నాగేటి సాలల్లో దోసిళ్లకొద్దీ ‘చరిత్ర’ | The Remains Of The Aborigines Are Found In Siddipet District | Sakshi
Sakshi News home page

నాగేటి సాలల్లో దోసిళ్లకొద్దీ ‘చరిత్ర’

Published Sun, Jul 28 2019 1:28 AM | Last Updated on Sun, Jul 28 2019 9:16 AM

The Remains Of The Aborigines Are Found In Siddipet District - Sakshi

సిద్దిపేట జిల్లా కొండపాకలోని చేలల్లో దొరికిన పూసలు

సాక్షి, హైదరాబాద్‌ : అది ఓ గ్రామ శివారు ప్రాంతం.. గుట్ట దిగువన పంట చేలలో ఎన్నో రాతిముక్కలు. రాళ్లు కనిపించడంలో వింతేముంది అనుకుంటున్నారా.. అవన్నీ ఓ వైపు మొనదేలి గొడ్డలిని పోలి ఉన్నాయి. కొత్త రాతియుగంలో వేట, చెట్లు నరికేందుకు మానవులు వినియోగించిన గొడ్డళ్లే ఇవి. అయితే ఒకే ప్రాంతంలో వందల సంఖ్యలో ఎందుకున్నాయన్నది ప్రశ్న. దట్టమైన అడవి, కావల్సినన్ని నీటి వనరులు, ఆవాసానికి యోగ్యమైన గుట్టలు.. ఆ ప్రాంతం ఆదిమానవులకు అనువుగా ఉండేది. దీంతో వేల ఏళ్లపాటు మనుగడ సాగించి వారికి అవసరమైన రాతి పనిముట్ల తయారు చేసుకున్నారనేది చరిత్రకారుల వాదన. అందుకే ఇక్కడ తయారై వినియోగించని రాతి గొడ్డళ్లు విస్తారంగా లభిస్తున్నాయి.

ఇదంతా క్రీ.పూ.3 వేల ఏళ్ల క్రితం నాటి సంగతట!.. ఈ ప్రాంతంలో భూమి దున్నుతున్నప్పుడు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, గులాబీ, నలుపు... ఇలా ఎన్నో రంగుల్లో, రకరకాల ఆకృతుల్లో పూసలు దొరుకుతున్నాయి. వీటిలో కొన్ని మట్టితో తయారు కాగా, మరికొన్ని గాజుతో రూపొందినవి. ఇవి కుప్పపోస్తే దోసిళ్లకొద్దీ జమవుతున్నాయి. పూర్తిగా రూపొందినవి, అసంపూర్తిగా ఉన్నవి, పూసల తయారీకి అవసరమైన ముడి సామగ్రి... వీటిని గమనిస్తే ఈ ప్రాంతం పూసల తయారీకి కేంద్రమని తెలుస్తోంది. ఇందులో మట్టి పూసలు శాతవాహనుల కాలానికి సంబంధించి క్రీ.పూ. ఒకటో శతాబ్దానికి చెందినవి కాగా, గాజు పూసలు క్రీ.శ.ఒకటి శతాబ్ది తర్వాతవనేది చరిత్రకారుల మాట.  

విభిన్న కాలాల చరిత్ర... 
ఆ ప్రాంతంలో మందపాటి కాగు (కుండ కంటే పెద్దవి) పెంకులు, వాటిల్లో గాజు అంటిన గుర్తులు.. ఇవి గాజు బట్టీకి గుర్తులు. ఆ పక్కనే ముడి ఇనుము ముద్దలు. అవి ఇనుప బట్టీ ఆధారాలు. వెరసి గాజు, ఇనుప పరిశ్రమకు నెలవది. వెరసి.. 5 వేల పరిణామక్రమంలో మానవ మనుగడకు సజీవ సాక్షాలెన్నో. ఒకే ప్రాంతంలో ఇలా విభిన్న కాలాల చరిత్రను కళ్లకు కడుతున్న గ్రామమే సిద్దిపేట జిల్లాలోని కొండపాక. ఆదిమానవుల అడుగుజాడలు, శాతవాహనుల విజయగాధలు, కళ్యాణి చాళక్యుల నిర్మాణాలు, కాకతీయ రాజుల నాటి ఆలయాలు.... కొండపాక ఇప్పుడు చరిత్రకారులను ఆకర్షిస్తోంది. ప్రస్తుత మండల కేంద్రంగా ఉన్న ఈ గ్రామం చారిత్రక ప్రాధాన్యముందన్న సంగతిని చాలాకాలం క్రితమే చరిత్రకారులు గుర్తించారు. అడపాదడపా పరిశోధనలు చేసి ఆధారాలు సేకరించారు. కానీ ఎక్కువ పర్యాయాలు ఆలయాలు కేంద్రంగానే ఇవి సాగాయి. కానీ శివారు ప్రాంతం మల్లన్నగుట్ట వద్ద మానవ పరిణామ క్రమంపై ఇప్పుడు వెలుగుచూస్తున్న ఆధారాలు కొత్త కోణాన్ని పరిచయం చేస్తున్నాయి. గతంలో కొందరు పరిశోధకులు ఈ దిశగా కొన్ని ఆధారాలు సేకరించగా తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కొన్ని ఆధారాలు సేకరించి పరిశీలిస్తున్నారు.  

నాగేటి చాలు చెప్పే సంగతులెన్నో.... 
ఆదిమానవులు కూడా సమూహంగా జీవించారనేందుకు ఆధారాలు ఎన్నో ఉన్నాయి. కానీ, పనిముట్లను ఎవరికి వారుగా తయారు చేసుకుని వేట, వ్యవసాయం సాగించారు. అయితే, ఒకేచోట ఆయుధాలు తయారు చేసుకున్నట్లు చెప్పే ఆధారాలు చాలా తక్కువ. కానీ కొండపాక శివారు మల్లన్నగుట్ట కింద లభిస్తున్న రాతి పనిముట్లు... వేల యేళ్ల క్రితమే రాతి పనిముట్ల తయారీ కర్మాగారం నిర్వహించినట్లు తెలుస్తోందని ఆ బృందం సభ్యులు హరగోపాల్, వేముగంటి మురళి, అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం సాగులో ఉండటంతో దున్నినప్పుడల్లా ఈ రాళ్లు వెలుగుచూస్తున్నాయన్నారు. వీటిల్లో గొడ్డళ్లు ఎక్కువగా ఉన్నాయని, రెండువైపులా పదునున్నవి కూడా ఇక్కడ కనిపించినట్లు వెల్లడించారు. ఇక చేలలో ఎక్కడ చూసినా రంగు పూసలు, నాటి గాజు ముక్కలు, గాజు అంటి ఉన్న కుండపెంకులు, టెర్రకోట బొమ్మల ముక్కలు, శాతవాహనుల కాలం నాటి భారీ ఇటుకలు కుప్పలుతెప్పలుగా కనిపిస్తున్నాయి. గతంలో హుస్నాబాద్‌ సమీపంలోని గాజుల బస్వాపూర్, భువనగిరి సమీపంలోని బస్వాపూర్‌లో గాజుల బట్టీలు వెలుగుచూశాయి.

ఇక్కడ తవ్వకాలు జరిపితే బట్టీ నిర్మాణ శిథిలాలు కూడా వెలుగుచూసే అవకాశం ఉంది. సమీపంలోని గుట్టపై భారీ రాళ్లతో రూపొందించిన గూడు సమాధుల (డోల్మెన్స్‌) ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి. ఇవి ఆదిమానవుల జాడకు సజీవ సాక్ష్యం. ఇక రాతి పనిముట్లు నూరేందుకు వినియోగించే గ్రూవ్స్‌ కూడా ఉన్నాయి. ఇక కాకతీయ సైనికులు (ఎక్కటీలు) నిర్మించిన త్రికూటాలయం, రుద్రేశ్వరాలయం, మల్లన్నగుట్టపై శిథిల దేవాలయాలు ఉన్నాయి. రుద్రదేవుడు, గణపతి దేవుడి కాలంలో వేయించిన శాసనాలు, కళ్యాణి చాళుక్యుల నాటి మరో శాసనం కూడా ఉంది. కానీ.. ఇప్పటి వరకు పురావస్తుశాఖ ఇక్కడ ఎలాంటి అధ్యయనం నిర్వహించలేదు. వ్యవసాయ పనులతో నాటి చారిత్రక ఆధారాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. భవిష్యత్‌లో అక్కడ ఈ మాత్రం ఆధారాలు కూడా లభించే అవకాశం లేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

సీసం అంటుకుని ఉన్న మట్టి పాత్ర పెంకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement