రెండు తలల కారుణ్యం | Dual policy in India | Sakshi
Sakshi News home page

రెండు తలల కారుణ్యం

Published Tue, Dec 24 2013 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM

రెండు తలల కారుణ్యం

రెండు తలల కారుణ్యం

జీవకారుణ్యాన్ని బోధించిన బుద్ధుడు పుట్టిన దేశంలో కారుణ్యం ఇంకా మిగిలే ఉందా? లేని వాళ్లకు లేదు, ఉన్నవాళ్లకు ఉందని చెప్పడం ఉత్తమం. ఎక్కడో దూరాన లేకున్నా కన్నతండ్రి అంత్యక్రియలకు వెళ్లలేని నిస్సహాయుడిని చేసిన కనికరం లేని కాకీతనానికి ఒక కొడుకు కుళ్లి కుళ్లి విలపించాల్సి వచ్చిందంటే... లేదనే అనుకోవాల్సి వస్తుం ది. దేశంలో ఇలాంటి అనామకులు ఎందరో ఉన్నారనుకోడానికి లేదు. ఎస్‌పీ ఉదయ్‌కుమార్ రాజనీతి శాస్త్రంలో డాక్టరేటు పట్టా ఉన్న ఉన్నత విద్యావంతుడు. ఈ నెల 12న మరణించిన పుష్పరాయన్ అంత్యక్రియలకు కొడుకు రాక పోతేనేం? రెండు వందల మంది పోలీసులొచ్చారు... ‘దేశద్రోహి’, ప్రభుత్వాన్ని కూలదోయ యత్నించిన ‘కుట్రదారు’ వంటి కేసులున్న ఉదయ్‌కుమార్ వస్తే పట్టుకుందామని. ఆయన దేశాన్నేగాదు, ప్రపంచం దృష్టిని సైతం ఆకర్షించిన కూడంకుళం ఉద్యమ నేత. రెండేళ్లపాటూ జాతీయ మీడియాలో ప్రధాన వార్తగా నిలిచిన గొప్ప ప్రజాందోళన నిర్వహించిన ‘అణు విద్యుత్ వ్యతిరేక ప్రజా ఉద్యమం’ (పీమూఎఏఈ) వ్యవస్థాపకుడు. ఆయనేమీ అజ్ఞాత ఉగ్రవాది కాడు. తమిళనాడు తిరునల్వేలి జిల్లాలోని కూడంకుళంకు కూతవేటు దూరంలోని ఇందియంతకరై గ్రామంలోనే గత రెండేళ్లుగా ఉంటున్నారు. జైలు గోడల మధ్య లేకున్నా ఆయన బందీ. ఆయనే కాదు ఆ గ్రామమే బందీ. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ‘క్రిమినల్ గ్రామం’గా ప్రకటిం చింది. గ్రామ సరిహద్దులు దాటి ఎవరూ బయటికి పోరాదు, రారాదు!

 కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారంతో ఆ తీరానికి ముప్పున్నదని ఉదయ్‌కుమార్ వాదన. ఒక సునామీ దెబ్బ తిని, జపాన్‌లోని మరో సునామీ సృష్టించిన ఫకూషిమా అణు విధ్వంసాన్ని చూసి కలిగిన భయం అది. ప్రభుత్వం అంటున్నట్టుగా కూడంకుళం ప్రమాదాలకు తావు లేనిదే అయినా... కాలుష్యం అంటక నిర్మలంగా ఉన్న ఆ తీర జీవపర్యావరణ వ్యవస్థను, మత్స్యకారుల జీవనోపాధిని కాటేస్తుందని ఆయన భయం. పర్యావరణ సంతులనం దెబ్బతినడం వల్ల కలిగే ఉత్పాతాలను గుర్తించే వారెవరూ తీసిపారేయలేని సమంజసమైన ఆందోళన. అన్నిటికీ మించి ఉదయ్‌కుమార్ లేవనెత్తిన ప్రశ్న మౌలికమైనది... ‘అణుశక్తి పారిశ్రామిక పట్టణాల కోసమే తప్ప గ్రామీణ ప్రాంతాల కోసం కాదు.’ అలాంటప్పుడు నగరాలు, పట్టణాల విలాసవంతమైన విచ్చలవిడి వినియోగ సంస్కృతిని పోషించడానికి గ్రామాలు వల్లకాళ్లు ఎందుకు కావాలి? సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మన అభివృద్ధి నమూనాను, దానికి ప్రాతిపదికగా ఉన్న సామాజిక విలువలను మెడ బట్టి నిల దీసే ప్రశ్న. ప్రభుత్వాలకు పట్టని ఈ ప్రశ్న కూడంకుళం ప్రజలకు పట్టింది. ప్రజలు ‘అధికారాన్ని’ ప్రశ్నించడం అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఉద్యమం సాగుతున్నన్నాళ్లూ కరెంటే కాదు, పసిపిల్లలకు పాలు సైతం అందకుండా నిరాకరించాయి. ఏమైతేనేం, మే నెలలో సుప్రీం కోర్టు కూడంకుళం అణు విద్యుదుత్పత్తికి పచ్చజెండా చూపింది. అది నిర్విఘ్నంగా సాగుతోంది. అదే న్యాయస్థానం ఉద్యమకారులపై అణచివేతను తప్పుపట్టి, కేసులను ఉపసంహరించుకోమని హితవు పలికింది. అయితే ‘అధికార’ ధిక్కారానికి పాల్పడ్డ వారిని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కనికరించ దలచలేదు. కేసులు అలాగే ఉన్నాయి, క్రిమినల్ గ్రామం ఇందియంతకరై నానా అగ చాట్లు పడుతూనే ఉంది.

 కనికరమే లేదనిపించే మన దేశంలోనే మరో చోట కారుణ్యం పొంగి పొర్లుతోంది. బాలీవుడ్ నటుడు సంజ య్‌దత్ భార్య మాన్యత అనారోగ్యంతో బాధపడుతున్నదని తెలిసిన వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం చలించి ఆగమేఘాలపై కనికరించింది. సంజయ్ కోరిందే తడవుగా... భార్యను చూడటానికి కోర్టు నెలరోజుల పెరోల్‌ను మం జూరు చేసింది. శనివారం ఆయన విడుదలయ్యారు. 1983 బాంబు పేలుళ్ల కేసులో ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద సం జయ్‌పై పలు అభియోగాలు మోపారు. పేలుళ్లతో ఎలాం టి సంబంధమూ లేకున్నా ఆయన అక్రమంగా ఏకే-47 రైఫిల్‌ను కొని, దాచి, మాయం చేసి తీవ్ర నేరాలకు పాల్పడ్డట్టు రుజువైంది. దీంతో మే నుంచి ఎరవాడ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఎంతటి తీవ్ర నేరస్తులైనా అనారోగ్యంతో ఉన్న భార్యను చూసిరావడానికి పెరోల్ ఇవ్వ డం సమంజసమే. కానీ పెరోల్ అన్నదే లేకుండా జీవితకాలమంతా జైళ్లల్లో మగ్గుతున్నవారు, విచారణే లేకుండా దశాబ్దాల తరబడి పడి ఉంటున్నవారు ఉన్న స్థితిలో... భార్యను చూడ్డానికి సంజయ్‌కు ఏకంగా నెలరోజుల పెరోల్. ఆరు నెలల్లో మూడోసారి! ముందటి రెండూ ఆయన అనారోగ్యానికి. లివర్‌లో ట్యూమర్ ఉన్నదంటున్న మాన్యత పలు ఫంక్షన్లకు హాజరవుతూనే ఉన్నారని విమర్శించే వాళ్ల నోళ్లు మూయించే మహేష్ భట్‌లకు కొదవ లేదు. ‘అనారోగ్యంతో ఉంటే ఫంక్షన్లకు హాజరు కావడం తప్పా?’ అనే భట్ ఎదురు ప్రశ్నకు తిరుగులేదు. మనది ఒకదానికొకటి సంబంధం లేని రెండు భిన్న ప్రపంచాల భారతమని అనుకుంటే తప్పేముంది?  పి. గౌతమ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement