Mean the government
-
తెలంగాణకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలేవీ?
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రెండు ప్రభుత్వ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కే దక్కాయి. ఉన్నత విద్యలో ఉత్తమ ప్రమాణాల కోసం కేసీఆర్ ప్రభుత్వం సత్వరమే తెలంగాణలో కనీసం నాలుగు చోట్ల వీటిని ఏర్పర్చాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి స్వయంపాలన మొదలయింది. ఇప్పుడు ప్రభుత్వ రెసిడెన్షియల్ (ఆశ్రమ) విద్యావిధానంపై దృష్టి పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో అందించే విద్య ఉన్నత ప్రమాణాలతోపాటు, ఉచితంగా విద్యాబోధన, వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తుండడంతో పేద, దిగువ, మధ్య తరగతి ప్రజలు వీటిపై మక్కువ చూపుతున్నారు. కార్పొరేట్ కాలేజీల్లో చదువు అంటే లక్షల్లో ఖర్చవుతోంది. అదే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటైతే పేద, దిగువ, మధ్య తరగతి ప్రజలకు కల్పతరువులుగా మారతాయి.. తొలి పాఠశాల తెలంగాణలోనే... ఉమ్మడి రాష్ట్రంలో 1972లో ఆశ్రమ పాఠశాల విద్యావిధానానికి నాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా సర్వేలులో తొలి రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసింది. దీనికి సర్వోదయ ట్రస్ట్ భూమిని, భవనాలను విరాళంగా ఇచ్చింది. తొలిదశలో పాఠశాలలు ప్రారంభించిన ప్రభుత్వం ఆ తరువాత జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేసింది. తెలంగాణలో రెసిడెన్షియల్ పాఠశాలలు 58 (వీటిలో మైనారిటీల పాఠశాలలు 7), జూనియర్ కళాశాలలు నాలుగు (వీటిలో మైనారిటీ-2) ఉన్నాయి. మొత్తంగా 20 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా ఏపీలో ఏర్పర్చిన రెండు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో 1,296 మంది ఉంటే వీరిలో 545 మంది తెలంగాణ విద్యార్థులు చదువుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ ఒక్కటీ లేని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీలో 2 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు మొదలయ్యాయి. తొలిదాన్ని 1972లో కర్నూలులో ప్రారంభించారు. 1969, 1972లో వచ్చిన ప్రత్యేక రాష్ట్ర (తెలంగాణ, జైఆంధ్ర) ఉద్యమాల నేపథ్యంలో మూడు ప్రాంతాల విద్యార్థులు కలసి విద్యనభ్యసించే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. 1982 సెప్టెంబర్ 1న గుంటూరు జిల్లాలోని విజయపురి సౌత్ (నాగార్జునసాగర్)లో ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేశారు. వీటిలో 42:36:22 ప్రకారం మూడు ప్రాంతాల విద్యార్థులకు ప్రవేశాలు లభించేవి. విభజన తరువాత ఈ రెండూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కాయి. తెలంగాణకు ఇలాంటి విద్యాసంస్థ ఒక్కటీ లేదు. రాష్ట్రస్థాయి సంస్థలో చదివినందువల్ల వీటిలో చదివిన తన విద్యార్థుల్ని తెలంగాణ ప్రభుత్వం స్థానికులుగానే పరిగణించాల్సి ఉంటుంది. అయితే వచ్చే ఏడాది నుంచి చదివే తెలంగాణ విద్యార్థులు ఈ రెండు కళాశాలల్లో ఎక్కడ చదివినా మరో రాష్ర్టంలో చదివినట్లే అవుతుంది. పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులకు ప్రవేశాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. అందుకే తెలంగాణ సర్కారు సొంత రాష్ట్రంలో నాలుగు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలి తెలంగాణకు ఎంతో ఉపయుక్తం ప్రస్తుతం తెలంగాణలో కొత్తవాటితో కలిపి 126 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇవికాక ప్రైవేటులో 944 కాలే జీలు నడుస్తున్నాయి. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో నియ మించే బోధకులకు ఉన్నత విద్యార్హతలు ఉంటాయి కాబట్టి ఉన్నత ప్రమాణాలకు అక్కడ బీజం పడుతుంది. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం సత్వరమే కొత్తగా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. సివిల్ సర్వీసులు, గ్రూప్స్ వంటి వాటికి ఎంపికయ్యే అభ్యర్థులు ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల నుంచే వస్తుంటారు. కాబట్టి తెలంగాణ విద్యార్థులు కూడా ఉన్నత ప్రమాణాలతో ఉత్తీర్ణులై, పోటీ పరీక్షల్లో విజయాలు సాధించడానికి రెసిడెన్షియల్ కాలేజీలు నిచ్చెనలా ఉపయోగపడతాయి. నవీన కోర్సులతో ఏర్పాటు మేలు ఈ కళాశాలల్లో కాలానుగుణంగా వచ్చిన మార్పులను బట్టి నవీన కోర్సులతో ఏర్పాటు చేయడం ముఖ్యం. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు ఆధునికంగా వై-ఫై, ఇ-లైబ్రరీ అందుబాటులో ఉంచి, చక్కటి ఫ్యాకల్టీని ఏర్పాటు చేయాలి. ఈ కళాశాలల్లో చదివిన వారికి అక్కడే ప్లేస్‌మెంట్‌తో పాటు పీజీ, ఆ తరువాత సివిల్ సర్వీసెస్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే అవకాశం కూడా కల్పిస్తే అద్భుత ఫలితాలు సాధించడానికి వీలవుతుంది. ఉన్నత ప్రమాణాలకు నెలవుగా ఉన్న సిల్వర్ జూబిలీ, ఏపీ రెసిడెన్షియల్ కాలేజీల తరహాలో వీటి ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాల్సి ఉంది. కె. బాలకిషన్ రావు, సీనియర్ జర్నలిస్ట్ -
పైపై మెరుగులా... సమూల సంస్కరణలా!
పోలీసు వ్యవస్థను సమూలంగా సంస్కరిస్తామంటున్న కేసీఆర్ ప్రభుత్వం పైపై మెరుగులకు పరిమితం కారాదు. పోలీసు వ్యవస్థలోని మౌలిక రుగ్మతలకు చికిత్స చేయడం అవసరం. అప్పుడే తెలంగాణ పోలీసు నిష్పాక్షికమైన, సమర్థవంతమైన వ్యవస్థగా మారుతుంది. పోలీసు వ్యవస్థ సమూల సంస్కరణకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నడుంకట్టారు. అంటే నేటి వ్యవస్థ ఎంతో లోపభూయిష్టంగా ఉన్నదని ఆయన అంగీకరించినట్టే. ఆయన గుర్తించిన ఆ లోపాలేమిటి? వాటికి కారణాలూ, ఆయన సూచిస్తున్న పరిష్కారాలేమిటి? అనే సందేహాలు కలగడం సహజం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు వెల్లడించిన సంస్కరణల్లో ప్రధానమైనది రాష్ట్ర పోలీసు శాఖలోని అన్ని విభాగాలను కలిపి ఒకే వ్యవస్థగా రూపొందించడం. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా న్యూయార్క్ తరహా పోలీసింగ్, పోలీసు వాహనాల కొనుగోలు, నగరం అంతటా సీసీ టీవీ కెమెరాల నిఘా వంటి నిర్ణయాలను తీసుకున్నారు. పోలీసు యూనిఫారాల్లో మార్పులు, ఆధునిక సాంకేతిక పరికరాలను సమకూర్చుకోవడం వంటి ప్రయత్నాలు కూడా జోరుగా సాగుతున్నాయి. కానీ హంగులతో, రూపం మారటంతోటే వ్యవస్థ స్వభావం మారిపోదు. తెలంగాణలోనే కాదు ఏ రాష్ట్రంలోనైనా పోలీసు వ్యవస్థకు పట్టిన ప్రధాన వ్యాధి... అధికార పార్టీల అడుగులకు మడుగులొత్తుతూ విధులను నిర్వహించాల్సి రావడం. ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే కొందరు ఉన్నత ప్రభుత్వాధికారులే రాష్ట్ర పోలీసు వ్యవస్థను శాసిస్తున్నారు. డీజీపీ నుండి కానిస్టేబుల్ వరకు పాలక పక్షానికి అనుకూలంగా ఉంటేనే కీలకమైన, మంచి పోస్టింగులు దొరుకుతాయి. ఏ చిన్న తేడా వచ్చినా శంకర గిరి మాన్యాలు పట్టాల్సిందే. అధికారంలో ఉన్నవారి దయ లేకున్నా, వారికి అనుగుణంగా చట్టాలను ఎటుబడితే అటు వంచకపోతే ఎంత సమర్థుడైన అధికారికైనా ‘లూప్ లైనే’ గతి. ఆత్మాభిమానాన్ని చంపుకుని చేతి చ మురు వదుల్చుకుని సంపాదించుకున్న పోస్టింగ్‌ను ఇక వాళ్లు ఎలా ఉపయోగించుకుంటారో ప్రజాప్రతినిధులకు, ఆ పై మంత్రులకు, ముఖ్యమంత్రులకు తెలియనిది కాదు. అలాంటి అధికారులకు చట్టంపై, ప్రజలపై ఎంత గౌరవం ఉంటుందో ఎవరైనా ఉహించగలిగిందే. ‘‘ప్రజాస్వామ్య సౌధపు నాలుగు స్తంభాల్లో ఎక్కువ అధికారం రాజకీయ వ్యవస్థదే. ఏ అధికారి అయినా, ఎంతటి నిజాయితీపరుడైనా రాజకీయ అధికారానికి తలొగ్గాల్సిందే’’ అంటూ ఒక ఉన్నతాధికారి నిస్పృహతో వ్యాఖ్యానించారు. పోలీసు వ్యవస్థను సమూలంగా సంస్కరిస్తామంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోలీసు వ్యవస్థపై పెత్తనాన్ని వదులుకొని, చట్టాన్ని నిష్పక్షపాతంగా, నిజాయితీగా అమలుచేసేటంతటి తెగింపు, త్యాగశీలత, నిబద్ధత ఉన్నాయా? ఇక ప్రభుత్వ యంత్రాంగంలోని అన్ని శాఖల్లోకీ పోలీసుల్లోనే బాసిజం ఎక్కువ. ఆర్డర్లీ రూపంలోని బానిసత్వం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు బ్రిటిష్ పాలకులు వివిధ రకాల విధుల నిర్వహణకు గానూ పోలీసు శాఖలో పౌర, సాయుధ రిజర్వు పోలీసు విభాగాలను ఏర్పాటు చేశారు. సివిల్ పోలీసుల్లో శాంతిభద్రతల పరిరక్షణ, క్రిమినల్, ట్రాఫిక్ వంటి ఉప విభాగాలున్నాయి. ఆయా శాఖల్లో కానిస్టేబుల్ నుండి ఎస్ఐ వరకు ఆయా విధులకు సంబంధించిన ప్రత్యేక శిక్షణను ఇస్తారు. అలాంటి విభాగాలను ఒక్కటిగా చేయడం వల్ల తలెత్తే సమస్యలను గురించి సమూలమైన అధ్యయనం జరపకుండానే ప్రభుత్వం తొందరపాటును ప్రదర్శిస్తోంది. పోలీసు శాఖలో చేరడమంటే నేటికీ 24 గంటల పనిదినమనే పరిస్థితే కొనసాగుతోంది. అంతంత మాత్రపు జీతభత్యాలు, ఎందుకూ కొరగాని అలవెన్సులు. స్టేషనరీ నుంచి, లాకప్ ఖైదీల భోజన వసతి, అనాథ శవ సంస్కారాల వరకు అన్నిటికీ కలిపి చెల్లించేది రూ.1500. ఇక కింది స్థాయి వారి పిల్లలకు విద్య, వైద్యం, గృహవసతులు లేనే లేవు. ఈ పరిస్థితులను మార్చకుండా సంస్కరణలనడం హాస్యాస్పదం. కాగా, సెప్టెంబర్ నాటికల్లా హైదరాబాద్ అంతటా 4 జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పోలీసు సిబ్బంది వాడుతున్నది పాతికేళ్ల క్రితం నాటి సాంకేతికత. ఐస్‌ఐలకు సైతం ఆండ్రాయిడ్ ఫోన్లను అందించింది లేదు. ఆధునిక నేరగాళ్లతో తలపడాల్సిన పోలీసుల ఆత్మస్థయిర్యం పెరిగేలా వారికి కనీస సౌకర్యాలు అందించకుండా యూనిఫారాల్లోనో, వాహనాల రంగుల్లోనో మార్పులు చేస్తే సరిపోతుందా? కొత్త రాష్ట్రం తెలంగాణ, దేశంలోనే సరికొత్త పోలీసు వ్యవస్థకు నాంది కావాలంటే పైపై మెరుగులకు పరిమితంగాక నిజంగానే సమూల సంస్కరణకు పూనుకోవాలి. అప్పుడే పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా, చట్టాలను అమలు చేసే సమర్థవంతమైన వ్యవస్థగా అభివృద్ధి చెందుతుంది. బోరెడ్డి అయోధ్య రెడ్డి