సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘సమైక్య’ బొక్కసానికి త్వరలో గడువు ముగియనుంది. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డే సమీపిస్తున్న నేపథ్యంలో ఆలోపు ఉమ్మడి రాష్ట్రం ఖాతా నుంచి ఇరుప్రాంతాలకు సంబంధించిన చెల్లింపులు వీలైనంత త్వరితగతిన పూర్తిచేయాలని సర్కారు భావించింది. దీంతో ఈ నెల 25వ తేదీ నాటికి ఉద్యోగుల జీతాలతో సహా అన్ని రకాల చెల్లింపులు చేపట్టేందుకు యంత్రాం గం చర్యలు వేగిరం చేసింది.
ఇందులో భాగంగా ఈ నెల 21లోగా అన్ని శాఖలకు సంబంధించిన బిల్లులు ఖజానా అధికారులకు చేరవేస్తే.. ఆ ప్రకారం చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేస్తారని ఇదివరకే స్పష్టం చేసింది. దీంతో బిల్లుల సమర్పణకు దిగిన అధికారులు గడువులోగా ప్రక్రియ పూర్తిచేశారు. బిల్లుల సమర్పణకు బుధవారం ఆఖరు తేదీ కావడంతో అధికారుల్లో హడావుడి మరింత పెరిగింది. గతంలో పెండింగ్‌లో ఉన్న కార్యాలయ నిర్వహణ తదితర బిల్లులతో సహా.. తాజా బిల్లులన్నీ కట్టకట్టి ఖజానా అధికారులకు సమర్పించే పనిలోపడ్డారు. జిల్లా ఖజానా శాఖ పరిధిలో 34 ప్రభుత్వ శాఖలకు సంబంధించి చెల్లింపులు జరుగుతున్నాయి.
అదేవిధంగా 9 ఉప ఖజానా శాఖల పరిధిలో మండల కార్యాలయాలతో పాటు మిగిలిన జిల్లా శాఖ కార్యాలయాలకు సంబంధించి చెల్లింపులు చేపడుతున్నారు. బుధవారం చివరిరోజు కావడంతో ఆయా కార్యాలయాలన్నీ బిల్లుల సమర్పణలతో కిటకిటలాడాయి. కొన్నిచోట్ల చిన్నపాటి తప్పిదాల కారణంగా బిల్లులు సమర్పించలేదు. ఉద్యోగులకు మే నెల వేతనాలు కూడా ఈ నెల 25లోపు రానున్నాయి. అంతేకాకుండా జూన్ నెల 2న అపాయింట్‌మెంట్ తేదీ ఉన్నందున ఒకటోతేదీకి సంబంధించిన వేతనం కూడా ఈలోపు ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
మిగులు నిధులు వెనక్కి..
అపాయింట్‌మెంట్ తేదీ నాటికి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారి(డీడీఓ)ల ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉండాలి. అయితే చెల్లింపుల ప్రక్రియ పూర్తయినప్పటికీ.. మిగులు నిధులుంటే వాటిని ఈ నెల 27తేదీ లోపు సంబంధిత ఉన్నతాధికారి కార్యాలయంలో జమ చేయాల్సి ఉంటుంది. దీంతో మిగులు లెక్కలు తేల్చడంలో డీడీఓలు బిజీ అయ్యారు. చిల్లిగవ్వైనా సరే మిగిలి ఉంటే వాటిని వెంటనే హెడ్‌ఆఫీస్ ఖాతాలో జమచేసి అందుకు సంబంధించిన రసీదులను సంంబధిత అధికారులకు చేరవేయాలని జిల్లా ఖజానా శాఖ అధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు.
ఖజానా కార్యాలయాలు కిటకిట
Published Thu, May 22 2014 12:28 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement