దేశంలో ఇటీవల జరిగిన కొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(EVM) పనితీరు మీద ఎన్నో సందేహాలకు కారణమయ్యాయి. ఈవీఎంలను ఎవరో.. ఎక్కణ్ణుంచో ఆపరేట్ చేస్తున్నారని.. క్షేత్ర స్థాయిలో జరుగుతున్నా ఎన్నికల సరళికి ఎన్నికల ఫలితాలకు సంబంధం లేకుండా ఉంటోందనే విమర్శలు వస్తున్నాయి. అమెరికాలో ఉంటున్న సుజా సయీద్ అనే ఉద్యోగి తాను ఈవీఎంను హ్యాక్ చేయగలను అని ఛాలెంజ్ చేసినందుకు ఆయనమీద ఎలక్షన్ కమిషన్ మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా అయన మీద కేసు కూడా బుక్కైంది.
.. మొన్న మహారాష్ట్రలో పోలింగ్ జరిగిన తీరుమీద సందేహాలు వ్యక్తం చేస్తూ షోలాపూర్ జిల్లా మల్షిరాస్ తహసీలులో 1900 ఓట్లున్న మర్కర్‌వాడీ గ్రామం ప్రజల వినూత్న పోరాటం చేస్తున్నారు. ఈవీఎంల మీద అనుమానాన్ని వ్యక్తం చేస్తూ తమ ‘తీర్పు’ను తామే బ్యాలెట్ పేపర్ల ద్వారా మరోసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సంకల్పించారు. అధికారవర్గాలకు కంగారు పుట్టించింది. ప్రజలు స్వచ్ఛందంగా అలాంటి పోలింగును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోగా ఊరుమొత్తాన్ని చుట్టుముట్టిన పోలీసులు ఏకంగా ప్రజలను కర్ఫ్యూ పేరిట నిర్బంధించారు.
ఇదిలా ఉండగా దేశంలో పలు చోట్ల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల పనితీరు.. వాటిని హ్యాక్ చేసేందుకు ఉన్న అవకాశాల మీద విస్తృతంగా చర్చ జరుగుతోంది. గతంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ నిన్నటి మహా రాష్ట్ర ఎన్నికల్లోనూ పోలింగ్ సమయానికి ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓట్లకు, కౌంటింగ్ రోజున బయల్పడిన ఓట్లకు భారీ వ్యత్యాసం రావడంతో ఓడిపోయిన పార్టీల్లో బోలెడు సందేహాలు ముప్పిరిగొన్నాయి. దేశంలో మళ్ళీ బ్యాలెట్ విధానం రావాలంటూ డిమాండ్స్ వస్తున్నాయి.
ఈ తరుణంలో భాను ప్రతాప్ అనే సీనియర్ న్యాయవాది ఏకంగా చీఫ్ ఎన్నికల కమిషనర్ను తొలగించాలని డిమాండ్ చేయండి.. ఈ మేరకు లోక్ సభలో నోటీస్ ఇవ్వండి అంటూ కాంగ్రెసుకు సలహా ఇచ్చారు. మీరు డిమాండ్ చేసినట్లు ఈసీని తొలగించడానికి బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోదు కానీ ఒక చర్చ అయితే అవుతుంది కదా.. ఎన్నికల కమిషనర్‌ను తొలగించడం అంత ఈజీ కాదు కానీ మీ ప్రయత్నం వల్ల ఈవీఎంల పనితీరు మీద ప్రజల్లోనూ చర్చ జరుగుతుంది కదా.. ఈ దిశగా ఒక అడుగు వేయండి అంటున్నారు ఆ అడ్వకేట్.
ఇక ఎన్నికల కమిషన్ నిర్మాణం..కమిషనర్ తొలగింపు పద్ధతులు చూద్దాం..
భారత ఎన్నికల సంఘం:-
భారత ఎన్నికల సంఘం (ECI) దేశంలో ఎన్నికల ప్రక్రియలను నిర్వహించడానికి బాధ్యత వహించే స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324లో ఎన్నికల సంఘం గురించి పేర్కొన్నారు
కమిషన్ ప్రధానకార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఈ కమిషన్ భారతదేశంలోని లోక్ సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలతోబాటు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహిస్తుంది
ప్రస్తుతం రాజీవ్ కుమార్ ముఖ్య ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారు.
ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలంటే :
ఎన్నికల కమిషనర్ తొలగింపు గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5)లో పేర్కొన్నారు.లోక్‌సభ, రాజ్యసభలలో మూడింట రెండొంతుల మెజారిటీ ఉండి దానికి ఓటు వేయడానికి అవసరమైన అభిశంసన ప్రక్రియ ద్వారా మాత్రమే ప్రధాన ఎన్నికల కమిషనరును తొలగించవచ్చు. దీంతోబాటు ముఖ్య ఎన్నికల కమిషనర్ సిఫార్సుపై ఇతర ఎన్నికల కమీషనర్లను రాష్ట్రపతి తొలగించవచ్చు. ఇదిలా ఉండగా 2009 లో, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రవర్తించారంటూ ఎన్నికల కమిషనరు నవీన్ చావ్లాను తొలగించాలని అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్. గోపాలస్వామి అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు సిఫార్సు పంపినా దాన్ని రాష్ట్రపతి ఆమోదించలేదు.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment