ఆదివాసీలను ముంచడం సరికాదు
- పోడు భూములు లాక్కొనేందుకే హరితహారం
- తుడుందెబ్బ నేత పోదెం బాబు
- ములుగులో ర్యాలీ.. ఆర్డీ కార్యాలయ ముట్టడి
ములుగు : ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం పేరు మీద తెలంగాణ నాయకులు ఆదివాసీలను ఆంధ్ర ప్రాంతానికి బలిస్తే.. నేడు తెలంగాణ ప్రభుత్వం కంతనపల్లి, మణుగూరు థర్మల్ ప్రాజెక్టు, కుంటాల హైడల్ ప్రాజెక్టు, ఇచ్చంపల్లి ప్రాజెక్టులతో ఆదివాసీలను ముంచడం సరికాదని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు పోదెం బాబు అన్నారు. ఈ మేరకు సమితి ఆధ్వర్యంలో సోమవారం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవిని నమ్ముకుని పోడు వ్యవసాయంతో జీవిస్తున్న ఆదివాసీల భూములను ప్రభుత్వం హరితహారం పేరుతో లాక్కొని మొక్కలు నాటేందు కు అణచివేత చర్యకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు తహసీల్దార్లు ఏజె న్సీ సర్టిఫికెట్లు జారీ చేయడం లేదని, ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.10 వేల వరకు లంచం తీసుకుంటున్నారని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆలం రవికుమార్ ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏటూరునాగారం మండలాన్ని స్వయం ప్రతిపత్తి గల ఆదివాసీ జిల్లా కేంద్రంగా ప్రకటించాలని తుడుందెబ్బ ములుగు డివిజన్ కమిటీ అధ్యక్షుడు ముద్దెబోయిన రవి డిమాండ్ చేశారు. ఆ తర్వా త తమ సమస్యలు పరిష్కరించాలని కార్యాలయ అధికారికి వినతిపత్రం అందించారు. సంఘం నేతలు తాటి హన్మంతరావు, ఆగబోయిన రవి, కోరగట్ల లక్ష్మణ్‌రావు, నాలి సారయ్య, పులిసె బాల క్రిష్ణ, జివ్వాజి రవి, వట్టం నాగరాజు, కొండ నాగరాజు పాల్గొన్నారు.