ఆదివాసిల 'న్యూడ్' ఫొటో పోస్టు చేశారని!
సిడ్నీ: ఆదివాసి స్త్రీవాదం గురించి ఓ ఆర్టికల్‌ను ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన నెటిజన్లకు చేదు అనుభవం ఎదురైంది. సంప్రదాయకరీతిలో ఛాతి మీద దుస్తులు లేని ఇద్దరు ఆదివాసి మహిళల ఫొటో ఈ ఆర్టికల్‌లో ఉండటంతో, దీనిని నగ్నచిత్రంగా భావిస్తూ ఫేస్‌బుక్ వారి ఖాతాలను సస్పెండ్ చేసింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీవాద రచయిత్రి సెలెస్టీ లిడిల్ ఇటీవల ఆస్ట్రేలియాలోని క్వీన్ విక్టోరియా మహిళల కేంద్రంలో ఉపన్యసించారు. ఆదివాసి స్త్రీవాదం గురించి ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలతోపాటు.. ఇద్దరు ఆదివాసి మహిళ ఫొటోను కొందరు నెటిజన్లు ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకున్నారు. ఈ పోస్టులో ఇద్దరు మహిళలున్న ఫొటో పెట్టారు. ఈ ఫొటోలో ఇద్దరు ఆదివాసి మహిళల తమ సంప్రదాయక దుస్తుల్లో శరీరంగా రంగులు వేసుకొని కనిపిస్తారు. అయితే, ఆ మహిళలు ఛాతిమీద ఎలాంటి దుస్తులు వేసుకోలేదన్న కారణంతో ఈ ఆర్టికల్‌ను షేర్ చేసుకున్న నెటిజన్లకు ఫేస్‌బుక్ షాకిచ్చింది.
ఆదివాసి మహిళల స్త్రీవాద దృక్పథం, మూలవాసి హక్కుల గురించి తాను ప్రసంగించానని రచయిత్రి లిడిల్ పేర్కొన్నారు. గతంలోనూ ఈ విషయంలో ఫేస్‌బుక్ ఇదేతరహాలో వ్యవహరించిందని, సంప్రదాయక వేడుకలో బాడీపెయింట్ వేసుకున్న ఆదివాసి మహిళలను చూపించారన్న కారణంతో ఓ టీవీ షో ట్రైలర్‌ను కూడా ఫేస్‌బుక్ ఇలాగే తమ సైట్ నుంచి తొలగించిందని చెప్పారు. ఆదివాసి మహిళల ఆర్టికల్ షేర్ చేసుకున్నందుకు నెటిజన్ల ఖాతాలను ఫేస్‌బుక్ రద్దు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌ది మూర్ఖమైన నిర్ణయమని మండిపడుతున్నారు.