చైనా నేతల జూదం జోరు!
మకావ్ వైభోగానికి మూల కారణమైన కస్టమర్లు పార్టీ నేతలు, ప్రభుత్వాధికారులే. ‘ప్రజా సేవలో’ నానా గడ్డి కరిచిన అభినవ కుబేరులు ‘ప్రపంచ పాప నగరి’లో ఖర్చు చేసి సేద తీరుతారు. నిఘా నేత్రాలకు దొరక్కుండా కమ్యూనిస్టు కుబేరుల ముచ్చట తీర్చే ప్రత్యేక రహస్య జూద మందిరాలూ ఉంటాయి.
జూదగృహాల ప్రపంచ రాజధాని ఏది? అమెరికాలోని లాస్‌వేగస్ ఆ హోదాను కోల్పోయింది. చైనాలో ఒక ప్రత్యేక పరిపాలనా ప్రాంతంగా ఉన్న ‘మకావ్’ ప్రపంచ జూదగృహాలకు నేటి రాజధాని. పోర్చుగల్ చిట్టచివరి వలస మకావ్ 1999లో చైనా చేతికి వచ్చింది. ‘కమ్యూనిస్టు’ పాలనలో అది ‘మహర్దశను’ అందుకుంది. ‘తూర్పు లాస్‌వేగస్’గా ఒకప్పుడు మసక వెలుతుర్లో, పొగాకు ధూమం నిండిన ఇరుకు గదుల జూదశాలలకు మకావ్ సెలవు పలికేసింది. వాటికి అనుబంధంగా ఉండే వ్యభిచార గృహాలు కూడా అదృశ్యమైపోయాయి. మహారాజ ప్రాసాదాలను తల దన్నే అద్భుత, విలాస భవనాల ధగధగలతో అలరారే కేసినోలు 33 అవతరిం చాయి. లాస్‌వేగస్‌ను ‘పడమటి మకావ్’గా పిలుచుకోవాల్సిందే. గత ఏడాది మకావ్ కేసినోల టర్నోవర్ లాస్‌వేగస్‌తో పోలిస్తే ఆరు రెట్ల కంటే ఎక్కువ... 3,800 కోట్ల డాలర్లు!
మకావ్ జూదగృహాలను పావనం చేసే వారిలో కుబేరులూ ఉంటారు. చేతి చమురు వదుల్చుకునే మధ్యతరగతి వారూ ఉంటారు. చైనాలో జూదం నిషిద్ధం. దక్షిణ చైనా సముద్ర తీరంలోని మకావ్‌కు చైనా జూదరులు బారు లు తీరుతారు. అయితే మకావ్ వైభోగానికి మూల కారణమైన కస్టమర్లు మాత్రం కమ్యూనిస్టుపార్టీ నేతలు, ప్రభుత్వాధికారులే. ‘ప్రజా సేవలో’ నానా గడ్డికరిచిన అభినవ కుబేరులు ‘ప్రపంచ పాప నగరి’లో ఖర్చు చేసి సేద తీరుతారు. వెనీషియన్ కేసినో ప్రపంచంలోనే అతి పెద్ద జూదగృహం. అక్కడి కేసినోల ముందు అత్యంత విలాసవంతమైన స్టార్ హోటళ్లు ఎం దుకూ కొరగావనిపిస్తాయి. ఆహార విహా రాలు, బార్లు, పబ్బులు, విడిది సకల సౌకర్యాలు అక్కడే. లాస్‌వేగస్‌లాగే స్ట్రిప్ టీజ్ నగ్ననృత్యాలకు కొదవలేదు. అయితే అడుగడుగునా చైనా ప్రభుత్వ నిఘా నేత్రాలు తప్పవు. వాటికి దొరక్కుండా కమ్యూనిస్టు కుబేరుల ముచ్చట తీర్చే ప్రత్యేక రహస్య జూద మంది రాలూ ఉంటాయి. జూదం బకాయిల కోసం కోర్టులకు ఎక్కలేమనే దిగులు అక్కర్లేదు. మకావ్‌కు అరవై కిలోమీటర్ల దూరంలోని హాంకాంగ్ కూడా చైనాలోని ప్రత్యేక పరిపాలనా ప్రాంతమే.
అక్కడి మాఫియా గ్యాంగులు కమ్యూనిస్టు నేతలకంటే ముందే వారికి కావాల్సిన డబ్బును అక్కడకు చేరవేస్తాయి, బకాయిల గొడవా చూసుకుంటాయి. ఎన్ని ఉంటేనేం? సకల వ్యసనాలకు రాణి వ్యభిచారం లేకపోయాక? ఆ దిగులూ అక్కర్లేదు. మకావ్ ‘డేటింగ్ గర్ల్స్’కు ప్రసిద్ధి. ఆసియా ‘ప్రేమ పక్షులు’ రోజులు, వారాల లెక్కన కొనుక్కునే ‘ప్రేమ’ను నిజమైన ప్రేమానురాగాలతో, సేవాభావంతో రంగరిం చి మరీ అందిస్తారని ప్రతీతి. అందుకే మకావ్‌కు పర్యాటకుల సంఖ్య పెరిగిపోతోంది. ‘డేటింగ్ గర్ల్స్’ సేవలు వ్యభిచారమేనని అల్లరి చేసేవాళ్లకు ఆ యువతులు స్వచ్ఛందంగా అక్కడికి చేరినవారేనని గుర్తు చేస్తుంటారు. అదీ నిజమే. కాకపోతే వాళ్లకు చైనా ప్రధాన భూభాగంలో ముసలి తల్లిదండ్రులో, పిల్లలో ఉంటారు. వారి పోషణ కోసం, సుఖసంతోషాల కోసం ‘స్వచ్ఛందంగా’నే వాళ్లు ప్రేమను అమ్ముకుంటారు.
ఇటీవలి కాలంలో చైనా నూతన నాయకత్వం అవినీతి భరతం పట్టేస్తామంటోంది. దీంతో అవినీతి చక్రవర్తులు ఎందుకైనా మంచిదని తమ విహారాల స్థానా న్ని సింగపూర్‌కు మారుస్తున్నారు. దక్షిణ చైనా సముద్ర ప్రాంతమంతటా జూదగృహ వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. చైనాకు ధీటైన ప్రాం తీయ శక్తిగా మారాలని ఆరాటపడుతున్న మన ప్రభుత్వం కూడా మకావ్ లాగే వీసాలు అవసరం లేని ఓ జూద నగరాన్ని నిర్మించడా నికి పూనుకోదని ఆశిద్దాం.
- పి. గౌతమ్