ప్రజలను జాగృతపరిచేవి కళలే
- ఉమ్మడి రాష్ట్రంలో కళాకారులకు అన్యాయం
- డిప్యూటీ సీఎం రాజయ్య
- రవీంద్రభారతిలో అక్కినేని మీడియా అవార్డ్స్ ప్రదానం
- సాక్షి మీడియా ప్రతినిధులకు రెండు అవార్డులు
సాక్షి, సిటీబ్యూరో: కళలు ఎప్పుడో ఒకప్పుడు ప్రజలను జాగృతం చేస్తుంటాయని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య అన్నారు. బుధవారం రవీంద్రభారతిలో శృతిలయ ఆర్ట్స్ అకాడమి, షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివంగత సినీ దిగ్గజం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 91వ జయంతి సందర్భంగా అక్కినేని మీడియా అవార్డ్స్‌ను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కళాకారులు వివక్షతకు గురయ్యారన్నారు. అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి మాట్లాడుతూ మీడియా అవార్డ్సు ప్రదానం మంచిని ప్రభావితం చేసే కార్యక్రమమన్నారు.
అనంతరం శృతిలయ, షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కినేని మీడియా అవార్డులను సాక్షి టీవీకి చెందిన బి.కల్పనకు, సాక్షి ఫిలిమ్ రిపోర్టర్ ఎస్.నాగేశ్వరరావు, ఎక్స్‌ప్రెస్ టీవీ నుంచి భవన, ఈటీవీ2 నుంచి సతీష్‌తోపాటు పలువురికి అందజేశారు. ఈ సందర్భంగా వారిని శాలువతో సన్మానించి, జ్ఞాపికతోపాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సమాచార హక్కు కమిషనర్ పి.విజయబాబు, శృతిలయ నిర్వాహకులు ఆర్‌ఎన్ సింగ్, ఆమని, దళిత సేవా అధ్యక్షులు జేబీ రాజు తదితరులు పాల్గొన్నారు.