ఉపాధి కూలీకి గాలం...
‘పదకొండవ ప్రణాళికా కాలంలో నామమాత్రపు వ్యవసాయ కూలి రేట్లు ఏడాదికి 17.5 శాతం పెరిగాయి. నిజవేతనాలు 6.8 శాతం మాత్రమే పెరిగాయి’. ఈ ఏడాది ఆగస్టు నాటికి గ్రామీణ వేతనాల వృద్ధి రుణాత్మకంగా మారింది. అంటే 2001తో పోలిస్తే తగ్గాయి!
సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నా ఇంకా దిక్కు తోచని స్థితిలోనే ఉన్నామని ఆందోళన చెందుతున్న కాంగ్రెస్ నేతలంతా ఇక నిశ్చింతగా కునుకు తీయొచ్చు. రాహుల్‌గాంధీ పట్టాభిషేకం కలలు కనొచ్చు. అధినేత్రి సోనియాగాంధీ ‘మంత్ర దండాన్ని’ అందుకున్నారు. దాని మహిమకు అప్పుడే ఒక ‘తల’ తెగి పడింది. జాతీయ గణాంకాల కమిషన్ చైర్మన్ ప్రణబ్‌సేన్‌కు ఉద్వాసన పలికి, ఎస్ మహేంద్రదేవ్ ను రంగప్రవేశం చేయించారు. 2009 ఎన్నికల్లో యూపీఏకు ఘన విజయం సాధించి పెట్టినదిగా భావిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎమ్‌జీఎన్‌ఆర్‌జీయీ) పదును పెట్టే బాధ్యతను అయనకు అప్పగించారు.
వినియోగదారుల ధరల సూచికకు అనుగుణంగా ఇక నుంచి ఎప్పటికప్పుడు ఉపాధి పథకం కూలి రేట్లు కూడా పెరిగే పద్ధతిని తక్షణమే సూచించాలని ఆదేశించారు. ఇది జరిగిన వెంటనే ఉపాధి కూలీల వేతనాలు కనీసం 12 నుంచి 15 శాతం వరకు పెరుగుతాయి. ఇక ఆ పై ధరలు పెరిగినప్పుడల్లా పెరుగుతూనే ఉంటాయి. అంటే ధరల పెరుగుదల ప్రబావం పడని నిజ వేతనాల పెరుగుదలకు హామీని కల్పిస్తామని అంటున్నారు. గ్రామీ ణ ప్రాంతాల్లో కుటుంబానికి ఒకరికి చొప్పున ఏడాదికి కనీసం 100 దినాల ఉపాధికి హామీని ఇచ్చే ఈ పథ కం వల్ల 25 శాతం కుటుంబాలకు లబ్ధి కలుగుతోందని అంచనా.
ఇప్పటికే ‘ముందు చూపు’తో యూపీఏ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ఉపాధి కూలీల వేతనాలను పెంచింది. రాష్ట్రాన్ని బట్టి రూ.112 నుంచి రూ.214 వరకు దినసరి వేతనంగా చెల్లిస్తున్నారు. ముంచుకొస్తున్న ద్రవ్యలోటు ముప్పు గురించి ఇల్లెక్కి కూస్తున్న యూపీఏ ఇప్పటికే ఈ ఏడాది బడ్జెట్‌లోఈ పథకానికి రూ.33,000 కోట్లను కేటాయించింది. అయినా మరింత భారాన్ని మోయడానికి ఎం దుకు సిద్ధమౌతోంది? ఉపాధి పథకం కారణంగా కూలి రేట్లు పెరిగి వ్యవసాయ ఉత్పత్తుల ఖర్చు పెరిగిపోతోందనీ, ఆ కారణంగానే ఆహార ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్నాయని అధికారిక ఆర్థిక ‘నిపుణుల’ వాదన. దాన్నీ పెడ చెవిన పెట్టి ఎందుకు ఈ ఆరాటం?
వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) గత నెలలో విడుదల చేసిన తాజా నివేదిక కాంగ్రెస్ కసరత్తు మర్మాన్ని విప్పుతుంది. ‘పదకొండవ ప్రణాళికా కాలంలో (2007-12) నామమాత్రపు (డబ్బు రూపంలోని) వ్యవసాయ కూలి రేట్లు ఏడాదికి సగటున 17.5 శాతం చొప్పున పెరిగాయి. నిజ వేతనాలు (కొనుగోలు చేయగలిగిన వస్తువుల రూపంలో) 6.8 శాతం మాత్రమే పెరిగాయి.’ నిజవేతనాలను వినియోగదారుల సూచిక ఆధారంగా లెక్కిస్తారు. ఆ సూచిక మన దేశంలోనే కాదు అమెరికాలో సైతం తప్పుల తడకే. ధరల పెరుగుదలను తగ్గించి చూపిస్తుంది.
ఆ సూచిక ఆధారంగా లెక్కించిన గ్రామీణ నిజ వేతనాలు గత నాలుగేళ్లుగా వేగంగా క్షీణిస్తుండటం పై పటంలో కనిపిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి గ్రామీణ వేతనాల వృద్ధి రుణాత్మకంగా మారింది. అంటే 2001తో పోలిస్తే తగ్గాయి! సూటిగా చెప్పాలంటే 2001 నాటి గ్రామీణ కూలికి నేటి కంటే ఎక్కువగా అవసరాలు తీరేవి. ఆర్థశాస్త్ర కోవిదుడైన ప్రధాని మన్మోహనే స్వయంగా ‘ద్రవ్యోల్బణం ప్రజలపై విధించే పన్ను’ అని చెప్పారు. అంటే గ్రామీణ కూలీలు, పట్టణ వేతన జీవులు ఎవరైనాగానీ ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో పెరిగిన ఆదాయాలను అధిక ధరల రూపంలో చెల్లించి చేతులు దులుపుకోవాల్సిందే. నిజ ఆదాయాల పతనాన్ని ఎదుర్కోక తప్పదు. వేతన జీవులు యూపీఏ మొదటి ఐదేళ్ల పాలనా కాలంలో చవిచూసిన తాత్కాలిక సౌఖ్యం ఏైదె నా ఉందంటే అది గత ఐదేళ్లలో ఆవిరైపోయింది. అందుకే ధరల మంట యూపీఏకు పెద్ద పాము గండంగా మారింది.
గ్రామీణ ఉపాధి వేతనాల పెంపుదలతో కట్టె విరక్కుండా... అన్నట్లు ధరల జోలికి పోకుండానే రాహుల్‌ను గద్దెకెక్కించాలని పథకం. ఉద్యోగులకు డీఏను ప్రకటించడానికి, వేతన సవరణ సంఘం ఏర్పాటుకు తాత్సారం చేసే ప్రభుత్వమే గ్రామీణ ఉపాధి కూలీలకు నిజవేతనం మంత్రాన్ని పఠిస్తోంది. 2009 ఎన్నికల తర్వాత ఏటికేడాది ఉపాధి పథకానికి నిధుల కత్తిరింపు జరుగుతూ వచ్చింది. ‘అమ్మ’ పగటి కల ఫలిస్తే రాహుల్ 2015 నుంచి ఈ పథకానికి కత్తెర వేస్తారు. కాంగ్రెస్ ఉపాధి కూలీ తురుపు ముక్కకు మరో ప్రయోజనం కూడా ఉందని వినవస్తోంది. కాంగ్రేసేతర ప్రభుత్వం గద్దెనెక్కినా అస్థిరత తప్పదని కాంగ్రెస్ అంచనా. అలాంటి స్థితిలో ఆ ప్రభుత్వాన్ని ఆర్థికంగా సంకటంలోకి నెట్టే పథకాలను ముందే దాని నెత్తిన రుద్ది తప్పుకుని, అవకాశం కోసం వేచి చూడ్డం మంచిదనే దూరదృష్టి కూడా ఉందని అంటున్నారు. కాదనలేం.
-పి.గౌతమ్