌లు ‘దొరికిపోయారు.’ చైనా నేతలందరికీ పదవులను అడ్డుపెట్టుకొని సంపదలను వెనకేసుకోవడం, జల్సాలు చేయడమూ ‘ఆమోదనీయమే.’ అందుకే వారిద్దరి అరెస్టులు సంచలనమయ్యాయి. పార్టీలో క్సీ ప్రత్యర్థి బో క్సిలాయ్‌కి వారిద్దరూ సన్నిహితులు కావడమే వారు చేసిన పాపమనేది బహిరంగ రహస్యం. జోరుగా సాగుతున్న ‘మూడు చెడులపై పోరు’ పార్టీ, ప్రభుత్వాలలోని అసమ్మతివాదుల నోళ్లు నొక్కడానికేనని అందరికీ తెలిసిందే. చైనాలో రాజకీయాలంటే నిప్పుతో చెలగాటమని నిన్నటిదాకా అనేవారు. చరిత్రతో చెలగాటమని కూడా చేర్చుకోవాలి.    
 పి. గౌతమ్
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement