P.gowtham
-
గతాన్ని మార్చేమహా మాయ
చైనా అధినేత క్సీ చైనా విప్లవం, కమ్యూనిస్టు పార్టీ చరిత్రను యథేచ్ఛగా మార్చి ‘జాతీయవాద’ చరిత్రగా పునర్నిర్మిస్తున్నారు. చైనా పంటి కింది రాయిలా ఉన్న తైవాన్ పాలకులు మాత్రం క్సీ ‘జాతీయవాదం’ ‘ఉదారవాదం’ చూసి రోజులు మూడినట్టేనని దడుచుకుంటున్నారు! వెనుక చూపే లేకుండా ముందుకు సాగే కాలంలో యథేచ్ఛగా గతంలోకి, భవిష్యత్తులోకి పయనించాలనే మనిషి ఉబలాటం వైజ్ఞానిక కాల్పనికతకు ఊపిరి. చైనా అధ్యక్షుడు క్సీ జింగ్పింగ్ నిజంగానే కాల చక్రాన్ని వెనక్కు తిప్పేసి, గతాన్ని యథేచ్ఛగా మార్చి పారేయగల శక్తివంతుడు. కాబట్టే ఆధునిక యుగం శిశువైన ప్రజాస్వామ్యం పుట్టుకను ఆయన క్రీస్తు పూర్వపు ప్రాచీన కాలానికి జరపగలిగారు. ‘పాశ్చాత్య ప్రజాస్వామ్యం ప్రాచీన గ్రీసు, రోమ్ల ప్రజాస్వామ్యం. అది వారి సాంప్రదాయం. మాకు మా సొంత ప్రజాస్వామ్యం ఉంది. అది మా సాంప్రదాయం’ అని పదే పదే చెప్పగలుగుతున్నారు. అంతరార్థం స్వయం విదితమే. చైనాలో ఇప్పుడున్నది నికార్సయిన చైనీయ ప్రజాస్వామ్యం. మరేదో ప్రజాస్వామ్యం కోసం అర్రులు చాచే అసమ్మతివాదులు, హక్కుల కార్యకర్తలంతా ‘ప్రజాస్వామ్య’ వ్యతిరేకులే! వారిని ఎవరు మాత్రం సహిస్తారు? ప్రాచీన గ్రీకు, రోమన్ సామ్రాజ్యాలు బానిస వ్యవస్థలు, కొద్ది మంది పౌరుల పరిమిత ప్రజాస్వామ్యాలనేది వేరే సంగతి. గతాన్ని మార్చగల ప్రతిభతో క్సీ 1930లు, 1940ల రైతాంగ విప్లవ చరిత్రను మటు మాయం చేసేశారు. తప్పదు మరి...140 కోట్ల జనాభాలో 47 శాతం గ్రామాల్లోనే నివసిస్తున్నారు. రాబోయే ఆరేళ్లలో వారిలో 10 కోట్ల మందిని నిర్వాసితులను చేసి వందలు లేదా వేల మైళ్ల దూరంలో ‘పునరావాసం’ కల్పించబోతున్నారు. యుద్ధ ప్రాతిపదికపై చైనా ఎడా పెడా నిర్మిస్తున్న భారీ నీటి ప్రాజెక్టులు, పారిశ్రామికీకరణల ప్రభావమిది. ఇప్పటికే అసంతృప్తితో ఉన్న రైతులకు, రైతాంగ పోరాటాలు, విప్లవాల గతాన్ని బోధించడం ఏం సబబు? వృద్ధి కోసం ‘త్యాగాలు’ తప్పపు. త్యాగాలను చేయించడానికి గతాన్ని మార్చడమూ తప్పదు. విప్లవ ప్రతీఘాతకునిగా చరిత్రకెక్కిన చాంగ్ కై షేక్ 1927లో షాంఘైలో వేల కొలది కమ్యూనిస్టులను ఊచకోత కోసి, వెంటాడి, వేటాడి తుడిచిపెట్టారు. విప్లవ విజయంతో (1949) ఫార్మోజాకు (నేటి తైవాన్) పారిపోయారు. క్సీ తన ‘కాల దండం’తో ఆయనను జాతీయవాదిగా మార్చేశారు. అలా అని పాఠ్య పుస్తకాలకు ఎక్కించడమే కాదు చైనా విప్లవ నేత మావో సే టుంగ్, సంస్కరణల కర్త డెంగ్ జియావో పింగ్ల సరసన నిలిపారు. అంతేకాదు చైనా విప్లవ మూలాలు క్రీ.పూ. 3వ శతాబ్ది నాటి క్వింగ్ రాచరిక పాలనలో ఉన్నాయని ‘కనిపెట్టారు.’ సహజంగానే ప్రజా చైనా రిపబ్లిక్ అవతరించిన 1949వ సంవత్సరం కూడా ప్రాధాన్యాన్ని కోల్పోయింది. ఇదంతా ఎందుకు? చైనాకు పోటీగా మరో ‘చైనా’గా ఉన్న తైవాన్ను విలీనం చేసేసుకోడానికి! చాంగ్ కై షేక్ మృత దేహం జన్మస్థలంలో తుది అంత్యక్రియలు జరుపుకోవడం కోసం తైవాన్‌లోని తాత్కాలిక సమాధిలో వేచి చూస్తోంది. ఉత్తర చైనాలోని ఫెంగువాలో చాంగ్ అంత్యక్రియలను ఘనంగా జరిపించి, స్మారక చిహ్నాన్ని నిర్మించ డానికి క్సీ సిద్ధమే. అమెరికా అండతో దశాబ్దాల తరబడి చైనా పంటి కింది రాయిలా ఉన్న తైవాన్ పాలకులు మాత్రం క్సీ ‘జాతీయవాదం’ ‘ఉదారవాదం’ చూసి రోజులు మూడినట్టేనని దడుచుకుంటున్నారు! క్సీ తన గ్రేటర్ చైనా ఆశలకు గతాన్ని మార్చడం మాత్రమే సరిపోదని కమ్యూనిస్టుల సాంస్కృతిక వారసత్వాన్ని క్రీస్తు పూర్వం 5, 6 శతాబ్దాల తత్వవేత్త కన్ఫ్యూషియస్ వరకు పొడిగించారు. ప్రతీఘాతుక తత్వవేత్తగా కమ్యూనిస్టుల విమర్శలకు గురైన కన్ప్యూషియస్ జన్మస్థలమైన క్సుఫును ఆయన గత ఏడాది సందర్శించారు. ఆయన నైతిక సూత్రావళి ఆదర్శం కావాలని సందేశం ఇచ్చారు. అంతేగాక మావో శైలిలో ‘మూడు చెడులపై పోరు.’ (వ్యభిచారం, జూదం, మాదకద్రవ్యాలు) ప్రారంభించారు. దీంతో హఠాత్తుగా గత నెలలో చైనా వ్యభిచార రాజధాని డోన్గ్గువాన్లోని రెండు లక్షల మంది సెక్స్ వర్కర్లపై దాడుల వార్తలు టీవీలో మారుమోగుతున్నాయి. అంతకు ముందే ప్రారంభించిన అవినీతిపై పోరులో ప్రజా విముక్తి సైన్యం మాజీ జనరల్ క్సు కై హూ, మాజీ ఆంతరంగిక భద్రతా మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు జోయాంగ్ కాంగ్‌లు ‘దొరికిపోయారు.’ చైనా నేతలందరికీ పదవులను అడ్డుపెట్టుకొని సంపదలను వెనకేసుకోవడం, జల్సాలు చేయడమూ ‘ఆమోదనీయమే.’ అందుకే వారిద్దరి అరెస్టులు సంచలనమయ్యాయి. పార్టీలో క్సీ ప్రత్యర్థి బో క్సిలాయ్కి వారిద్దరూ సన్నిహితులు కావడమే వారు చేసిన పాపమనేది బహిరంగ రహస్యం. జోరుగా సాగుతున్న ‘మూడు చెడులపై పోరు’ పార్టీ, ప్రభుత్వాలలోని అసమ్మతివాదుల నోళ్లు నొక్కడానికేనని అందరికీ తెలిసిందే. చైనాలో రాజకీయాలంటే నిప్పుతో చెలగాటమని నిన్నటిదాకా అనేవారు. చరిత్రతో చెలగాటమని కూడా చేర్చుకోవాలి. పి. గౌతమ్ -
రెండు తలల కారుణ్యం
జీవకారుణ్యాన్ని బోధించిన బుద్ధుడు పుట్టిన దేశంలో కారుణ్యం ఇంకా మిగిలే ఉందా? లేని వాళ్లకు లేదు, ఉన్నవాళ్లకు ఉందని చెప్పడం ఉత్తమం. ఎక్కడో దూరాన లేకున్నా కన్నతండ్రి అంత్యక్రియలకు వెళ్లలేని నిస్సహాయుడిని చేసిన కనికరం లేని కాకీతనానికి ఒక కొడుకు కుళ్లి కుళ్లి విలపించాల్సి వచ్చిందంటే... లేదనే అనుకోవాల్సి వస్తుం ది. దేశంలో ఇలాంటి అనామకులు ఎందరో ఉన్నారనుకోడానికి లేదు. ఎస్పీ ఉదయ్‌కుమార్ రాజనీతి శాస్త్రంలో డాక్టరేటు పట్టా ఉన్న ఉన్నత విద్యావంతుడు. ఈ నెల 12న మరణించిన పుష్పరాయన్ అంత్యక్రియలకు కొడుకు రాక పోతేనేం? రెండు వందల మంది పోలీసులొచ్చారు... ‘దేశద్రోహి’, ప్రభుత్వాన్ని కూలదోయ యత్నించిన ‘కుట్రదారు’ వంటి కేసులున్న ఉదయ్‌కుమార్ వస్తే పట్టుకుందామని. ఆయన దేశాన్నేగాదు, ప్రపంచం దృష్టిని సైతం ఆకర్షించిన కూడంకుళం ఉద్యమ నేత. రెండేళ్లపాటూ జాతీయ మీడియాలో ప్రధాన వార్తగా నిలిచిన గొప్ప ప్రజాందోళన నిర్వహించిన ‘అణు విద్యుత్ వ్యతిరేక ప్రజా ఉద్యమం’ (పీమూఎఏఈ) వ్యవస్థాపకుడు. ఆయనేమీ అజ్ఞాత ఉగ్రవాది కాడు. తమిళనాడు తిరునల్వేలి జిల్లాలోని కూడంకుళంకు కూతవేటు దూరంలోని ఇందియంతకరై గ్రామంలోనే గత రెండేళ్లుగా ఉంటున్నారు. జైలు గోడల మధ్య లేకున్నా ఆయన బందీ. ఆయనే కాదు ఆ గ్రామమే బందీ. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ‘క్రిమినల్ గ్రామం’గా ప్రకటిం చింది. గ్రామ సరిహద్దులు దాటి ఎవరూ బయటికి పోరాదు, రారాదు! కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారంతో ఆ తీరానికి ముప్పున్నదని ఉదయ్‌కుమార్ వాదన. ఒక సునామీ దెబ్బ తిని, జపాన్‌లోని మరో సునామీ సృష్టించిన ఫకూషిమా అణు విధ్వంసాన్ని చూసి కలిగిన భయం అది. ప్రభుత్వం అంటున్నట్టుగా కూడంకుళం ప్రమాదాలకు తావు లేనిదే అయినా... కాలుష్యం అంటక నిర్మలంగా ఉన్న ఆ తీర జీవపర్యావరణ వ్యవస్థను, మత్స్యకారుల జీవనోపాధిని కాటేస్తుందని ఆయన భయం. పర్యావరణ సంతులనం దెబ్బతినడం వల్ల కలిగే ఉత్పాతాలను గుర్తించే వారెవరూ తీసిపారేయలేని సమంజసమైన ఆందోళన. అన్నిటికీ మించి ఉదయ్‌కుమార్ లేవనెత్తిన ప్రశ్న మౌలికమైనది... ‘అణుశక్తి పారిశ్రామిక పట్టణాల కోసమే తప్ప గ్రామీణ ప్రాంతాల కోసం కాదు.’ అలాంటప్పుడు నగరాలు, పట్టణాల విలాసవంతమైన విచ్చలవిడి వినియోగ సంస్కృతిని పోషించడానికి గ్రామాలు వల్లకాళ్లు ఎందుకు కావాలి? సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మన అభివృద్ధి నమూనాను, దానికి ప్రాతిపదికగా ఉన్న సామాజిక విలువలను మెడ బట్టి నిల దీసే ప్రశ్న. ప్రభుత్వాలకు పట్టని ఈ ప్రశ్న కూడంకుళం ప్రజలకు పట్టింది. ప్రజలు ‘అధికారాన్ని’ ప్రశ్నించడం అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఉద్యమం సాగుతున్నన్నాళ్లూ కరెంటే కాదు, పసిపిల్లలకు పాలు సైతం అందకుండా నిరాకరించాయి. ఏమైతేనేం, మే నెలలో సుప్రీం కోర్టు కూడంకుళం అణు విద్యుదుత్పత్తికి పచ్చజెండా చూపింది. అది నిర్విఘ్నంగా సాగుతోంది. అదే న్యాయస్థానం ఉద్యమకారులపై అణచివేతను తప్పుపట్టి, కేసులను ఉపసంహరించుకోమని హితవు పలికింది. అయితే ‘అధికార’ ధిక్కారానికి పాల్పడ్డ వారిని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కనికరించ దలచలేదు. కేసులు అలాగే ఉన్నాయి, క్రిమినల్ గ్రామం ఇందియంతకరై నానా అగ చాట్లు పడుతూనే ఉంది. కనికరమే లేదనిపించే మన దేశంలోనే మరో చోట కారుణ్యం పొంగి పొర్లుతోంది. బాలీవుడ్ నటుడు సంజ య్‌దత్ భార్య మాన్యత అనారోగ్యంతో బాధపడుతున్నదని తెలిసిన వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం చలించి ఆగమేఘాలపై కనికరించింది. సంజయ్ కోరిందే తడవుగా... భార్యను చూడటానికి కోర్టు నెలరోజుల పెరోల్‌ను మం జూరు చేసింది. శనివారం ఆయన విడుదలయ్యారు. 1983 బాంబు పేలుళ్ల కేసులో ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద సం జయ్‌పై పలు అభియోగాలు మోపారు. పేలుళ్లతో ఎలాం టి సంబంధమూ లేకున్నా ఆయన అక్రమంగా ఏకే-47 రైఫిల్‌ను కొని, దాచి, మాయం చేసి తీవ్ర నేరాలకు పాల్పడ్డట్టు రుజువైంది. దీంతో మే నుంచి ఎరవాడ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఎంతటి తీవ్ర నేరస్తులైనా అనారోగ్యంతో ఉన్న భార్యను చూసిరావడానికి పెరోల్ ఇవ్వ డం సమంజసమే. కానీ పెరోల్ అన్నదే లేకుండా జీవితకాలమంతా జైళ్లల్లో మగ్గుతున్నవారు, విచారణే లేకుండా దశాబ్దాల తరబడి పడి ఉంటున్నవారు ఉన్న స్థితిలో... భార్యను చూడ్డానికి సంజయ్‌కు ఏకంగా నెలరోజుల పెరోల్. ఆరు నెలల్లో మూడోసారి! ముందటి రెండూ ఆయన అనారోగ్యానికి. లివర్‌లో ట్యూమర్ ఉన్నదంటున్న మాన్యత పలు ఫంక్షన్లకు హాజరవుతూనే ఉన్నారని విమర్శించే వాళ్ల నోళ్లు మూయించే మహేష్ భట్‌లకు కొదవ లేదు. ‘అనారోగ్యంతో ఉంటే ఫంక్షన్లకు హాజరు కావడం తప్పా?’ అనే భట్ ఎదురు ప్రశ్నకు తిరుగులేదు. మనది ఒకదానికొకటి సంబంధం లేని రెండు భిన్న ప్రపంచాల భారతమని అనుకుంటే తప్పేముంది? పి. గౌతమ్ -
ఉపాధి కూలీకి గాలం...
‘పదకొండవ ప్రణాళికా కాలంలో నామమాత్రపు వ్యవసాయ కూలి రేట్లు ఏడాదికి 17.5 శాతం పెరిగాయి. నిజవేతనాలు 6.8 శాతం మాత్రమే పెరిగాయి’. ఈ ఏడాది ఆగస్టు నాటికి గ్రామీణ వేతనాల వృద్ధి రుణాత్మకంగా మారింది. అంటే 2001తో పోలిస్తే తగ్గాయి! సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నా ఇంకా దిక్కు తోచని స్థితిలోనే ఉన్నామని ఆందోళన చెందుతున్న కాంగ్రెస్ నేతలంతా ఇక నిశ్చింతగా కునుకు తీయొచ్చు. రాహుల్‌గాంధీ పట్టాభిషేకం కలలు కనొచ్చు. అధినేత్రి సోనియాగాంధీ ‘మంత్ర దండాన్ని’ అందుకున్నారు. దాని మహిమకు అప్పుడే ఒక ‘తల’ తెగి పడింది. జాతీయ గణాంకాల కమిషన్ చైర్మన్ ప్రణబ్సేన్కు ఉద్వాసన పలికి, ఎస్ మహేంద్రదేవ్ ను రంగప్రవేశం చేయించారు. 2009 ఎన్నికల్లో యూపీఏకు ఘన విజయం సాధించి పెట్టినదిగా భావిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎమ్జీఎన్ఆర్జీయీ) పదును పెట్టే బాధ్యతను అయనకు అప్పగించారు. వినియోగదారుల ధరల సూచికకు అనుగుణంగా ఇక నుంచి ఎప్పటికప్పుడు ఉపాధి పథకం కూలి రేట్లు కూడా పెరిగే పద్ధతిని తక్షణమే సూచించాలని ఆదేశించారు. ఇది జరిగిన వెంటనే ఉపాధి కూలీల వేతనాలు కనీసం 12 నుంచి 15 శాతం వరకు పెరుగుతాయి. ఇక ఆ పై ధరలు పెరిగినప్పుడల్లా పెరుగుతూనే ఉంటాయి. అంటే ధరల పెరుగుదల ప్రబావం పడని నిజ వేతనాల పెరుగుదలకు హామీని కల్పిస్తామని అంటున్నారు. గ్రామీ ణ ప్రాంతాల్లో కుటుంబానికి ఒకరికి చొప్పున ఏడాదికి కనీసం 100 దినాల ఉపాధికి హామీని ఇచ్చే ఈ పథ కం వల్ల 25 శాతం కుటుంబాలకు లబ్ధి కలుగుతోందని అంచనా. ఇప్పటికే ‘ముందు చూపు’తో యూపీఏ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ఉపాధి కూలీల వేతనాలను పెంచింది. రాష్ట్రాన్ని బట్టి రూ.112 నుంచి రూ.214 వరకు దినసరి వేతనంగా చెల్లిస్తున్నారు. ముంచుకొస్తున్న ద్రవ్యలోటు ముప్పు గురించి ఇల్లెక్కి కూస్తున్న యూపీఏ ఇప్పటికే ఈ ఏడాది బడ్జెట్‌లోఈ పథకానికి రూ.33,000 కోట్లను కేటాయించింది. అయినా మరింత భారాన్ని మోయడానికి ఎం దుకు సిద్ధమౌతోంది? ఉపాధి పథకం కారణంగా కూలి రేట్లు పెరిగి వ్యవసాయ ఉత్పత్తుల ఖర్చు పెరిగిపోతోందనీ, ఆ కారణంగానే ఆహార ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్నాయని అధికారిక ఆర్థిక ‘నిపుణుల’ వాదన. దాన్నీ పెడ చెవిన పెట్టి ఎందుకు ఈ ఆరాటం? వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) గత నెలలో విడుదల చేసిన తాజా నివేదిక కాంగ్రెస్ కసరత్తు మర్మాన్ని విప్పుతుంది. ‘పదకొండవ ప్రణాళికా కాలంలో (2007-12) నామమాత్రపు (డబ్బు రూపంలోని) వ్యవసాయ కూలి రేట్లు ఏడాదికి సగటున 17.5 శాతం చొప్పున పెరిగాయి. నిజ వేతనాలు (కొనుగోలు చేయగలిగిన వస్తువుల రూపంలో) 6.8 శాతం మాత్రమే పెరిగాయి.’ నిజవేతనాలను వినియోగదారుల సూచిక ఆధారంగా లెక్కిస్తారు. ఆ సూచిక మన దేశంలోనే కాదు అమెరికాలో సైతం తప్పుల తడకే. ధరల పెరుగుదలను తగ్గించి చూపిస్తుంది. ఆ సూచిక ఆధారంగా లెక్కించిన గ్రామీణ నిజ వేతనాలు గత నాలుగేళ్లుగా వేగంగా క్షీణిస్తుండటం పై పటంలో కనిపిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి గ్రామీణ వేతనాల వృద్ధి రుణాత్మకంగా మారింది. అంటే 2001తో పోలిస్తే తగ్గాయి! సూటిగా చెప్పాలంటే 2001 నాటి గ్రామీణ కూలికి నేటి కంటే ఎక్కువగా అవసరాలు తీరేవి. ఆర్థశాస్త్ర కోవిదుడైన ప్రధాని మన్మోహనే స్వయంగా ‘ద్రవ్యోల్బణం ప్రజలపై విధించే పన్ను’ అని చెప్పారు. అంటే గ్రామీణ కూలీలు, పట్టణ వేతన జీవులు ఎవరైనాగానీ ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో పెరిగిన ఆదాయాలను అధిక ధరల రూపంలో చెల్లించి చేతులు దులుపుకోవాల్సిందే. నిజ ఆదాయాల పతనాన్ని ఎదుర్కోక తప్పదు. వేతన జీవులు యూపీఏ మొదటి ఐదేళ్ల పాలనా కాలంలో చవిచూసిన తాత్కాలిక సౌఖ్యం ఏైదె నా ఉందంటే అది గత ఐదేళ్లలో ఆవిరైపోయింది. అందుకే ధరల మంట యూపీఏకు పెద్ద పాము గండంగా మారింది. గ్రామీణ ఉపాధి వేతనాల పెంపుదలతో కట్టె విరక్కుండా... అన్నట్లు ధరల జోలికి పోకుండానే రాహుల్‌ను గద్దెకెక్కించాలని పథకం. ఉద్యోగులకు డీఏను ప్రకటించడానికి, వేతన సవరణ సంఘం ఏర్పాటుకు తాత్సారం చేసే ప్రభుత్వమే గ్రామీణ ఉపాధి కూలీలకు నిజవేతనం మంత్రాన్ని పఠిస్తోంది. 2009 ఎన్నికల తర్వాత ఏటికేడాది ఉపాధి పథకానికి నిధుల కత్తిరింపు జరుగుతూ వచ్చింది. ‘అమ్మ’ పగటి కల ఫలిస్తే రాహుల్ 2015 నుంచి ఈ పథకానికి కత్తెర వేస్తారు. కాంగ్రెస్ ఉపాధి కూలీ తురుపు ముక్కకు మరో ప్రయోజనం కూడా ఉందని వినవస్తోంది. కాంగ్రేసేతర ప్రభుత్వం గద్దెనెక్కినా అస్థిరత తప్పదని కాంగ్రెస్ అంచనా. అలాంటి స్థితిలో ఆ ప్రభుత్వాన్ని ఆర్థికంగా సంకటంలోకి నెట్టే పథకాలను ముందే దాని నెత్తిన రుద్ది తప్పుకుని, అవకాశం కోసం వేచి చూడ్డం మంచిదనే దూరదృష్టి కూడా ఉందని అంటున్నారు. కాదనలేం. -పి.గౌతమ్ -
చైనా నేతల జూదం జోరు!
మకావ్ వైభోగానికి మూల కారణమైన కస్టమర్లు పార్టీ నేతలు, ప్రభుత్వాధికారులే. ‘ప్రజా సేవలో’ నానా గడ్డి కరిచిన అభినవ కుబేరులు ‘ప్రపంచ పాప నగరి’లో ఖర్చు చేసి సేద తీరుతారు. నిఘా నేత్రాలకు దొరక్కుండా కమ్యూనిస్టు కుబేరుల ముచ్చట తీర్చే ప్రత్యేక రహస్య జూద మందిరాలూ ఉంటాయి. జూదగృహాల ప్రపంచ రాజధాని ఏది? అమెరికాలోని లాస్‌వేగస్ ఆ హోదాను కోల్పోయింది. చైనాలో ఒక ప్రత్యేక పరిపాలనా ప్రాంతంగా ఉన్న ‘మకావ్’ ప్రపంచ జూదగృహాలకు నేటి రాజధాని. పోర్చుగల్ చిట్టచివరి వలస మకావ్ 1999లో చైనా చేతికి వచ్చింది. ‘కమ్యూనిస్టు’ పాలనలో అది ‘మహర్దశను’ అందుకుంది. ‘తూర్పు లాస్‌వేగస్’గా ఒకప్పుడు మసక వెలుతుర్లో, పొగాకు ధూమం నిండిన ఇరుకు గదుల జూదశాలలకు మకావ్ సెలవు పలికేసింది. వాటికి అనుబంధంగా ఉండే వ్యభిచార గృహాలు కూడా అదృశ్యమైపోయాయి. మహారాజ ప్రాసాదాలను తల దన్నే అద్భుత, విలాస భవనాల ధగధగలతో అలరారే కేసినోలు 33 అవతరిం చాయి. లాస్‌వేగస్‌ను ‘పడమటి మకావ్’గా పిలుచుకోవాల్సిందే. గత ఏడాది మకావ్ కేసినోల టర్నోవర్ లాస్వేగస్తో పోలిస్తే ఆరు రెట్ల కంటే ఎక్కువ... 3,800 కోట్ల డాలర్లు! మకావ్ జూదగృహాలను పావనం చేసే వారిలో కుబేరులూ ఉంటారు. చేతి చమురు వదుల్చుకునే మధ్యతరగతి వారూ ఉంటారు. చైనాలో జూదం నిషిద్ధం. దక్షిణ చైనా సముద్ర తీరంలోని మకావ్‌కు చైనా జూదరులు బారు లు తీరుతారు. అయితే మకావ్ వైభోగానికి మూల కారణమైన కస్టమర్లు మాత్రం కమ్యూనిస్టుపార్టీ నేతలు, ప్రభుత్వాధికారులే. ‘ప్రజా సేవలో’ నానా గడ్డికరిచిన అభినవ కుబేరులు ‘ప్రపంచ పాప నగరి’లో ఖర్చు చేసి సేద తీరుతారు. వెనీషియన్ కేసినో ప్రపంచంలోనే అతి పెద్ద జూదగృహం. అక్కడి కేసినోల ముందు అత్యంత విలాసవంతమైన స్టార్ హోటళ్లు ఎం దుకూ కొరగావనిపిస్తాయి. ఆహార విహా రాలు, బార్లు, పబ్బులు, విడిది సకల సౌకర్యాలు అక్కడే. లాస్వేగస్లాగే స్ట్రిప్ టీజ్ నగ్ననృత్యాలకు కొదవలేదు. అయితే అడుగడుగునా చైనా ప్రభుత్వ నిఘా నేత్రాలు తప్పవు. వాటికి దొరక్కుండా కమ్యూనిస్టు కుబేరుల ముచ్చట తీర్చే ప్రత్యేక రహస్య జూద మంది రాలూ ఉంటాయి. జూదం బకాయిల కోసం కోర్టులకు ఎక్కలేమనే దిగులు అక్కర్లేదు. మకావ్‌కు అరవై కిలోమీటర్ల దూరంలోని హాంకాంగ్ కూడా చైనాలోని ప్రత్యేక పరిపాలనా ప్రాంతమే. అక్కడి మాఫియా గ్యాంగులు కమ్యూనిస్టు నేతలకంటే ముందే వారికి కావాల్సిన డబ్బును అక్కడకు చేరవేస్తాయి, బకాయిల గొడవా చూసుకుంటాయి. ఎన్ని ఉంటేనేం? సకల వ్యసనాలకు రాణి వ్యభిచారం లేకపోయాక? ఆ దిగులూ అక్కర్లేదు. మకావ్ ‘డేటింగ్ గర్ల్స్’కు ప్రసిద్ధి. ఆసియా ‘ప్రేమ పక్షులు’ రోజులు, వారాల లెక్కన కొనుక్కునే ‘ప్రేమ’ను నిజమైన ప్రేమానురాగాలతో, సేవాభావంతో రంగరిం చి మరీ అందిస్తారని ప్రతీతి. అందుకే మకావ్‌కు పర్యాటకుల సంఖ్య పెరిగిపోతోంది. ‘డేటింగ్ గర్ల్స్’ సేవలు వ్యభిచారమేనని అల్లరి చేసేవాళ్లకు ఆ యువతులు స్వచ్ఛందంగా అక్కడికి చేరినవారేనని గుర్తు చేస్తుంటారు. అదీ నిజమే. కాకపోతే వాళ్లకు చైనా ప్రధాన భూభాగంలో ముసలి తల్లిదండ్రులో, పిల్లలో ఉంటారు. వారి పోషణ కోసం, సుఖసంతోషాల కోసం ‘స్వచ్ఛందంగా’నే వాళ్లు ప్రేమను అమ్ముకుంటారు. ఇటీవలి కాలంలో చైనా నూతన నాయకత్వం అవినీతి భరతం పట్టేస్తామంటోంది. దీంతో అవినీతి చక్రవర్తులు ఎందుకైనా మంచిదని తమ విహారాల స్థానా న్ని సింగపూర్‌కు మారుస్తున్నారు. దక్షిణ చైనా సముద్ర ప్రాంతమంతటా జూదగృహ వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. చైనాకు ధీటైన ప్రాం తీయ శక్తిగా మారాలని ఆరాటపడుతున్న మన ప్రభుత్వం కూడా మకావ్ లాగే వీసాలు అవసరం లేని ఓ జూద నగరాన్ని నిర్మించడా నికి పూనుకోదని ఆశిద్దాం. - పి. గౌతమ్