Aborigines
-
కార్పొరేట్ ఎజెండాకు ఆదివాసీలు బలి!
బిర్సా ముండా జయంతిని పునస్కరించుకుని మోదీ ప్రభుత్వం తాను ఆదివాసీలకు అనుకూలమని చాటుకోవడానికి భారీ ప్రయత్నమే తలపెట్టింది. దీంట్లో భాగంగానే బిర్సా ముండా జయంతిని ఇకనుంచి జనజాతీయ గౌరవ్ దివస్‌గా జరుపుకుంటామని కేంద్రం ప్రకటించింది. 2014లో కేంద్రంలో మోదీ అధికారం చేపట్టిన తర్వాత కూడా ఆదివాసీలను అడవులనుంచి తరిమేసి వారిని నిలువునా మోసగించడం అనే ప్రక్రియ ఏమాత్రం ఆగకపోగా, మరింత ఎక్కువైంది. ఒకవైపు ప్రభుత్వ ప్రాయోజిత మౌలిక వసతుల కల్పనా ప్రాజెక్టులు, మరోవైపు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల దురాశ కలిసి ఆదివాసీలను వారి సాంప్రదాయిక భూభాగాల నుంచి తరిమివేస్తున్నాయి. ఆదివాసీ ప్రముఖులను ప్రశంసించడం, వారిపేర్లను రైల్వే స్టేషన్లకు పెట్టడం చేస్తూనే, మరోవైపున అడవులపై ఆదివాసీల హక్కును కాలరాస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే హిందుత్వ కార్పొరేట్ పరిపాలనా వ్యవస్థకు ఆదివాసీలే బాధితులయ్యారు. నవంబర్ 15న ఆదివాసీ దిగ్గజ నేత బిర్సా ముండా జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో జరిగిన ఆదివాసీల భారీ ర్యాలీని ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా ఆదివాసీలు నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారని ఆయన విచారం వెలిబుచ్చారు. ఒక్క తన ప్రభుత్వం మాత్రమే దేశాభివృద్ధిలో ఆదివాసీలను భాగస్తులను చేసి, వివిధ సంక్షేమ పథకాల ద్వారా వారికి లబ్ధి కలిగిస్తోందని ప్రధాని ఘనంగా చెప్పుకున్నారు. బిర్సా ముండా జయంతిని పునస్కరించుకుని మోదీ ప్రభుత్వం తాను ఆదివాసీలకు అనుకూలమని ఘనంగా చాటుకుంది. దీంట్లో భాగంగానే బిర్సా ముండా జయంతిని ఇకనుంచి ‘జనజాతీయ గౌరవ్ దివస్’గా జరుపుకుంటామని కేంద్రం ప్రకటించింది. దీంట్లో భాగంగానే మోదీ భోపాల్ లోని హబిబ్ గంజ్ రైల్వేస్టేషన్ పేరును గోండు రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌గా మార్చింది. అదే రోజున రాంచీలో బిర్సా ముండా, ఆదివాసీ చరిత్రపై మ్యూజియంని కూడా ప్రధాని ఆన్లైన్లో ప్రారంభించారు. చెప్పేదొకటి... చేసేదొకటి! బిర్సా ముండా జయంతి ఉత్సవాలు నిర్వహించడం, ఆదివాసీ ప్రయోజనాల పరిరక్షణలో తానే చాంపియన్ అని ప్రధాని ప్రకటించుకోవడం చూడ్డానికి బాగానే ఉంది కానీ, కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి ఆదివాసీ హక్కులను హరించివేస్తోంది. పైగా దేశంలోని అడవులు, అటవీ భూముల్లో అంతర్భాగంగా ఉంటున్న ఆదివాసీలను, వారి జీవన విధానాన్ని కేంద్ర ప్రభుత్వమే ధ్వంసం చేస్తోంది. ఒకవైపు ప్రభుత్వ ప్రాయోజిత మౌలిక వసతుల కల్పనా ప్రాజెక్టులు, మరోవైపు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల దురాశ కలిసి ఆదివాసీలను వారి సాంప్రదాయిక భూభాగాల నుంచి తరిమి వేస్తున్నాయి. కాంట్రాక్టర్లు ఆదివాసీల ప్రాథమిక, రాజ్యాంగబద్ధ హక్కులను సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు. గత ప్రభుత్వాల ఆచరణ సరేసరి. కానీ 2014లో కేంద్రంలో మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కూడా ఆదివాసీలను అడవులనుంచి తరిమేసి వారిని నిలువునా మోసగించడం అనే ప్రక్రియ ఏమాత్రం ఆగలేదు సరికదా మరింత ఎక్కువైంది. పైగా గనులు, ఖనిజాల అన్వేషణ, రసాయన పరిశ్రమల ద్వారా ప్రైవేట్ పెట్టుబడి ప్రకృతి సహజ వనరులను, అటవీ సంపదను కొల్లగొట్టే ప్రక్రియ కూడా మొదలైపోయింది. అయిదవ, ఆరవ షెడ్యూల్ ప్రాంతాల్లో గనుల లీజు, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రామసభల ఆమోదం తప్పనిసరి అనే నిబంధనకు నరేంద్రమోదీ ప్రభుత్వం తూట్లు పొడిచింది. కేంద్రంలో అధికారం స్వీకరించాక మొట్టమొదటగా గనులు, ఖనిజాల (అభివృద్ధి, క్రమబద్ధీకరణ) సవరణ చట్టం 2015కి ఆమోదముద్ర వేసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2011లో ఆమోదించిన సవరణ చట్టంలో ఆది వాసీల హక్కుల రక్షణకు సంబంధించిన నిబంధనలను ఈ కొత్త సవరణ చట్టం తుంగలో తొక్కింది. అయిదో, ఆరో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గనుల లీజుకు గ్రామసభల అనుమతి తీసుకోవడం, ఈ ప్రాంతాల్లోని చిన్న స్థాయి ఖనిజ వనరులను మంజూరు చేయడానికి ఆదివాసీ కో ఆపరేటివ్‌లకు అర్హత కల్పించడం, బొగ్గు గని సంస్థలు తమ లాభాల్లో 26 శాతాన్ని జిల్లా ఖనిజాల సంస్థకు ఇవ్వడం అనే అంశాలను ప్రధాని మోదీ ప్రభుత్వం ఒక్క వేటుతో రద్దు చేసి పడేసింది. సకల హక్కులకూ ఆదివాసీలు ఇక దూరం ఒకవైపు ఆదివాసీ జనాభాతో కూడిన అటవీ ప్రాంతాల్లో గనులు, ఖనిజాల పరిశ్రమలను నెలకొల్పుకోవడానికి లైసెన్స్ ఇస్తున్నారు. మరోవైపు అయిదో, ఆరవ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ఆదివాసీ ప్రజల రాజ్యాంగబద్ధ హక్కులను హరించివేస్తున్నారు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే భారతీయ అటవీ చట్టం 1927కు ప్రతిపాదించిన సవరణ వల్ల ఆదివాసీ గ్రామ సభల పాత్రను పూర్తిగా తుడిచిపెట్టుకు పోనుంది. దీంతో ఆదివాసీల పరిస్థితి... ఇతర కమ్యూనిటీలతో సరిసమాన స్థితికి దిగజారిపోవడం ఖాయం. పైగా, సాగు చేసుకునే హక్కు, చేపలు పట్టుకునే హక్కు, అటవీ ఉత్పత్తులపై, పశువుల మేతపై హక్కు వంటి ఆదివాసీ జీవితానికి సంబంధించిన అన్ని అంశాలనూ ఇకనుంచి నేరమయంగా మార్చివేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం 2015లో తీసుకొచ్చిన అటవీ చట్ట సవరణ బిల్లు పట్ల తీవ్రమైన వ్యతిరేకత ప్రబలిపోవడంతో ఇంతవరకు ఆ బిల్లుకు మోక్షం లభించలేదు. అయితే 2018–2019 ప్రతిపాదిత అటవీ విధానం లేక అటవీ పరిరక్షణ చట్టం 1980కి చేయదలుస్తున్న ఇతర సవరణల కారణంగా తక్షణ ఫలితం ఏమిటంటే, అటవీయేతర ప్రయోజనాల కోసం అటవీ భూములను మళ్లించడం ఇకపై సులభతరం కానుంది. అడవుల ప్రైవేటీకరణ, వాణిజ్యీకరణపై గ్రామసభ అనుమతి తప్పనిసరి కాగా ఇక ఆ హక్కు లేకుండా చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ మార్పుల కారణంగా అటవీ హక్కుల చట్టం నిబంధనలకే తూట్లుపడబోతోంది. దీర్ఘకాలంగా అడవుల్లోనే నివసిస్తున్నవారికి అటవీ భూముల కల్పన, గిరిజన సమాజాల హక్కును పరిరక్షించడం, ఆది వాసీల సాగు హక్కు, చిన్న చిన్న అటవీ ఉత్పత్తులను సేకరించుకోవడం వంటివాటిని ఈ అటవీ హక్కుల చట్టం నిలబెడుతూ వచ్చింది. మొత్తంమీద, మోదీ పాలనలో ఆదివాసీ ప్రజల హక్కులను టోకున హరించివేయడం పతాక స్థాయికి చేరుకుంటోంది. ఆదివాసీలు, ఆదివాసీ సమాజాలకు అటవీ భూములపై పట్టా కలిగి ఉండే హక్కు, అటవీ భూములను తాము మాత్రమే సాగు చేసుకునే హక్కును ప్రసాదించిన అటవీ హక్కుల చట్టం–2006ని సైతం ఇప్పుడు ఉల్లంఘించేశారు. కేంద్ర ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం గిరిజనులు, ఆది వాసీ సమాజాలకు చెందినవారు దరఖాస్తు చేసుకున్న భూ హక్కు ప్రకటనల్లో 46.69 శాతాన్ని మాత్రమే ఆమోదించారు. అంటే 50 శాతం కంటే తక్కువ మందికి మాత్రమే భూ హక్కు లభించింది. మధ్యప్రదేశ్‌లో అటవీ హక్కుల చట్టం కింద అటవీ భూమిపై హక్కుకు సంబంధించి ఆదివాసీ కుటుంబాలు పెట్టుకున్న దరఖాస్తులను అయిదింట మూడో వంతు వరకు తిరస్కరించారు. ఆదివాసీ పిల్లల చదువులకు తలుపులు మూశారు మోదీ పాలనలో ఆదివాసీల సాంఘిక సంక్షేమ చర్యలు ఆదివాసీ పిల్లల దుస్థితికి దృష్టాంతాలుగా నిలిచాయి. 2020 మార్చి నుంచి అంటే కోవిడ్ తొలిదశలో లాక్డౌన్ ప్రకటించాక పాఠశాలలను మూసేశారు. 90 నుంచి 95 శాతంవరకు గ్రామీణ ఆదివాసీ విద్యార్థులు ఎలాంటి విద్యకూ నోచుకోలేదు. అన్లైన్ విద్య అనే ప్రపంచం ఆదివాసీ పిల్లలకు తలుపులు మూసేసింది. వీరిలో చాలామందికి సంబంధించి విద్యా హక్కు గాలికి కొట్టుకుపోయింది. ఆహార భద్రత కూడా లేకపోవడంతో గ్రామీణ ఆదివాసీ కుటుంబాలు తీవ్రంగా దెబ్బతినిపోయాయి. ఈ కాలంలో ఎక్కువ ఆకలి చావులు ఆదివాసీ కుటుం బాల్లోనే చోటు చేసుకున్నాయి. ఆదివాసీల పట్ల మోదీ ప్రభుత్వ వైఖరి మితవాద అస్తిత్వ రాజకీయాలకు మాత్రమే పరిమితమైపోయింది. ఆదివాసీ ప్రముఖులను ప్రశంసించడం, వారిపేర్లను రైల్వే స్టేషన్లకు పెట్టడం సరేసరి. మరోవైపున అటవీభూములపై, అడవులపై వారి హక్కును కాలరాస్తున్నారు. వారి ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కులను హరిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే హిందుత్వ కార్పొరేట్ పరిపాలనా వ్యవస్థకు ఆదివాసీలే ప్రధాన బాధితులయ్యారు. వ్యాసకర్త: ప్రకాశ్ కారత్, సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి -
నాగేటి సాలల్లో దోసిళ్లకొద్దీ ‘చరిత్ర’
సాక్షి, హైదరాబాద్ : అది ఓ గ్రామ శివారు ప్రాంతం.. గుట్ట దిగువన పంట చేలలో ఎన్నో రాతిముక్కలు. రాళ్లు కనిపించడంలో వింతేముంది అనుకుంటున్నారా.. అవన్నీ ఓ వైపు మొనదేలి గొడ్డలిని పోలి ఉన్నాయి. కొత్త రాతియుగంలో వేట, చెట్లు నరికేందుకు మానవులు వినియోగించిన గొడ్డళ్లే ఇవి. అయితే ఒకే ప్రాంతంలో వందల సంఖ్యలో ఎందుకున్నాయన్నది ప్రశ్న. దట్టమైన అడవి, కావల్సినన్ని నీటి వనరులు, ఆవాసానికి యోగ్యమైన గుట్టలు.. ఆ ప్రాంతం ఆదిమానవులకు అనువుగా ఉండేది. దీంతో వేల ఏళ్లపాటు మనుగడ సాగించి వారికి అవసరమైన రాతి పనిముట్ల తయారు చేసుకున్నారనేది చరిత్రకారుల వాదన. అందుకే ఇక్కడ తయారై వినియోగించని రాతి గొడ్డళ్లు విస్తారంగా లభిస్తున్నాయి. ఇదంతా క్రీ.పూ.3 వేల ఏళ్ల క్రితం నాటి సంగతట!.. ఈ ప్రాంతంలో భూమి దున్నుతున్నప్పుడు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, గులాబీ, నలుపు... ఇలా ఎన్నో రంగుల్లో, రకరకాల ఆకృతుల్లో పూసలు దొరుకుతున్నాయి. వీటిలో కొన్ని మట్టితో తయారు కాగా, మరికొన్ని గాజుతో రూపొందినవి. ఇవి కుప్పపోస్తే దోసిళ్లకొద్దీ జమవుతున్నాయి. పూర్తిగా రూపొందినవి, అసంపూర్తిగా ఉన్నవి, పూసల తయారీకి అవసరమైన ముడి సామగ్రి... వీటిని గమనిస్తే ఈ ప్రాంతం పూసల తయారీకి కేంద్రమని తెలుస్తోంది. ఇందులో మట్టి పూసలు శాతవాహనుల కాలానికి సంబంధించి క్రీ.పూ. ఒకటో శతాబ్దానికి చెందినవి కాగా, గాజు పూసలు క్రీ.శ.ఒకటి శతాబ్ది తర్వాతవనేది చరిత్రకారుల మాట. విభిన్న కాలాల చరిత్ర... ఆ ప్రాంతంలో మందపాటి కాగు (కుండ కంటే పెద్దవి) పెంకులు, వాటిల్లో గాజు అంటిన గుర్తులు.. ఇవి గాజు బట్టీకి గుర్తులు. ఆ పక్కనే ముడి ఇనుము ముద్దలు. అవి ఇనుప బట్టీ ఆధారాలు. వెరసి గాజు, ఇనుప పరిశ్రమకు నెలవది. వెరసి.. 5 వేల పరిణామక్రమంలో మానవ మనుగడకు సజీవ సాక్షాలెన్నో. ఒకే ప్రాంతంలో ఇలా విభిన్న కాలాల చరిత్రను కళ్లకు కడుతున్న గ్రామమే సిద్దిపేట జిల్లాలోని కొండపాక. ఆదిమానవుల అడుగుజాడలు, శాతవాహనుల విజయగాధలు, కళ్యాణి చాళక్యుల నిర్మాణాలు, కాకతీయ రాజుల నాటి ఆలయాలు.... కొండపాక ఇప్పుడు చరిత్రకారులను ఆకర్షిస్తోంది. ప్రస్తుత మండల కేంద్రంగా ఉన్న ఈ గ్రామం చారిత్రక ప్రాధాన్యముందన్న సంగతిని చాలాకాలం క్రితమే చరిత్రకారులు గుర్తించారు. అడపాదడపా పరిశోధనలు చేసి ఆధారాలు సేకరించారు. కానీ ఎక్కువ పర్యాయాలు ఆలయాలు కేంద్రంగానే ఇవి సాగాయి. కానీ శివారు ప్రాంతం మల్లన్నగుట్ట వద్ద మానవ పరిణామ క్రమంపై ఇప్పుడు వెలుగుచూస్తున్న ఆధారాలు కొత్త కోణాన్ని పరిచయం చేస్తున్నాయి. గతంలో కొందరు పరిశోధకులు ఈ దిశగా కొన్ని ఆధారాలు సేకరించగా తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కొన్ని ఆధారాలు సేకరించి పరిశీలిస్తున్నారు. నాగేటి చాలు చెప్పే సంగతులెన్నో.... ఆదిమానవులు కూడా సమూహంగా జీవించారనేందుకు ఆధారాలు ఎన్నో ఉన్నాయి. కానీ, పనిముట్లను ఎవరికి వారుగా తయారు చేసుకుని వేట, వ్యవసాయం సాగించారు. అయితే, ఒకేచోట ఆయుధాలు తయారు చేసుకున్నట్లు చెప్పే ఆధారాలు చాలా తక్కువ. కానీ కొండపాక శివారు మల్లన్నగుట్ట కింద లభిస్తున్న రాతి పనిముట్లు... వేల యేళ్ల క్రితమే రాతి పనిముట్ల తయారీ కర్మాగారం నిర్వహించినట్లు తెలుస్తోందని ఆ బృందం సభ్యులు హరగోపాల్, వేముగంటి మురళి, అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం సాగులో ఉండటంతో దున్నినప్పుడల్లా ఈ రాళ్లు వెలుగుచూస్తున్నాయన్నారు. వీటిల్లో గొడ్డళ్లు ఎక్కువగా ఉన్నాయని, రెండువైపులా పదునున్నవి కూడా ఇక్కడ కనిపించినట్లు వెల్లడించారు. ఇక చేలలో ఎక్కడ చూసినా రంగు పూసలు, నాటి గాజు ముక్కలు, గాజు అంటి ఉన్న కుండపెంకులు, టెర్రకోట బొమ్మల ముక్కలు, శాతవాహనుల కాలం నాటి భారీ ఇటుకలు కుప్పలుతెప్పలుగా కనిపిస్తున్నాయి. గతంలో హుస్నాబాద్ సమీపంలోని గాజుల బస్వాపూర్, భువనగిరి సమీపంలోని బస్వాపూర్‌లో గాజుల బట్టీలు వెలుగుచూశాయి. ఇక్కడ తవ్వకాలు జరిపితే బట్టీ నిర్మాణ శిథిలాలు కూడా వెలుగుచూసే అవకాశం ఉంది. సమీపంలోని గుట్టపై భారీ రాళ్లతో రూపొందించిన గూడు సమాధుల (డోల్మెన్స్) ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి. ఇవి ఆదిమానవుల జాడకు సజీవ సాక్ష్యం. ఇక రాతి పనిముట్లు నూరేందుకు వినియోగించే గ్రూవ్స్ కూడా ఉన్నాయి. ఇక కాకతీయ సైనికులు (ఎక్కటీలు) నిర్మించిన త్రికూటాలయం, రుద్రేశ్వరాలయం, మల్లన్నగుట్టపై శిథిల దేవాలయాలు ఉన్నాయి. రుద్రదేవుడు, గణపతి దేవుడి కాలంలో వేయించిన శాసనాలు, కళ్యాణి చాళుక్యుల నాటి మరో శాసనం కూడా ఉంది. కానీ.. ఇప్పటి వరకు పురావస్తుశాఖ ఇక్కడ ఎలాంటి అధ్యయనం నిర్వహించలేదు. వ్యవసాయ పనులతో నాటి చారిత్రక ఆధారాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. భవిష్యత్‌లో అక్కడ ఈ మాత్రం ఆధారాలు కూడా లభించే అవకాశం లేదు. -
రాకాసి పట్టణం
సాక్షి, హైదరాబాద్: అదో పట్టణం.. విచిత్రమైన రాకాసి పట్టణం. అక్కడ మనకులాగే మనుషులు, ఇళ్లుంటాయని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఆ పట్టణంలో మనుషులు మచ్చుకు కూడా కనిపించరు. ఎటు చూసినా సమాధులే దర్శనమిస్తాయి. అవేవో ఈమధ్య కట్టినవి కావు. వీటి వయసు దాదాపు 3వేల ఏళ్లు. అంటే ఇనుపయుగం నాటివి. గుట్టపైకెక్కి తిరుగుతుంటే ఒక్కో రాయికి ఓ సమాధి కనిపిస్తుంది, అందుకే ఆ ప్రాంతానికి స్థానికులు పెట్టుకున్న పేరు.. ‘రాకాసి పట్టణం’. భద్రాచలం దట్టమైన అడవుల్లో ఈ ప్రాంతం ఉంది. జ్యోండిగో.. దక్షిణ కొరియాలో ప్రముఖ పర్యాటక ప్రాంతం. ఇక్కడి గుట్టల్లో వేల సంఖ్యలో ఆదిమానవుల సమాధులు కనిపిస్తాయి. భారీ బండరాళ్లు చుట్టూ పేర్చి.. వాటిపై దాదాపు 15 అడుగుల మందం ఉండే పెద్ద రాయిని మూతగా పెట్టి దాని కింద ఓ గది కట్టి అందులో మృతదేహాన్ని ఉంచేవారు. ఇది వేల ఏళ్లనాటి సమాధి చేసే విధానం. ఒకే ప్రాంతంలో వేల సంఖ్యలో ఇలాంటి సమాధులు ఉండటం ప్రపంచంలో మరెక్కడా లేవనేది ఇప్పటి వరకు ఉన్న మాట. అందుకే దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ సమాధులను చూసేందుకు నిత్యం కొన్ని వేల మంది పర్యాటకులు, పరిశోధకులు అక్కడికి వస్తుంటారు. గోదావరి తీరంలోని పూర్వపు వరంగల్–ఖమ్మం ప్రాంతం.. మల్లూరు, దామరవాయి, జానంపేట, పాండురంగాపురం.. ఇలాంటి గుట్టలతో నిండిన ప్రాంతాలెన్నో. ఈ గుట్టలపై ఆదిమానవుల కాలంనాటి గూడు సమాధులు వేలల్లో ఉన్నాయి. అలా విస్తరించిన ప్రాంతాల పరిధి ఏకంగా దాదాపు 200 కిలోమీటర్లకు పైబడే! ఆదిమానవుల గూడు సమాధులు (డోలమైన్స్, డోల్మనాయిడ్స్) ఇంత విశాలమైన ప్రాంతంలో విస్తరించి ఉండటం.. ప్రపంచంలో మరెక్కడా లేదన్న అభిప్రాయం ఉంది. కొరియాలో సమాధుల సంఖ్య ఎక్కువగా ఉన్నా, ఆ ప్రాంత విస్తీర్ణం తక్కువ. మనదగ్గర ఆ పరిధి విస్తీర్ణం ఎక్కువ. కానీ వీటికి యునెస్కో కాదు కదా, కనీసం రాష్ట్ర పురావస్తు శాఖ గుర్తింపు కూడా లేదు. ఇప్పుడు ఈ ప్రాంతంలో మరొక కొత్త గుట్ట వెలుగు చూసింది. ఇంతకాలం స్థానిక పశువుల కాపరులు తప్ప బయటి వ్యక్తులు వాటిని చూడలేదు. తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు వాటిని పరిశీలించారు. స్థానికులు రాకాసి పట్టణంగా పేర్కొనే ఈ ప్రాంతం పినపాక మండలంలోని బయ్యారం నుంచి పాండురంగాపురం వెళ్లేదారిలో దట్టమైన అడవిలో ఉంది. పైన కప్పు.. లోపల రాతి తొట్టి! లోహయుగంలో మానవులు చనిపోయిన తర్వాత ప్రత్యేక గౌరవాన్ని పొందేవారు. చనిపోయాక సమాధి చేయటం సాధారణ విషయమే. కానీ, ఆ సమాధిలో సంబంధీకులు ఇష్టపడే ఆహారం, ఆహార్య వస్తువులు ఉంచేవారు. ఆ ఆత్మ తిరిగి వస్తుందన్న నమ్మకంతోనే ఇలా చేసేవారు. పెద్దపెద్ద బండరాళ్లను చెక్కి చుట్టూ కొంతమేర పాతి దాదాపు పదడుగుల గుహను రూపొందించేవారు. దానిపై విశాలమైన పెద్ద బండరాయిని కప్పుగా ఏర్పాటు చేసేవారు. లోనికి వెళ్లేలా చతురస్రాకారంలో మార్గాన్ని ఏర్పాటు చేసేవారు. దాదాపు ఎనిమిదడుగుల రాతి తొట్టిని రూపొందించి మృతదేహాన్ని అందులో ఉంచి ఆ గుహకు పెద్ద రాయితో మూసేసేవారు. పక్కనే వారికి ఇష్టమైన ఆహారం, అలంకరణ వస్తువులను ఆ తొట్టే లో ఉంచేవారు. కొన్ని గుహల్లో రెండు, మూడు తొట్లు కూడా ఉండేవి. పూర్తిగా భూ ఉపరితలంపై ఇలాంటి సమాధులు కొన్ని ప్రాంతాల్లో కనిపించాయి. వాటిని డోలమైన్స్గా చరిత్రకారులు పేర్కొంటారు. కొంతమేర భూమిలోకి పాతినట్టు ఉండేవాటిని డోల్మనాయిడ్స్గా పేర్కొంటారు. ఇప్పుడు తాజాగా వెలుగుచూసిన ప్రాంతంలో వందల సంఖ్యలో డోల్మనాయిడ్స్ కనిపించాయి. స్థానిక పశువుల కాపరులు ఇచ్చిన సమాచారంతో కొత్త తెలంగాణ చరిత్ర బృందం, ఔత్సాహిక పరిశోధకులు కొండవీటి గోపి, నాగులపల్లి జగన్మోహన్రావు, సింహాద్రి నారాయణలు వాటిని పరిశీలించారు. స్థానిక అమరారం గ్రామం నుంచి పదిహేను కిలోమీటర్ల పాటు దట్టమైన అడవిలోకి వెళ్తే ఇలాంటి వందల సంఖ్యలో సమాధులున్న గుట్టలు కనిపిస్తున్నాయి. గతంలో భూపాలపల్లి జిల్లా దామరవాయి అడవిలో వెలుగుచూసిన సమాధులకు కాస్త భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. గోదావరి తీరంలో ఇలా సమాధులున్న ప్రాంతం మరింత విస్తారంగా ఉందని తాజాగా గుర్తించిన సమాధులు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకీ నిర్లక్ష్యం? ప్రపంచంలో ఇలా ఒకేచోట వేల సంఖ్యలో ఆదిమానవుల సమాధులు భద్రంగా ఉన్న ప్రాంతాలు చాలా అరుదు. తెలంగాణలోని గోదావరి తీరంలో 200 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రాంతాలు ఇప్పటి వరకు యునెస్కో దృష్టికి వెళ్లలేదు. వీటిని పరిరక్షించి యునెస్కో గుర్తింపునకు యత్నించాలన్న ఆలోచన కూడా మన ప్రభుత్వానికి రాలేదు. వెంటనే ఇలాంటి అరుదైన ప్రాంతాలను ప్రపంచ పర్యాటక పటంలో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ఇక్కడికి చేరువలో ఉన్న జానంపేటలో ఆంగ్లేయుల కాలంలోనే పరిశోధనలు జరిగాయి. ఇవి చాలా అద్భుత చారిత్రక సంపద అని నాటి పరిశోధకులు తేల్చారు. ఇలాంటి భారీ బండరాళ్లలో భూగర్భంలో సమాధి గూళ్లు రెండేళ్ల క్రితం కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) తవ్వకాలు జరిపి నాటి ఆదిమానవుల అవశేషాలు గుర్తించి డీఎన్ఏ పరీక్షలకు తరలించింది. భూపాలపల్లి జిల్లా దామరవాయి ప్రాంతానికి అమెరికాలోని శాండియాగో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ థామస్ ఈ లెవీ ఆధ్వర్యంలో బృందం వచ్చి ప్రాథమిక పరిశోధన జరిపి ప్రపంచంలోనే ఇవి అరుదైన ప్రాంతాలుగా గుర్తించింది. ప్రభు త్వం సహకరిస్తే ఈ మొత్తం ప్రాంతాన్ని లైడా ర్ సర్వే చేసి ఆధునిక పద్ధతిలో పరిశోధనలు చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు మన పర్యాటక శాఖ, పురావస్తు శాఖ ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. వీటిని యునెస్కో నుంచి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభిస్తే వాటి పరిరక్షణకు, పరిశోధనకు పెద్దమొత్తంలో నిధులు సమకూరుతాయి. ఇక వివిధ దేశాల నుంచి పర్యాటకులు వాటిని చూసేందుకు క్యూ కడతారు. తద్వారా ప్రభుత్వానికి ఆదాయంతోపాటు స్థానికుల ఉపాధికి అవకాశం కలుగుతుంది. -
ఆదివాసులకు అన్యాయం చేయొద్దు
ఆదివాసీల రిజర్వేషన్లలో 1976 నుంచి లంబాడీలను చేర్చినందువల్ల ఆదివాసులు చాలా నష్టపో యారు. ఇప్పటికైనా లంబాడీలను వేరు చేసి వారికి విడిగా రిజర్వేషన్లు కల్పించాలి. సమస్యను ఇరువర్గాలు మిత్రవైరుధ్యంగా గుర్తించి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఆదివాసులకు పది శాతం రిజర్వేషన్లు, ముస్లింలకు 12 శాతం రిజ ర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన బిల్లు కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే ఆమోదం పొందక తిరిగి వచ్చింది. ఆదివాసుల రిజర్వేషన్ పెంపు, ముస్లిం రిజర్వేషన్ పెంపు, వేరు వేరు బిల్లుల రూపంలో ఉండాలనే ఇంగిత జ్ఞానం కూడా పాటించకుండా ఆది వాసులపట్ల, ముస్లింలపట్ల ఎంతో ప్రేమ ఉన్నట్లు రూపొందించిన ఈ బిల్లు 1986లో ఎన్టీఆర్ బీసీలకు 25 శాతం నుంచి 40 శాతానికి పెంపు చేస్తూ రూపొందించిన బిల్లు వంటిదే. అది హైకోర్టు కొట్టి వేస్తే టీడీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా పోలేదు. ఆ తాను నుంచే వచ్చిన ముక్క అయిన కేసీఆర్, ఆయన స్థాపించిన టీఆర్ఎస్ ఇవ్వాళ ప్రపంచవ్యాప్తంగానూ, దేశంలోనూ సామ్రాజ్యవాద, బ్రాహ్మణీయ భూస్వామ్య భావజాలానికి, పాలనకు వ్యతిరేకంగా ముందు భాగాన నిలబడి పోరాడుతున్న మూల ఆదివాసులపై, ముస్లింలపై ప్రేమ చూపుతారంటే తోడేళ్లు, గొర్రెలకు మేలు చేయడం వంటిదే. ఆదివాసులకే పరిమితమై ఆలోచించినా ఒకవైపు రాజ్యాంగం లోని 5వ షెడ్యూల్ రూపొందించిన మార్గదర్శకాలను కూడా తుంగలో తొక్కి ఎస్టీ జాబితాలోకి లంబాడాలను చేర్చి మూల ఆది వాసీలకు, లంబాడాలకు మధ్యన చిచ్చు పెట్టి పీడిత వర్గాల ఘర్ష ణల్లో, విభేదాలు, వైమనస్యాలు, విద్వేషాల్లో రగుల్కొంటున్న మంటల్లో పేలాలేరుకుంటున్న ప్రభుత్వం.. మరొ కవైపు ఎస్టీ రిజర్వేషన్లను పది శాతానికి పెంచి బిల్లును శాసనం చేయగలదని, చేసినా మూల ఆదివాసులకు న్యాయం చేయగలదని ఆశించడం అత్యాశే అవుతుంది. ఇపుడున్న ఆరు శాతం రిజ ర్వేషన్లలోనూ నాలుగు శాతమే అమలవుతున్నది. ఈ నాలుగు శాతంలో నాలుగో వంతు కూడా మూల ఆదివాసులకు దక్కడం లేదు. కారణం 1976లో లంబాడాలను అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చిన దగ్గర్నించే గత నలభై రెండేళ్లలో మూల ఆదివాసుల జనాభాకు లంబాడాల జనాభా ఇరవై రెట్లకు పెరిగింది. లంబాడాల వలసలు వేగవంతంగా పెరగడమే ఇందుకు కారణం. 1961లో 81,366గా ఉన్న లంబాడా జనాభా 2011లో 20,99,524కు పెరిగింది. ఏజెన్సీలో మూల ఆదివాసుల జనాభా 2011లో 9 లక్షలుగా మైనారిటీకి పడిపోయింది. కనుక ఈ పరిస్థితిలో ఎస్టీ రిజర్వేషన్లు పదిశాతం అమలయినా మూల ఆదివాసులు పొందే ప్రయోజనమెంతో, పాలక వర్గాలు ఆడుతున్న ఓటు బ్యాంకు రాజ కీయాలు ఎంత దుర్బుద్ధితో కూడినవో ఎవరైనా న్యాయంగా ఆలోచిస్తే అర్థం అవుతుంది. రాజ్యాంగం ప్రకారం అడవిలో, ఏజెన్సీలో మూల ఆదివాసులకు మాత్రమే దక్కవలసిన జల్, జంగల్, జమీన్లపై అధి కారం గ్యారంటీ కావాలన్నా రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృ తిక, విద్యా, ఉద్యోగ, భూసంబంధ హక్కులు అమలు కావాలన్నా 1976లో చేసిన చట్ట సవరణను రద్దు చేయవలసిందే. రిజర్వేషన్ల అమలులో 1976ను కటాఫ్ డేట్‌గా గుర్తించి బ్యాక్లాగ్ పోస్టులను, భూమి పట్టాలను బ్యాక్లాగ్ పద్ధతిలో అమలు చేయాల్సిందే. ఎస్టీ వర్గీకరణ అంటే మూల ఆదివాసీ తెగల్లోనే గోండు, కోలాము, పరధాను, పరమేశు, నాయకపోడు, చెంచు వంటి ఆదివాసీ తెగల జనాభా ప్రాతిపదికపైననే కానీ మైదాన ప్రాంత సంచార జాతి అయిన లంబాడాలను కలిపి కాదు. 1976ను కటాఫ్ తేదీగా గుర్తించి వలస లంబాడాలను ఎస్టీ రిజర్వేషన్ల నుంచి తొలగించాలి. 1976 నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన లంబాడాలకు ఆయా రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు ఇక్కడ ఇవ్వాలి. అయితే అది రాజ్యాంగంలోని ఎస్సీ, ఎస్టీ గుర్తింపు కాజాలదు. కాయితా లంబాడాలు, వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో చేరజాలరు. అడవిలో మూల ఆదివాసుల నివాసం, తొలి రోజుల్లో ఆహారాన్వేషణ, వేట, కాలక్రమంలో పోడు వ్యవసాయం, ఏజెన్సీలో ఉనికి, ఎస్టీ గుర్తింపుకు ప్రాతిపదిక కావాలి. ఐదవ షెడ్యూల్డు ఏజెన్సీ (అటవీ) ప్రాంతాల్లో ఏజెన్సీ సర్టిఫికెట్లు మూల ఆదివాసులకు మాత్రమే ఇవ్వాలి. ఏజెన్సీ ప్రాంతంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వగైరా రాజకీయాధికారా లన్నీ మూల ఆదివాసు లకే పరిమితం కావాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో నూటికి నూరు శాతం ఉద్యోగాలు మూల ఆదివాసులకే ఇవ్వాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో రెసి డెన్షియల్ స్కూళ్లలో, కాలేజీలలో మూల ఆది వాసుల పిల్లలకే సీట్లు ఇవ్వాలి. జీసీసీలో మూల ఆదివాసులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి. ఆదివాసుల సంస్కృతిని అగౌరవ పరిచే చర్యలు చేపట్టవద్దు. సూకీ మాత, సేవాలాల్ చిత్రాలను ఆదివాసీ మ్యూజియంలో పెట్టడం సరిౖయెంది కాదు. మేడారం ట్రస్టులో ఆదివాసులు మాత్రమే ఉండాలి. జోడన్ఘాట్లో కొమురం భీం విగ్రహానికి చెప్పుల దండ వేయడం రాజ్య ప్రేరేపిత అవమానకర చర్య. ఆదివాసుల మనోభావాలను గాయపరిచే చర్య. ఏజెన్సీ ప్రాంత ఐడీడీఐలలో మూల ఆదివాసులకు మాత్రమే హక్కులుండాలి. లంబాడా ప్రజలకు ప్రత్యేకంగా మైదాన ప్రాంతాలలో రిజర్వేషన్లు కల్పించాలి. ఐటిడీ ఏలు నెలకొల్పాలి. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లపై హైకోర్టు న్యాయ మూర్తులతో ఒక కమిషన్ వేయాలి. ప్రభుత్వ రంగం రోజురోజుకూ కుంచించుకు పోతున్న నేపథ్యంలో రిజర్వేషన్లు పీడిత, పేద ప్రజల సమస్యలనన్నింటినీ పరిష్కరింప జాలవు. వాటివల్ల ఉపయోగం చాలా పరిమిత మైందనే ఎరుక ఉండాలి. మూల ఆదివాసులకు జల్ జంగల్ జమీన్లపై సర్వాధికారాలు దక్కాలంటే ఆదివాసీయేతరులైన పేదలు, పీడితులు ముఖ్యంగా లంబాడాలు మూల ఆదివాసులకు శత్రువులనీ, లంబాడాలకు దక్కవల సిన న్యాయం దక్కకూడదనీ అర్థం కాదు. పాలకవర్గాలు పెట్టిన కుట్ర తప్ప మూల ఆదివాసులకు, లంబాడాలకు మధ్యనున్నది మిత్ర వైరు ధ్యమే. దీనిని మిత్ర వైరుధ్యంగానే గుర్తించి మూల ఆదివాసులు, లంబాడాలు, ఆదివాసీయేతర పీడిత, పోరాట ప్రజానీకంతో కలిసి పరిష్కరించుకోవాలి. భూస్వాములు, దళారీ పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాద ఏజెంట్లే అసలైన శత్రువులు. వాళ్లే ఈ ఘర్షణలకు మూలం. ప్రభుత్వాలు వాళ్ల చేతుల్లో కీలుబొమ్మలు. మూల ఆదివా సులు, లంబాడాలు, పీడిత ప్రజలందరూ ఐక్యమై దోపిడీ పాలక వర్గా లకు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడటం ద్వారానే పేద ప్రజలం దరికీ న్యాయమైన భవిష్యత్తు సాధ్యమవుతుంది. మూల ఆదివాసులు జల్, జంగల్, జమీన్, స్వీయ గౌరవం కోసం పీడిత ప్రజలందరితో ఐక్యమై పోరాడాలి. స్వపరిపాలన కోసం పోరాడాలి. మిలిటెంటు పోరాటాల ద్వారా తప్ప ఎన్నికల రాజకీ యాల ద్వారా పేద, పీడిత ప్రజలకు లభించేది ఎండమావులే. అంతిమ సారాంశంలో పీడిత ప్రజలందరితోపాటు మూల ఆదివా సుల సమస్యలకు పరిష్కారం నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానే సాధ్యం. పోరాటానికి అది మార్గదర్శకం, లక్ష్యం కావాలి. (మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి యాపనారాయణ అలియాస్ హరిభూషణ్ అలియాస్ జగన్.. ఎన్కౌంటర్ ఘటన జరగటానికి ముందు రోజు ‘సాక్షి’కి పంపిన వ్యాసం) -
అరణ్య రోదన
-
ఆదివాసిల 'న్యూడ్' ఫొటో పోస్టు చేశారని!
సిడ్నీ: ఆదివాసి స్త్రీవాదం గురించి ఓ ఆర్టికల్‌ను ఫేస్బుక్లో షేర్ చేసిన నెటిజన్లకు చేదు అనుభవం ఎదురైంది. సంప్రదాయకరీతిలో ఛాతి మీద దుస్తులు లేని ఇద్దరు ఆదివాసి మహిళల ఫొటో ఈ ఆర్టికల్‌లో ఉండటంతో, దీనిని నగ్నచిత్రంగా భావిస్తూ ఫేస్బుక్ వారి ఖాతాలను సస్పెండ్ చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీవాద రచయిత్రి సెలెస్టీ లిడిల్ ఇటీవల ఆస్ట్రేలియాలోని క్వీన్ విక్టోరియా మహిళల కేంద్రంలో ఉపన్యసించారు. ఆదివాసి స్త్రీవాదం గురించి ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలతోపాటు.. ఇద్దరు ఆదివాసి మహిళ ఫొటోను కొందరు నెటిజన్లు ఫేస్బుక్లో షేర్ చేసుకున్నారు. ఈ పోస్టులో ఇద్దరు మహిళలున్న ఫొటో పెట్టారు. ఈ ఫొటోలో ఇద్దరు ఆదివాసి మహిళల తమ సంప్రదాయక దుస్తుల్లో శరీరంగా రంగులు వేసుకొని కనిపిస్తారు. అయితే, ఆ మహిళలు ఛాతిమీద ఎలాంటి దుస్తులు వేసుకోలేదన్న కారణంతో ఈ ఆర్టికల్‌ను షేర్ చేసుకున్న నెటిజన్లకు ఫేస్బుక్ షాకిచ్చింది. ఆదివాసి మహిళల స్త్రీవాద దృక్పథం, మూలవాసి హక్కుల గురించి తాను ప్రసంగించానని రచయిత్రి లిడిల్ పేర్కొన్నారు. గతంలోనూ ఈ విషయంలో ఫేస్బుక్ ఇదేతరహాలో వ్యవహరించిందని, సంప్రదాయక వేడుకలో బాడీపెయింట్ వేసుకున్న ఆదివాసి మహిళలను చూపించారన్న కారణంతో ఓ టీవీ షో ట్రైలర్‌ను కూడా ఫేస్బుక్ ఇలాగే తమ సైట్ నుంచి తొలగించిందని చెప్పారు. ఆదివాసి మహిళల ఆర్టికల్ షేర్ చేసుకున్నందుకు నెటిజన్ల ఖాతాలను ఫేస్బుక్ రద్దు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌ది మూర్ఖమైన నిర్ణయమని మండిపడుతున్నారు. -
ఆదివాసీలను ముంచడం సరికాదు
- పోడు భూములు లాక్కొనేందుకే హరితహారం - తుడుందెబ్బ నేత పోదెం బాబు - ములుగులో ర్యాలీ.. ఆర్డీ కార్యాలయ ముట్టడి ములుగు : ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం పేరు మీద తెలంగాణ నాయకులు ఆదివాసీలను ఆంధ్ర ప్రాంతానికి బలిస్తే.. నేడు తెలంగాణ ప్రభుత్వం కంతనపల్లి, మణుగూరు థర్మల్ ప్రాజెక్టు, కుంటాల హైడల్ ప్రాజెక్టు, ఇచ్చంపల్లి ప్రాజెక్టులతో ఆదివాసీలను ముంచడం సరికాదని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు పోదెం బాబు అన్నారు. ఈ మేరకు సమితి ఆధ్వర్యంలో సోమవారం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవిని నమ్ముకుని పోడు వ్యవసాయంతో జీవిస్తున్న ఆదివాసీల భూములను ప్రభుత్వం హరితహారం పేరుతో లాక్కొని మొక్కలు నాటేందు కు అణచివేత చర్యకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు తహసీల్దార్లు ఏజె న్సీ సర్టిఫికెట్లు జారీ చేయడం లేదని, ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.10 వేల వరకు లంచం తీసుకుంటున్నారని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆలం రవికుమార్ ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏటూరునాగారం మండలాన్ని స్వయం ప్రతిపత్తి గల ఆదివాసీ జిల్లా కేంద్రంగా ప్రకటించాలని తుడుందెబ్బ ములుగు డివిజన్ కమిటీ అధ్యక్షుడు ముద్దెబోయిన రవి డిమాండ్ చేశారు. ఆ తర్వా త తమ సమస్యలు పరిష్కరించాలని కార్యాలయ అధికారికి వినతిపత్రం అందించారు. సంఘం నేతలు తాటి హన్మంతరావు, ఆగబోయిన రవి, కోరగట్ల లక్ష్మణ్‌రావు, నాలి సారయ్య, పులిసె బాల క్రిష్ణ, జివ్వాజి రవి, వట్టం నాగరాజు, కొండ నాగరాజు పాల్గొన్నారు. -
భయం గుప్పెట్లో మన్యం
బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఆదివాసీలతో ఉద్యమానికి మావోయిస్టులు అడుగులు వేస్తుండగా, వారిని ఆదిలోనే అడ్డుకునేందుకు పోలీసులు బలగాలు మన్యాన్ని చుట్టుముట్టడంతో అంతటా భయానక వాతావరణం చోటుచేసుకుంది. ఏక్షణాన ఏమి జరుగుతుందోనని బిక్కుబిక్కు మంటూ గిరిపుత్రులు కాలం వెళ్లదీస్తున్నారు. కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ కునుకూరు-పోకలపాలెం మధ్య బుధవారం నాటి ఎదురు కాల్పుల ఘటన ఇందుకు నిదర్శనం. - కునుకూరులో ఎదురు కాల్పుల కలకలం - మన్యాన్ని చుట్టుముట్టిన పోలీసు బలగాలు - మావోయిస్టు అగ్రనేత చలపతిపై గురి కొయ్యూరు: మావోయిస్టుల కదలికలు పెరగడం.. మరోవైపు పోలీసుల కూంబింగ్ ఉధృతంతో మన్యం భయం గుప్పెట్లోకి వెళ్లింది. కొద్ది రోజులుగా బాక్సైట్‌కు వ్యతిరేకంగా మారుమూల గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యమానికి పిలుపునిస్తున్న మావోయిస్టు అగ్రనేత చలపతిపై పోలీసులు గురిపెట్టారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో కీలక నేతగా ఉన్న ఇతని కదలికలు మండలంలోని బూదరాళ్ల పంచాయతీలో కొనసాగుతున్నట్టుగా తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. బాక్సైట్ తవ్వకాలను అడ్డుకునేందుకు దళసభ్యులు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి ఉద్యమానికి పిలుపునిస్తున్నారు. ఇందులో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టాలని స్పష్టం చేస్తున్నారు. ఇది గమనించిన పోలీసులు ప్రజాప్రతినిధులకు కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఎలాంటి ఆందోళనలు చేపట్టరాదని చెబుతున్నారు. అటు మావోయిస్టుల మాట వినకుంటే ప్రాణా లు పోతాయన్న భ య ం ఒక వైపు...పోలీసులను కాదని వెళితే ఇబ్బందులు వస్తాయన్న ఆందోళన ప్రజాప్రతినిధులను వెంటాడుతోంది. టీడీపీ నేతలపై గురి ముఖ్యంగా టీడీపీ నేతలపై మావోయిస్టులు గురిపెట్టినట్టుగా తెలుస్తోంది. బాక్సైట్ విషయమై వారు నోరు మెదపక పోవడంతో పాటు గిరిజనుల పోరాటంలో పాల్గొనకపోవడాన్ని గమనించిన దళసభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల గిరిజనులతో సమావేశంలో ఇదే విషయాన్ని ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. వచ్చే నెల 3న టీడీపీ నేతల ఇళ్ల ఇద్ద ఆందోళనకు పిలుపునిచ్చారు. టీడీపీ నేతలు,కార్యకర్తలు ఆందోళనకు రాకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించినట్టు భోగట్టా. ఈ నేపథ్యంలో మండలంలోని కునుకూరు వద్ద బుధవారం ఎదురు కాల్పుల ఘటనతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. నలువైపుల నుంచి కూంబిం గ్ను ఉధృతం చేశారు. దీంతో ఏ క్షణాన ఏమి జరుగుతుందోనన్న భయాందోళనలు గిరిజనుల్లో వ్యక్తమవుతోంది. కునుకూరులో భయాందోళనలు ఎదురు కాల్పులతో కునుకూరు గ్రామస్తులు భయంతో వణికిపోతున్నార. ఈ సంఘటనలో ఎవరికీ ఏమీ కాకున్నా..మున్ముందు ఎవరి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోని ఆందోళన చెందుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. 2007లో ఈ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని కన్నవరంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. నాటి నుంచి ఈ ప్రాంతంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. -
మానని గాయం ఇంద్రవెల్లి మారణహోమం
సందర్భం చరిత్ర పుటల్లో చేరిన మా నని ఆదివాసుల గాయం ఇంద్రవెల్లి. ఈ దేశ మూల వాసులపై నాగరిక సమా జం అమలు చేస్తున్న వివ క్షకు, అణచివేతకు అది పర్యాయపదం. ఆదిలాబా ద్ జిల్లా ఇంద్రవెల్లిలో 1981, ఏప్రిల్ 20న జరి గిన మారణహోమం జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ను తలపించిన ఊచకోత. గోండ్వానా పరిధిలోని ఆదిలాబాద్ ప్రాంతంలో బ్రిటిష్ వలస పాలకులపై రాంజీగోండ్ తిరుగుబాటు (1858-60), ‘మా ఊళ్లో మా రాజ్యం’ అంటూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కొమురం భీం సాయుధ తిరుగుబాటు (1938-40) అనంతరం ఆంత్రో పాలజిస్టు ప్రొ॥హైమండార్ఫ్ అధ్యయన ఫలితాలు అమలుకు నోచు కోకుండానే జరిగిన ఇంద్రవెల్లి దుర్ఘటన ఆనాటి మానవతావాదుల్ని కలచివేసింది. ఆదిలాబాద్‌లో కోలాం, పర్ఫాన్, తోటి, కో య, నాయక్ పోడ్ గిరిజనులు నివసిస్తున్నారు. ఇది మహారాష్ట్రకు సరిహద్దు కావడంతో మార్వాడీలు, లంబాడీలతో పాటు కోస్తా నుంచి వలస వాదులు ప్రవేశించారు. ఆదివాసీలకు చెం దిన భూఆక్రమణలు, అటవీ వనరుల దోపిడీ, వర్తకవ్యాపారుల మోసాలు పెరి గాయి. వీటిని నిరసించడానికి ‘గిరిజన రైతు కూలీ సంఘం’ 1981, ఏప్రిల్ 20న ప్రథమ మహాసభను ఇంద్రవెల్లిలో నిర్వ హించడానికి సన్నాహం చేసింది. తమ పోడు భూములపై హక్కులు, పండిన పం టలకు గిట్టుబాటు ధర కల్పించాలని, సం తలో అటవీ ఉత్పత్తుల కొనుగోలులో సేట్లు చేసే తూనికల మోసాన్ని అరికట్టా లనే డిమాండ్లతో గిరిజన గూడేలలో తుడుం మోగిం చారు. ఇంద్రవెల్లిలో ఆ రోజు సోమవారం అంగడి కావడంవల్ల అధిక సంఖ్యలో గిరిజనులు హాజరవు తారని భావించిన పోలీసులు ఒకరోజు ముందే 144వ సెక్షన్ విధించారు. పరిసర ప్రాంతాల్లో సభకు వ్యతిరేక ప్రచారం చేశారు. ఇదంతా తెలియని ఆదివాసులు ఉదయం 7 గంటల నుంచి భారీ సంఖ్యలో ఇంద్రవెల్లికి చేరుకు న్నారు. ఆయా మార్గాలలో కొందరిని లాఠీలతో కొట్టడం, బాష్పవాయువు ప్రయోగించడం వంటివి చేశారు. సభ ప్రారంభానికి ముందే హెచ్చరికలు లే కుండా పోలీసులు హఠాత్తుగా కాల్పులు జరిపారు. ఈ అమానుష ఘటనలో 13 మంది ఆదివాసీలు మరణించగా, 9 మం ది గాయపడ్డట్లు నాటి కాంగ్రెస్ ప్రభు త్వం ప్రకటించింది. కాని వాస్తవంగా కాల్పుల్లో 60 మంది మరణించగా, మరో 80 దాకా తీవ్రంగా గాయపడినట్లు పత్రి కలు వెల్లడించాయి. ఈ దుర్ఘటనలో క్షత గాత్రులైన వారిలో బతికి ఉన్న ఇద్దరు మాత్రం కాలా నికి ఎదురీదుతున్నారు. ఆదిలాబాద్ అడవి బిడ్డలపై ఇంద్రవెల్లి రేపిన గాయానికి 34 ఏళ్లు. అల్లూరి ‘మన్యం పోరాటం’ (1922-24), కొమురంభీం ‘జోడేఘాట్ తిరుగు బాటు’ (1938-40), ‘శ్రీకాకుళ రైతాంగ పోరాటం’ (1968-70), తొలి ‘తెలంగాణ ఉద్యమం’ (1969), జగిత్యాల కార్మికుల ‘జైత్రయాత్ర’ (1978) ఉద్య మాలు ఇంద్రవెల్లికి వారసత్వంగా నిలిచాయి. ఇంద్రవెల్లి ఘటన జరిగిన 34 ఏళ్ల తరువాత కూడా ఈ దేశంలో మూలవాసులు పౌరసమాజం లో అంతర్భాగం కాలేకపోతున్నారు. నాడు ఇంద్ర వెల్లి, నిర్మల్, జోడేఘాట్‌తో ఆదివాసుల జీవన సం స్కృతిపై దాడి జరిగితే, వాకపల్లి, భల్లూగూడ వంటి గ్రామాల్లో ఆత్మగౌరవ దాడులు జరగడం అమా నుషం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1/70 చట్టం, ఫీసా చట్టాలను తుంగలో తొక్కుతూ ఆదివాసీ జీవన విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. నల్లమలలో చెంచు లను, కవ్వాల్‌లో గోండులను, బయ్యారం, కంతన పల్లిలో కోయలను ప్రకృతి ఒడి నుంచి నిర్వాసితు లను చేసే యత్నాలు సాగుతున్నాయి. ఆదివాసుల అభివృద్ధికి అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్లు ఇతర కులాలకు పంచుతూ పాలకులు రాజ్యాంగ విరు ద్ధంగా వ్యవహరిస్తున్నారు. అందుకు ఆదివాసులు తమ రక్షణకు ‘మనుగడ కోసం పోరాటం’ చేసే దుస్థితి నుంచి తప్పించి ‘జల్-జంగల్-జమీన్’పై పూర్తి స్వేచ్ఛాధికారాలు కల్పిస్తే తెలంగాణ అమరుల త్యాగాలకు మనం అర్పించే ఘన నివాళి అవుతుంది. (ఇంద్రవెల్లి కాల్పులకు ఏప్రిల్ 20 నాటికి 34 ఏళ్లు) (వ్యాసకర్త మొబైల్: 9951430476) గుమ్మడి లక్ష్మీనారాయణ -
‘ఆదిమ’ గుహలను మింగిన క్వారీలు
కోకాపేట గుహల్లో అద్భుత వర్ణ చిత్రాలు మూడున్నర వేల ఏళ్ల క్రితం నాటి ఆధారాలు 35 ఏళ్ల క్రితమే గుర్తించిన నాటి పురావస్తు డెరైక్టర్ కృష్ణశాస్త్రి ఆ తర్వాత పట్టించుకోని ప్రభుత్వాలు క్వారీలతో ధ్వంసమైన గుట్టలు, కనుమరుగైన చిత్రాలు మూడొంతులు పోగా మిగిలినవి కొన్నే హైదరాబాద్ శివారులోనే మసకబారుతున్న ఆదిమ చరిత్ర సాక్షి, హైదరాబాద్: మానవ పరిణామక్రమాన్ని తెలుసుకునేందుకు ఆదిమ కాలం నాటి ఆధారాలే కీలకం. అందుకే అలాంటి ఆనవాళ్లున్న ప్రదేశాలను ప్రభుత్వాలు పదిలంగా కాపాడుతుంటాయి. అవి పరిశోధకులకు, పర్యాటకులకు కేంద్రంగా నిలుస్తాయి. అప్పటి గుహలు, సమాధుల్లో లభించే ఆధారాలే నేటి తరానికి గొప్ప వారసత్వ సంపద. హైదరాబాద్ శివారులోనే ఉన్న అలాంటి ప్రాం తం క్రమంగా కాలగర్భంలో కలి సిపోతోంది. అది నిర్దాక్షిణ్యంగా క్వా రీల పాలైంది. అక్కడి అతి అరుదైన, పురాతన సాక్ష్యాలన్నీ ధ్వంసమయ్యాయి. దాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. దీంతో దాదాపు 3500 సంవత్సరాల క్రితం నాటి ఆదిమ మానవులు గీసిన ‘చిత్ర’ విన్యాసాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ధ్వంసమైందిలా... క్రమంగా నగరం విస్తరించడంతో గండి పేట చుట్టూ నివాసాలు వెలిశాయి. ఈ క్రమంలో ఆదిమానవుల చిత్రాలున్న గుట్టలు క్వారీలకు బలయ్యాయి. అయితే ఆదిమానవుల చిత్రాలున్న ఓ గుహను స్థానికులు పురాతన ఆలయంగా భావించేవారు. దాన్ని కూల్చితే అరిష్టం జరుగుతుందని భావించి ఆ ఒక్క దాన్ని మాత్రం వదిలి మిగతా గుట్టను పూర్తిగా ధ్వంసంచేశారు. కానీ పేలుళ్ల ధాటికి గుహలోని చిత్రాలు చాలావరకు దెబ్బతిన్నాయి. గుహ పైకప్పు పొర దెబ్బతిని అక్కడి చిత్రాలు పూర్తిగా పోయాయి. క్వారీ దుమ్ము, వ ర్షం నీటితో కొన్ని చిత్రాలు పూర్తిగా మసకబారిపోయాయి. ఎద్దుల సమూహం.. ఆ మొత్తాన్ని నియంత్రిస్తున్న ఓ వ్యక్తి.. అతని ముందు చేప ఆకారంతోపాటు మరోచోట కొందరు వ్యక్తులు నృత్యం చేస్తున్నట్టు ఉన్న చిత్రాలు మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్థల యజమానులతో చర్చించి కోకాపేట గుహలను రక్షిత ప్రాంతంగా గుర్తించాలి. మిగిలిన చిత్రాలనైనా పదిలపరచాలి. కూతవేటు దూరంలోనే.. నగర దాహార్తిని తీర్చే గండిపేట చెరువుకు కూతవేటు దూరంలో కోకాపేట శివారులోని గుట్టపై పురాతన గుహలు ఉన్నాయి. వాటిలో ఆదిమ మానవుల కాలం నాటి చిత్రాలున్నాయి. అయితే ఈ స్థలం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉండటంతో దాన్ని క్వారీలుగా మార్చేశారు. అక్కడి గుట్టలను పేల్చేశారు. దీంతో ఇక్కడి 2 గుహల్లో ఇప్పటికే ఒకటి పూర్తిగా ధ్వంసమైంది. చుట్టూ గుట్టను తొలిచేసి మరో గుహను మాత్రం మిగిల్చారు. 130 అడుగుల ఎత్తులో ఉన్న ఆ గుహను చేరుకోవడం కూడా ఇప్పుడు కష్టంగా మారింది. ప్రస్తుతం రాష్ర్టవ్యాప్తంగా ఇలాంటి గుహలు 16 మాత్రమే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో చారిత్రక ప్రాంతాలను ప్రజలకు చేరువ చేసిన వేలూరి వెంకట కృష్ణశాస్త్రి ఈ కోకాపేట గుహలను కూడా 1980లోనే అధికారికంగా గుర్తించారు. అప్పట్లో ఆయన ఆంధ్రప్రదేశ్ పురావస్తు విభాగం సంచాలకులుగా ఉన్నారు. వృద్ధాప్యంతో ఆయన పరిశోధనలకు దూరం కావడంతో ఈ గుహల సంగతి మరుగునపడింది. ఆ తర్వాత ప్రభుత్వాలకు అసలు అక్కడ గుహలున్న సంగతే తెలియలేదు. ‘ప్రోటో హిస్టారికల్ కల్చర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పుస్తకంలో కృష్ణశాస్త్రి ఈ గుహల వివరాలను పదిలపరిచారు. కంటికి రెప్పలా కాపాడాలి ‘ఆదిమానవులు చిత్రించిన రాతి చిత్రాలు అత్యంత విలువైనవి, అంతకుమించి అరుదైనవి. భావి తరాలకు వాటి గొప్పతనం తెలియాలంటే వాటిని కంటికి రెప్పలా కాపాడాలి. అవి ధ్వంసమైతే మళ్లీ దొరకవు. హైదరాబాద్‌లాంటి నగరానికి అలాంటి గుహలు అతి చేరువలో ఉండటం ఓ రకంగా అదృష్టమే. త్వరలో దాన్ని పరిశీలిస్తాను’ - డాక్టర్ ఎన్ చంద్రమౌళి, రాక్ ఆర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి -
టూకీగా ప్రపంచ చరిత్ర 42
నేరం ఆ దశలో, అనుకూలించిన ప్రతిచోటా, ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి మానవులంతా ఎక్కడికక్కడ స్థిరనివాసాలకు పనపడిపోయారని తీర్మానించుకోవడం పొరపాటౌతుంది; ఎందుకంటే, సమాజంలో ఏ పరిణామమైనా రెప్పపాటులో జరిగే మాయాజాలంగా ఉండబోదు. క్రీస్తుపూర్వం నాలుగువేల సంవత్సరాల ముందుదాకా స్థిరనివాసాల జనసంఖ్య ప్రపంచ జనాభాలో కేవలం మూడింట ఒకవంతు మాత్రమేనని తెలుసుకుంటే ఆ పరివర్తన ఎంత నింపాదిగా, ఎంత పలుచగా మొదలయిందో మనం సులభంగా ఊహించుకోవచ్చు. ఆ కారణంగానే ఈ నేలమీద ఎదుగుదలకు నోచుకోకుండా పాతరాతియుగం దశలో ఆగిపోయిన తెగలు అక్కడక్కడ ఇంకా మిగిలున్నాయి. ఆస్ట్రేలియాలోని ఆదిమవాసులకు (ఆబొరిజినల్స్కు) విల్లనమ్ములు ఎలా ఉంటాయో ఇప్పటికీ తెలీదు. మానవ సమాజం పురిటినొప్పులు పడుతున్న అదే సమయంలో భూమి ఉపరితలం పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది. మంచు కరిగినకొద్దీ సముద్రాల్లో నీటిమట్టం ఎగదన్ని, భూమి బలహీనంగా ఉన్న తావుల్లో కోతలు పెడుతూ నేలను ముక్కలు ముక్కలుగా చీల్చేయడం మొదలెట్టింది. చీలిన ముక్కల్లో కొన్ని మునిగిపోగా, కొన్ని మాత్రం దీవులుగా నిలదొక్కుకుంటున్నాయి. అమెరిగా ఖండాన్ని ఆసియాతో కలిపుంచిన వంతెన నీటిలో మునిగి, చిరునామా లేకుండా కరిగిపోయింది. ఆసియాఖండానికి ఆగ్నేయంలో కలిసుండిన ఆస్ట్రేలియా, న్యూజిల్యాండులు దాన్నుండి చీలిపోయి దూరంగా జరిగిపోతున్నాయి. ఇంగ్లండు, ఐర్లండులు యూరప్ నుండి తెగిపోయి ద్వీపాలుగా ఏర్పడ్డాయి. దక్షిణ భారతదేశం నుండి శ్రీలకం తెగిపోయింది. ఇలా ప్రతి భూఖండం నుండి వందలాది ముక్కలు విడిపోయి దీవులుగా ఏర్పడుతున్నాయి. ఆ తరువాత, ఆఫ్రికా యూరప్‌లను చీలుస్తూ, మధ్యధరా ప్రాంతంలో అట్లాంటిక్ మహాసముద్రం చొరబడి, అదివరకు అక్కడున్న సరస్సులు రెండింటినీ సముద్రంగా మార్చేసింది. ఆ కోత అంతటితో ఆగకుండా ఇంకా తూర్పుకు విస్తరించి, మధ్యధరా సముద్రాన్ని నల్లసముద్రంతో కలిపేయడంతో ఆసియా ఖండానికి యూరప్‌తో ఉండిన భూమార్గం సంపూర్ణంగా తెగిపోయింది. ఈ దూకుడును ఓర్చుకున్న భూమి, ఎనిమిది తొమ్మిది వేల సంవత్సరాలప్పుడు క్రమంగా ఇప్పుడున్న స్వరూపానికి స్థిరపడింది. జ్ఞాపకశక్తి మొలకెత్తిన బుర్రల్లో ఆనాటి భూగోళంలో ఏర్పడిన అతలాకుతలం, చెప్పుకునేందుకు అర్హమైన మొట్టమొదటి చారిత్రిక సంఘటనగా నమోదైంది. బైబిల్లో చెప్పిన ‘నోవా అండ్ ది ఆర్క్’ వృత్తాంతంలో, జలప్రళయం సృష్టించి భూమిమీదున్న సకల జీవరాసులనూ తుడిచిపెట్టాలని దేవుడు సంకల్పించాడు. కానీ, నిజాయితీపరుడైన నోవామీద ఆయనకు జాలి కలిగింది. పెద్ద నౌకను తయారుజేసుకుని ప్రళయం నుండి బయటపడేందుకు సిద్ధం కమ్మని నోవాను దేవుడు ఆదేశిస్తాడు. ఆ నౌకను తిండిగింజలూ తదితర ఆహారపదార్థాలతో నింపుకుని, తానూ తన కుటుంబం యావత్తు అందులో చేరుకోమంటాడు. ప్రతి జంతువు నుండి ఒక పోతు ఒక పెంటి, ప్రతి పక్షి నుండి ఒక పుంజు ఒక పెట్ట ఉండేట్టుగా నౌకలోకి తీసుకోమంటాడు. నలభై రాత్రులూ నలభై పగళ్ళూ వర్షం ఏకధారగా కురిసి, సముద్రాలన్నీ ఏకమై భూమిని ముంచెత్తడంతో జీవరాసులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. నౌకకు చేరిన నోవా కుటుంబం, జంతువులూ, పక్షులూ మాత్రమే మిగిలి, సంతానోత్పత్తితో తరువాతి ప్రపంచాన్ని నింపేస్తాయి. (పౌరాణిక గ్రంథాల్లో అన్నిటికంటే ముందుదిగా చరిత్రకారులు భావిస్తున్న ‘గిల్గమేశ్’లో, ఇదే ఇతివృత్తం, కేవలం పాత్రల పేర్ల మార్పిడితో లిఖితమైవుండడం గమనార్హం) రచన: ఎం.వి.రమణారెడ్డి -
ప్రసంగాలకే పరిమితం
ఉట్నూర్/ఇంద్రవెల్లి : ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా సన్నిధిలో నిర్వహించిన దర్బార్ ప్రజాప్రతినిధుల ప్రసంగాలకే పరిమితమైంది. గురువారం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో కలెక్టర్ జగన్‌మెహన్ అధ్యక్షతన నిర్వహించిన నాగోబా దర్బార్‌కు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. కాగా.. సభా వేదికపై ఆదివాసీ నాయకులను ఆహ్వానించకపోవడంతో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కొమురం భీమ్ వారసుడు కొమురం సోనేరావ్ను వేదికపైకి ఆహ్వానించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి జోగు రామన్న సోనేరావ్ను సభాపైకి ఆహ్వానించకపోవడంలో తప్పు జరిగిందని, తప్పుకు క్షమిం చాలని ప్రకటించారు. పలువురు ఆదివాసీ నాయకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు న మోదై తిరుగుతున్నామని విన్నవించడంతో హోంమంత్రితో మాట్లాడుతామన్నారు. కాగా.. సిర్పూర్(టి) ఎ మ్మెల్యే కోనేరు కోనప్ప సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ గేడం నగేష్, ఎమ్మెల్సీ రాములునాయక్, ప్రభు త్వ విప్ నల్లాల ఓదెలు, ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపూరావు, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సోయం బాపూరావ్, ఆత్రం సక్కు, ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఎస్ఎస్రాజు, కేస్లాపూర్ సర్పంచ్ నాగ్నాథ్, జెడ్పీటీసీ సంగీత, అలయ కమిటీ చైర్మన్ తుకారాంతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి అనంతరం మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఇక్కడి సమస్యలను వివరించడానికి జిల్లాలోని గిరిజన సంఘాల నాయకులను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తానని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా జోడేఘాట్‌కు రాలేదని, గిరిజనుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృతనిచ్చయంతో ఉన్నారని స్పష్టం చేశారు. జోడేఘాట్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.18 కోట్లు విడుదల చేసిందన్నారు. జిల్లా నుంచి ఏర్పడే మరో జిల్లాకు కొమురం భీమ్ పేరు పెట్టడం ఖాయమన్నారు. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు కొమురం భీమ్ ఎక్స్‌ప్రెస్‌గా ప్రభుత్వం పేరు మార్చుతుందన్నారు. ప్రతి గూడెంకు, తండాకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామన్నారు. అభివృద్ధి పనులకు అటవీ శాఖ అనుమతులు వచ్చేలా కృషి చేస్తానన్నారు. ఐటీడీఏకు పూర్తిస్థాయి పీవోను నియమించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది నాటికి నాగోబా సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో జిల్లాను కేసీఆర్ మరో కశ్మీర్‌లా తీర్చిదిద్దుతారని వివరించారు. అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.. జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా సన్నిధిని ప్రభుత్వం తరఫున అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్ర రాజధానిలో స్వైన్‌ఫ్లూ వ్యాపించడంతో చివరి నిమిషంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన రద్దయ్యిందని, ప్రభుత్వం తరఫున జిల్లా మంత్రులుగా తాము వచ్చామన్నారు.ఆదివాసీలు విన్నవించిన ప్రతి సమస్యనూ సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. దర్బార్‌లో వచ్చే ప్రతి అర్జీని విభాగాల వారీగా వేరు చేసి పరిష్కరిస్తామన్నారు. ముత్నూర్ నుంచి ఆలయం వరకు డబుల్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. ఆలయం ప్రాంగణంలో విశ్రాంతి గృహాల నిర్మాణం, ఆలయ భూముల రక్షణ, చుట్టూ ప్రహరీ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. రూ.రెండు కోట్లతో నాగోబా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని మెస్రం వంశీయులు కోరుతున్నారని, వచ్చే ఏడాది నాటికి నిధులు మంజూ రు చేసి పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉట్నూర్ సీహెచ్‌సీని ఆధునికీకరించి ఏజెన్సీలో వ్యాధులు, జ్వరాలు ప్రబలకుండా ముంద స్తు చర్యలు తీసుకుంటామన్నారు. ఇంద్రవెల్లి : నాగోబా సన్నిధిలో గురువారం మం త్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే లు రే ఖానాయక్, కోనేరు కోనప్ప, రాథోడ్ బాపూరావ్, నల్లాల ఓదెలు, ఎమ్మెల్సీ రాములునాయక్, డీసీసీబి చైర్మన్ దామోదర్‌రెడ్డితో పాటు కలెక్టర్ జగన్మోహన్ తదితర ప్రముఖులు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మెస్రం వంశీయులు వారికి ఆ దివాసీ సంప్రదాయం ప్రకారం తలపాగా కట్టి, గు స్సాడీ బృందం నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం వారిని సన్మానించారు. ఈ సందర్భం గా భీమ్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట ఎస్పీ తరుణ్‌జోషి, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం తుకారాం, సర్పంచ్ నాగ్నాథ్, గ్రామ పటేల్ వెంకట్రావ్ తదితరులు ఉన్నారు. సంపూర్ణ అభివృద్ధికి పాటుపడుదాం.. ఆదివాసీల సంపూర్ణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలి. గిరిజన ప్రాంతాల్లో విద్య, రోడ్ల అభివృద్ధితోపాటు ఆరోగ్యంపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. రానున్న రోజుల్లో జంగుబాయి, పద్మల్పురిగుడిరేవు, జోడేఘాట్, నాగోబా, మార్లవాయి ప్రాంతాలను ప్రభుత్వం అన్నిరకాల అభివృద్ధి చేస్తుంది. వచ్చే బడ్జెట్లో కేస్లాపూర్లో కొత్త కాలనీల నిర్మాణానికి కృషి చేస్తాం. - గేడం నగేష్, ఎంపీ అభివృద్ధే ద్యేయం.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికే కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్య లు తీసుకుంటోంది. 67 ఏళ్ల సమైక్య పాలనలో లేని నాగోబా ఆలయ అభివృద్ధి వచ్చే రెండు మూడేళ్లలో జరుగుతుంది. మె స్రం వంశీయుల విన్నపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వం ముందుకు సాగుతోంది. - రాథోడ్ బాపూరావ్,ఎమ్మెల్యే, బోథ్ స్వయం అభివృద్ధి సాధించేలా.. ఆదివాసీలు అన్ని రంగాల్లో స్వయం అభివృద్ధి సాధిం చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. జల్ జంగల్ జమీన్ నినాదంతో హక్కుల కోసం పోరాడిన ఘనత ఆదివాసీలదే. కేసీఆర్ ఆదివాసీల కోసం రానున్న రోజుల్లో అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేయనున్నారు. ఆధునిక వ్యవసాయంపై గిరిజనులకు ఆసక్తి పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గిరిజనుల కోసం కల్యాణ లక్ష్మీ పథకం ప్రారంభించిన ఘనత కేసీఆర్‌దే. - నల్లాల ఓదెలు, ప్రభుత్వ విప్ ప్రమాదమైన వాటిని రద్దు చేయాలి.. ఆదివాసీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న టైగర్‌జోన్‌ను వెంటనే రద్దు చేయాలి. కుంటాల ప్రాజెక్టు ఆదివాసీ దేవుళ్లకు పవి త్రమైన ప్రదేశం. అక్కడ హైడల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయా లి. ఎన్నికల హామీలో భాగంగా గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి. గిరిజన విద్యాభివృద్ధికి చర్యలు ఉండాలి. - సోయం బాపూరావ్, బోథ్ మాజీ ఎమ్మెల్యే వచ్చే సంవత్సరం నాటికి సమస్యలు పరిష్కారం.. నాగోబా ఆలయం తన అసెంబ్లీ పరిధిలో ఉండడం నా అదృష్టం. నాగోబా ఆలయ సన్నిధిలో ఉన్న సమస్యలన్నీ వచ్చే జాతర నాటికి పరిష్కరించేలా కృషి చేస్తా. ఆలయం వరకు రోడ్ల నిర్మాణం, శాశ్వత స్టాల్స్ ఏర్పాటు చేస్తాం. ఏజెన్సీలో అటవీ శాఖ అనుమతులు లేక రోడ్లు అభివృద్ధి చెందడం లేదు. వాట న్నింటిపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించేలా కృషి చేస్తా. - అజ్మీరా రేఖ, ఖానాపూర్ ఎమ్మెల్యే వారి పాలనలో అన్యాయం.. సమైక్య రాష్ట్రంలో ఆదివాసీలకు తీరని అన్యాయం జరిగింది. గిరిజనాభివృద్ధే ధ్యేయంగా ప్రస్తుత ప్రభుత్వం దూసుకెళ్తోంది. వచ్చే ఆరు నెలల్లో ప్రతి నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోనుంది. - రాములు నాయక్, ఎమ్మెల్సీ వారిని ఆహ్వానించకపోవడం బాధాకరం.. నాగోబా దర్బార్‌ను ప్రభుత్వ కార్యక్రమంగా ఎన్నడూ లేని విధంగా ఘనంగా నిర్వహించడం ఆనందమే అయినా.. సభా వేదికపైకి ఆదివాసీల నాయకులను ఆహ్వానించకపోవడం బాధాకరం. జిల్లాలో ఆదివాసీ గిరిజనులకు ప్రభుత్వం వివిధ రకాలుగా ఇచ్చిన భూములు పదిహేను ఎకరాలకు పైగా ఉండడంతో వారికి ఆహారభద్రత కార్డులు ఇవ్వడం లేదు. గిరిజనుల్లో 55 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలి. - ఆత్రం సక్కు, మాజీ ఎమ్మెల్యే నాగోబా సమస్యలు పరిష్కరించాలి.. నాగోబా అలయంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఆల య ప్రాంగణంలో డార్మెంటరీల నిర్మాణంతోపాటు శాశ్వత విశ్రాంతి భవనాలు నిర్మించాలి. ఆలయం చుట్టు పక్కల ఉన్న అసైన్డ్ భూములను గుర్తించి అలయానికి కేటాయిస్తూ చుట్టూ ప్రహరీ నిర్మించాలి. మహిళల కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. - నాగ్నాథ్, కేస్లాపూర్ సర్పంచ్, తుకారాం నాగోబా ఆలయ కమిటీ చెర్మన్ -
మన్యసీమకు ప్రత్యేక మండలి : చందా లింగయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక మండలి ఏర్పాటు చేసి రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని మన్యసీమ రాష్ట్ర సాధన సమితి కన్వీనర్ చందా లింగయ్య కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, మన్యసీమకు స్వయం పరిపాలన కోసం డిమాండ్ చేశారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వనరులు పుష్కలంగా ఉన్న దృష్ట్యా గిరిజన ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్‌ను నిర్మించాలని కోరారు. ఆదివాసీ డిమాండ్లపై జీవోఎంను కలిసి వినతిపత్రాన్ని అందచేసినట్టు చెప్పారు. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు గిరిజన, ఆదివాసీ ప్రాంతాలను కలిపి మన్యసీమ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోకపోవడం ఆదివాసీ వ్యతిరేక చర్యలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మన్యసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిన అవసరంపై శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులను కూడా పట్టించుకోలేదన్నారు. ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.