నాబార్డు నిధులతో నాటకం
సాక్షి, హైదరాబాద్: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవెలప్‌మెంట్ (నాబార్డు) రుణాలు దుర్వినియోగమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఈ నిధులతో చేపట్టిన పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవటం అనుమానాలకు బలం చేకూర్చింది. ఈ నిధులు పక్కదారి పట్టాయని గుర్తించిన ప్రభుత్వం విచారణకు ఆదేశాలిచ్చింది. నాబార్డు రుణాలు సద్వినియోగమయ్యాయా.. లేదా.. జిల్లాల వారీగా వీటిని ఏయే పనులకు ఖర్చు చేశారు.. వాటి పురోగతి ఎలా ఉంది. క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టాలని నిర్ణయించింది.
రైతుల రుణమాఫీలో అక్రమాలు జరిగాయని, రూ.వెయ్యి కోట్లు పక్కదారి పట్టినట్లు ఆడిట్ పరిశీలన, ఆర్థిక శాఖ విచారణలో వెలుగులోకి వచ్చింది. అదే తరహాలో నాబార్డు రుణాల పరిశీలనతో తేనెతుట్టె కదులుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో నాబార్డు నుంచి సాధారణ పనులకు రూ.వె య్యి కోట్లు, గిడ్డంగుల నిర్మాణానికి రూ. వె య్యి కోట్లు ప్రభుత్వం రుణంగా స్వీకరించింది.
ఉమ్మడి రాష్ట్రంలో నాబార్డు నుంచి తీసుకున్న నిధులను సరిగా వినియోగించలేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అందుకు ఈ నిధుల వినియోగంపై విచారణ చేపట్టాలని సీఎం ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దీంతో నాబార్డు, ఆర్థిక శాఖ అధికారులు విచారణకు రంగం సిద్ధం చేశారు. ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటించి వాస్తవాలు వెలికి తీయాలని నిశ్చయించారు. మంగళవారం ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.రామకృష్ణారావు, నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ హరీష్ జావా బృందం ఇక్కడ పర్యటించనుంది.