తెలంగాణకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలేవీ? | Residential degree collagesTelangana? | Sakshi
Sakshi News home page

తెలంగాణకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలేవీ?

Published Wed, Aug 27 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM

తెలంగాణకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలేవీ?

తెలంగాణకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలేవీ?

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రెండు ప్రభుత్వ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కే దక్కాయి. ఉన్నత విద్యలో ఉత్తమ ప్రమాణాల కోసం కేసీఆర్ ప్రభుత్వం సత్వరమే తెలంగాణలో కనీసం నాలుగు చోట్ల వీటిని ఏర్పర్చాలి.
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి స్వయంపాలన మొదలయింది. ఇప్పుడు ప్రభుత్వ రెసిడెన్షియల్ (ఆశ్రమ) విద్యావిధానంపై దృష్టి పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో అందించే విద్య ఉన్నత ప్రమాణాలతోపాటు, ఉచితంగా విద్యాబోధన, వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తుండడంతో పేద, దిగువ, మధ్య తరగతి ప్రజలు వీటిపై మక్కువ చూపుతున్నారు. కార్పొరేట్ కాలేజీల్లో చదువు అంటే లక్షల్లో ఖర్చవుతోంది. అదే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటైతే పేద, దిగువ, మధ్య తరగతి ప్రజలకు కల్పతరువులుగా మారతాయి..

తొలి పాఠశాల తెలంగాణలోనే...

ఉమ్మడి రాష్ట్రంలో 1972లో ఆశ్రమ పాఠశాల విద్యావిధానానికి నాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా సర్వేలులో తొలి రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసింది. దీనికి సర్వోదయ ట్రస్ట్ భూమిని, భవనాలను విరాళంగా ఇచ్చింది. తొలిదశలో పాఠశాలలు ప్రారంభించిన ప్రభుత్వం ఆ తరువాత జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేసింది. తెలంగాణలో రెసిడెన్షియల్ పాఠశాలలు 58 (వీటిలో మైనారిటీల పాఠశాలలు 7), జూనియర్ కళాశాలలు నాలుగు (వీటిలో మైనారిటీ-2) ఉన్నాయి. మొత్తంగా 20 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా ఏపీలో ఏర్పర్చిన రెండు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో 1,296 మంది ఉంటే వీరిలో 545 మంది తెలంగాణ విద్యార్థులు చదువుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ ఒక్కటీ లేని పరిస్థితి ఏర్పడింది.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీలో 2 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు మొదలయ్యాయి. తొలిదాన్ని 1972లో కర్నూలులో ప్రారంభించారు. 1969, 1972లో వచ్చిన ప్రత్యేక రాష్ట్ర (తెలంగాణ, జైఆంధ్ర) ఉద్యమాల నేపథ్యంలో మూడు ప్రాంతాల విద్యార్థులు కలసి విద్యనభ్యసించే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. 1982 సెప్టెంబర్ 1న గుంటూరు జిల్లాలోని విజయపురి సౌత్ (నాగార్జునసాగర్)లో ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేశారు. వీటిలో 42:36:22 ప్రకారం మూడు ప్రాంతాల విద్యార్థులకు ప్రవేశాలు లభించేవి. విభజన తరువాత ఈ రెండూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కాయి. తెలంగాణకు ఇలాంటి విద్యాసంస్థ ఒక్కటీ లేదు. రాష్ట్రస్థాయి సంస్థలో చదివినందువల్ల వీటిలో చదివిన తన విద్యార్థుల్ని తెలంగాణ ప్రభుత్వం స్థానికులుగానే పరిగణించాల్సి ఉంటుంది. అయితే వచ్చే ఏడాది నుంచి చదివే తెలంగాణ విద్యార్థులు ఈ రెండు కళాశాలల్లో ఎక్కడ చదివినా మరో రాష్ర్టంలో చదివినట్లే అవుతుంది. పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులకు ప్రవేశాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. అందుకే తెలంగాణ సర్కారు సొంత రాష్ట్రంలో నాలుగు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలి

తెలంగాణకు ఎంతో ఉపయుక్తం

ప్రస్తుతం తెలంగాణలో కొత్తవాటితో కలిపి 126 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇవికాక ప్రైవేటులో 944 కాలే జీలు నడుస్తున్నాయి. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో నియ మించే బోధకులకు ఉన్నత విద్యార్హతలు ఉంటాయి కాబట్టి ఉన్నత ప్రమాణాలకు అక్కడ బీజం పడుతుంది. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం సత్వరమే కొత్తగా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. సివిల్ సర్వీసులు, గ్రూప్స్ వంటి వాటికి ఎంపికయ్యే అభ్యర్థులు ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల నుంచే వస్తుంటారు. కాబట్టి తెలంగాణ విద్యార్థులు కూడా ఉన్నత ప్రమాణాలతో ఉత్తీర్ణులై, పోటీ పరీక్షల్లో విజయాలు సాధించడానికి రెసిడెన్షియల్ కాలేజీలు నిచ్చెనలా ఉపయోగపడతాయి.

నవీన కోర్సులతో ఏర్పాటు మేలు

ఈ కళాశాలల్లో కాలానుగుణంగా వచ్చిన మార్పులను బట్టి నవీన కోర్సులతో ఏర్పాటు చేయడం ముఖ్యం. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు ఆధునికంగా వై-ఫై, ఇ-లైబ్రరీ అందుబాటులో ఉంచి, చక్కటి ఫ్యాకల్టీని ఏర్పాటు చేయాలి. ఈ కళాశాలల్లో చదివిన వారికి అక్కడే ప్లేస్‌మెంట్‌తో పాటు పీజీ, ఆ తరువాత సివిల్ సర్వీసెస్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే అవకాశం కూడా కల్పిస్తే అద్భుత ఫలితాలు సాధించడానికి వీలవుతుంది. ఉన్నత ప్రమాణాలకు నెలవుగా ఉన్న సిల్వర్ జూబిలీ, ఏపీ రెసిడెన్షియల్ కాలేజీల తరహాలో వీటి ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ  చూపాల్సి ఉంది.
 
కె. బాలకిషన్ రావు, సీనియర్ జర్నలిస్ట్
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement