‘EVMలపై పోరు.. ధోరణి మారింది ఎందుకో?’ | Congress Reacts After Omar Abdullah EVM Back Step | Sakshi
Sakshi News home page

‘EVMలపై పోరు.. ధోరణి మారింది ఎందుకో?’

Published Mon, Dec 16 2024 1:32 PM | Last Updated on Mon, Dec 16 2024 3:06 PM

Congress Reacts After Omar Abdullah EVM Back Step

ఈవీఎంల వ్యవహారంపై జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. సీఎం అయ్యాక ఆయన ధోరణి మారిందా? అంటూ ప్రశ్నించింది. ఈవీఎంలతో ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్‌ సహా పలు పార్టీలు ‘న్యాయ’ పోరాటానికి సిద్ధం అవుతున్నాయి. ఈ తరుణంలో.. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను (ఈవీఎంలను) నిందించడాన్ని వదిలేసి ఫలితాలను అంగీకరించాలంటూ విపక్ష కూటమిలోని ఒమర్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాశంమైంది. అయితే..

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. పార్టీ తరఫున సీనియర్‌ నేత మాణికం ఠాగూర్‌‌..  ‘‘సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీ, శివసేన యూబీటీ.. ఇవన్నీ ఈవీఎంలకు వ్యతిరేకంగానే మాట్లాడాయి. ఒమర్‌ అబ్దుల్లా..  మీ తరఫున ఓసారి వాస్తవాల్ని పరిశీలించండి. కాంగ్రెస్ సీడబ్ల్యూసీ తీర్మానం కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని స్పష్టంగా ప్రస్తావించింది. సీఎం అయ్యాక మా భాగస్వాముల ధోరణి ఎందుకు మారిందో? అని ప్రశ్నించారాయన. ‌

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై.. ఎంవీఏ కూటమి నుంచి పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో ఈవీఎంలపై పోరాటానికి కాంగ్రెస్‌ పార్టీ పిలుపు ఇచ్చింది. అయితే ఇండియా కూటమిలో భాగమైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఒమర్‌ అబ్దుల్లా మాత్రం ఈవీఎం అవకతవకలపై విరుద్ధంగా స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌నే ప్రధానంగా టార్గెట్‌ చేసి ఆయన మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. 

‘‘గెలిచినప్పుడు ఒకలా, ఓడినప్పుడు మరో విధంగా కాంగ్రెస్‌ పార్టీ మాట్లాడడం తగదు. వందమందికి పైగా సభ్యులు అదే ఈవీఎంలతో మీ పార్టీ(కాంగ్రెస్‌ను ఉద్దేశించి..) తరఫున నెగ్గినప్పుడు దానిని ఘన విజయంగా తీసుకున్నారు. కొన్ని నెలల తర్వాత మీరు అనుకున్న ఫలితాలు రాకపోయేసరికి ఈవీఎంలను నిందిస్తున్నారు. పక్షపాతంతో కాకుండా సిద్ధాంతాల ఆధారంగానే నేను మాట్లాడుతున్నా.

..ఓటింగు విధానంపై విశ్వాసం లేనప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఈవీఎంలతో ఏదైనా సమస్య ఉంటే దానిపై పోరాటం చేయాలి. ఫలితాలకు ఈవీఎంలతో సంబంధం లేదు. ఓటర్లు ఒకసారి మనల్ని ఎన్నుకుంటారు. మరోసారి ఎన్నుకోరు. నేనే దీనికి ఉదాహరణ. లోక్‌సభ ఎన్నికల్లో నేను ఓడిపోయాను. సెప్టెంబరులో అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించాను. యంత్రాలను నేనెప్పుడూ ఆడిపోసుకోలేదు’’ అని అన్నారు. మొన్నటి జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలు కలిసే పోటీ చేశాయి.

ఇదీ చదవండి:  ఆ కుటుంబం కోసం రాజ్యాంగాన్నే మార్చేశారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement