సార్వత్రిక ఎన్నికల రెండో దశ కూడా పూర్తికావస్తుండగా శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం ఈవీఎంల వినియోగంపై వచ్చిన వ్యాజ్యాలను తోసిపుచ్చింది. విపక్షాలను విమర్శించటానికీ, ఆరోప ణలు సంధించటానికీ వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోని ప్రధాని నరేంద్ర మోదీ... ఇంకా అయిదు దశల పోలింగ్ జరగాల్సిన తరుణంలో మౌనంగా ఎందుకుంటారు? అందుకే కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్షాలకు ఈ తీర్పు చెంపపెట్టన్నారు. ఈవీఎంలపై సందేహాలు రేకెత్తించిన పాపానికి క్షమాపణలు చెప్పాలని కూడా మోదీ డిమాండ్ చేశారు. దేన్నయినా సందేహించటం దానికదే పాపం కాదు. పాపమే అనుకుంటే బీజేపీ, కాంగ్రెస్ సహా దాదాపు అందరికందరూ ఆ పాపం చేసినవారే.
ఒకటి రెండు పార్టీలు మినహాయిస్తే పరాజితుల ప్రథమ కోపం ఎప్పుడూ ఈవీఎంలపైనే. వరసగా 2004, 2009 ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పుడు బీజేపీ ఈవీఎంలనే తప్పుబట్టింది. 2012 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పుడు కాంగ్రెస్ కూడా ఆ పనే చేసింది. హ్యాకర్ల ద్వారా ఈవీఎంల సోర్స్ కోడ్ మార్చి అకాలీదళ్ తమ విజయాన్ని దొంగిలించిందని ఆరోపించింది. ఇక యూటర్న్‌ల సిద్ధ హస్తుడైన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకైతే ఇలాంటి ఆరోపణలు మంచినీళ్లప్రాయం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పుడు ఈవీఎంలపైనే ఆయన ఆగ్రహం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గినప్పుడు మాత్రం చప్పుడు చేయలేదు. మళ్లీ 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చాక ఈవీఎంలపై వీరంగం వేశారు. మధ్యలో ఈవీఎంలు దొంగిలించిన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో మీడియా సమావేశం ఏర్పాటు చేయించి వాటిని తారుమారు చేయొచ్చని చూపించే ప్రయత్నం చేసింది కూడా చంద్రబాబే. మళ్లీ ఎన్‌డీఏ పంచన చేరినందువల్ల ఈవీఎంల వివాదంపై ఇప్పుడాయన కిక్కురుమనటం లేదు.
ఇతరుల మాటెలావున్నా ప్రస్తుతం ఈవీఎంల వినియోగాన్ని సవాలు చేసిన సంస్థల్లో విశ్వసనీయతగల అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సంస్థ కూడా వుంది. కనుక ఈవీఎంలను సందేహించటం స్వప్రయోజనాల కోసమేనని భావించలేం. అదో పెద్ద నేరంగా పరిగ ణించలేం. అలాగని పేపర్ బ్యాలెట్ విధానం సవ్యంగా సాగిందా? పోలింగ్ బూత్‌లు చేజిక్కించు కుని, బ్యాలెట్ పేపర్లు గుంజుకుని తమ గుర్తుపై ముద్రలు వేసుకుని పెత్తందారులు చెలరేగిపోలేదా? రిగ్గింగ్ ఆరోపణలు వచ్చినప్పుడల్లా ఎన్నిసార్లు రీపోలింగ్ జరపక తప్పలేదు! ఈవీఎంల వల్ల ఈ జాడ్యం ఎంతో కొంత కట్టడి అయింది. నిమిషానికి కేవలం అయిదు ఓట్లు మాత్రమే వాటిల్లో నమో దయ్యే అవకాశం వుండటం వల్ల పోలింగ్ కేంద్రాలు ఆక్రమించిన దుండగులకు గతంలోని వెసులు బాటు పోయింది.
వెనువెంటనే బలగాలు ఆ పోలింగ్ కేంద్రాన్ని చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే అవ కాశం వుండటం వల్ల వారి ఆటలు సాగటం లేదు. 1982లో తొలిసారి ఈవీఎంలతో కేరళలో ఒక ఉప ఎన్నిక నిర్వహించారు. అయితే తగిన చట్టం లేకుండా ఈవీఎంల వినియోగం చెల్లదంటూ సుప్రీంకోర్టు ఆ ఎన్నికను రద్దు చేసింది. 1998లో ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కేవలం కొన్ని నియోజక వర్గాల్లో 45 ఈవీఎంలను ప్రయోగాత్మకంగా వినియోగించారు. ఈవీఎంలపై తరచు ఫిర్యాదులు వస్తున్నందువల్ల వాటికి ప్రింటర్లను అనుసంధానించాలని 2013లో సుప్రీంకోర్టు ఆదేశించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పరిమితంగా దాన్ని అమలు చేసినా... ఆ తర్వాత కాలంలో వీవీ ప్యాట్‌ల పూర్తిస్థాయి వినియోగం మొదలైంది.
ఓటరు తనకు నచ్చిన గుర్తుకు ఓటేసిన వెంటనే ప్రింటర్‌పై ఆ పార్టీ పేరు, గుర్తు ఏడు సెకన్లపాటు కనబడే ఏర్పాటుచేశారు. ఆ వెంటనే ఒక స్లిప్‌పై అది ప్రింటయి దానికి అనుసంధానించిన బాక్స్‌లో పడుతుంది. పోలింగ్ సమయంలోనైనా, కౌంటింగ్ సమయంలోనైనా ఈవీఎంలను దేనితోనూ అనుసంధానించటం సాధ్యంకాదని... రిమోట్ కంట్రోల్, బ్లూటూత్, వైఫైలతో నియంత్రించటం కూడా అసాధ్యమని ఎన్నికల సంఘం పదే పదే చెబుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలైన బెంగళూరు బెల్, హైదరాబాద్ ఈసీఐఎల్ వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. పోలింగ్‌కు ముందు ఈవీఎంల తనిఖీకి అభ్యర్థులకు అవకాశం ఇస్తున్నారు. చిత్రమేమంటే ఈ ప్రక్రియపై ఓటర్లనుంచి ఎప్పుడూ ఫిర్యాదులు లేవు.
ఇప్పుడు మళ్లీ బ్యాలెట్ పేపర్‌కు మళ్లాలన్న వినతిని తోసిపుచ్చటంతోపాటు వీవీ ప్యాట్ స్లిప్ లను ఓటర్లే తీసుకునేలా, పరిశీలించుకున్నాక వారే బ్యాలెట్ బాక్స్‌లో వేసేలా చూడాలన్న కోరికను సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు. ఈవీఎంల ద్వారా వెల్లడయ్యే ఓట్ల సంఖ్యనూ, వీవీప్యాట్ స్లిప్‌లనూ లెక్కించి రెండూ సరిపోలినప్పుడే ఫలితం ప్రకటించాలన్న పిటిషనర్ల వినతిని కూడా తిరస్కరించింది. అయితే పార్టీల గుర్తులను కంప్యూటర్ ద్వారా ఈవీఎంలలో లోడ్ చేయటానికి ఉప యోగించే సింబల్ లోడింగ్ యూనిట్ (ఎస్‌ఎల్‌యూ)లను ఎన్నికల పిటిషన్లు పడిన సందర్భాల్లో పరిశీలించేందుకు అనువుగా 45 రోజులు భద్రపరచాలని ఆదేశించింది.
అంటే ఇకపై ఈవీఎంలతో పాటు ఎస్‌ఎల్‌యూలు కూడా సీల్ చేసివుంచటం తప్పనిసరి. అలాగే రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు ఫిర్యాదుచేస్తే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ 5 శాతం ఈవీఎంలనూ, ఎస్‌ఎల్‌యూలనూ ఇంజనీర్ల, ఉత్పత్తిదారుల సమక్షంలో తనిఖీకి అనుమతించవచ్చు. అయితే ఫలితాలొచ్చిన ఏడు రోజుల్లో ఫిర్యాదులు చేయాలి. అలాగే వీవీ ప్యాట్ స్లిప్‌లు లెక్కించే యంత్రాలు సమకూర్చుకునే ఆలోచన చేయాలని ఈసీని కోరింది. ఏదేమైనా బాహాటంగా బయట పడిన సంద ర్భాలుంటే తప్ప ఈవీఎంలపై అనవసర రాద్ధాంతానికి ముగింపు పలకటం అవసరం. ఇందుకు బదులు ప్రజల్లో విశ్వసనీయత పెంచుకోవటం ఎలా అన్న అంశంపై పార్టీలు దృష్టి సారించాలి.
Comments
Please login to add a commentAdd a comment