ఆస్ట్రేలియాకు మైక్రోసాఫ్ట్‌ మద్దతు..గూగుల్‌ వైదొలిగేనా? | Microsoft Support Australia Proposal on Technology and The News | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాకు మైక్రోసాఫ్ట్‌ మద్దతు..గూగుల్‌ వైదొలిగేనా?

Published Mon, Feb 22 2021 6:56 PM | Last Updated on Mon, Feb 22 2021 10:37 PM

Microsoft Support Australia Proposal on Technology and The News - Sakshi

వార్తా సంస్థలకు సంబంధించి ఆస్ట్రేలియా తీసుకొచ్చిన కొత్త చట్టం కారణంగా ఆస్ట్రేలియా-గూగుల్ మధ్య నెలకొన్న వివాదం మరో కీలక మలుపు తిరిగింది. ఆస్ట్రేలియా రూపొందించిన ఈ చట్టాన్ని సమర్థిస్తున్నామంటూ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ ఫేసుబుక్, గూగుల్‌కు ఊహించని షాకిచ్చారు. ఫేస్‌బుక్, గూగుల్ వ్యతిరేకిస్తున్న చట్టానికి మద్దతు తెలుపుతూ మైక్రోసాఫ్ట్ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం ఆసక్తి కలిగిస్తోంది. మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ ఒక లేఖలో వార్తల కంటెంట్ కోసం డబ్బులు చెల్లిస్తే స్వతంత్ర జర్నలిజానికి అవకాశం కల్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు.

మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజన్ బింగ్‌ తమ ప్రత్యర్థి గూగుల్ మాదిరిగా కాకుండా "కొత్త చట్టానికి సైన్ అప్" చేయడానికి సిద్ధంగా ఉందని, ఆస్ట్రేలియన్ మార్కెట్లో తమ వాటా పెరిగితే వార్తా ప్లాట్‌ఫారమ్‌లతో ఆదాయాన్ని పంచుకుంటుందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా దేశంలో 5 శాతం కన్నా తక్కువ మార్కెట్ వాటాను బింగ్ కలిగి ఉంది. దాదాపు ఒక నెల క్రితం గూగుల్ ఆస్ట్రేలియా మేనేజింగ్ డైరెక్టర్ మెల్ సిల్వా ఈ చట్టం పనికిరానిదని, ఇది అమలు చేయబడితే ఆస్ట్రేలియాలో తమ సెర్చ్ ఇంజిన్ సేవలు నిలిపివేస్తామని ఆస్ట్రేలియన్ సెనేట్‌కు తెలిపింది. 

వార్తల లింకులను తన సెర్చ్ ఫలితాల్లో చూపించడం ద్వారా గూగుల్, ఫేస్‌బుక్‌లు వినియోగదారులను ఆకర్షిస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం వాదిస్తోంది. ఈ కారణంగానే.. వాటి ఆదాయంలో కొంత మొత్తాన్ని  మీడియా సంస్థలతో పంచుకోవాలని స్పష్టం చేస్తోంది. అలాగే ఫేస్‌బుక్ ఆస్ట్రేలియన్ ప్రజలకు అంతర్జాతీయ వార్తలను చూడటం నిలిపివేసింది. ఆస్ట్రేలియా సెర్చ్ ఇంజిన్ మార్కెట్లో గూగుల్ వాటా ఏకంగా 93 శాతం. దీంతో..ఆస్ట్రేలియా నుంచి గూగుల్ వైదొలగితే ఏం జరుగుతుందనే అంశం పెద్ద చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజన్ బింగ్ ప్రస్తావన తెరపైకి వచ్చింది. ఈ విషయంపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లతో కలిసి ఆస్ట్రేలియా ప్రధాని మాట్లాడినట్లు స్మిత్ తెలిపారు.

చదవండి:

మిర్చీ బజ్జీ..  ఆన్‌లైన్‌లో తెప్పించుకోవచ్చు!

గోల్డ్ లోన్ తీసుకునేవారికి ఎస్‌బీఐ బంపర్ ఆఫర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement