ఏప్రిల్‌లో సాధారణ బదిలీలు?
కొద్ది రోజులు నిషేధం సడలించే యోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై కొద్దిరోజుల పాటు నిషేధం ఎత్తివేయాలని ప్రభుత్వం యోచి స్తోంది. ఉమ్మడి రాష్ట్రం నుంచే ఉద్యోగుల బది లీలపై నిషేధం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతా ఈ నిషేధం అమల్లో ఉంది. దీంతో వివిధ శాఖలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు వివిధ కారణాలతో తమను బదిలీ చేయాలని కోరుతూ సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. వ్యక్తిగత అభ్యర్థనలతో నిత్యం మంత్రులు, ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మంత్రులపై ఒత్తిడి రోజురోజుకు పెరిగిపోతోంది.
మరోవైపు సాధారణ బదిలీలలకు అవకాశం కల్పించాలని ఇప్పటికే పలుమార్లు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. కనీసం వేర్వేరు ప్రాంతాల్లో పని చేస్తున్న భార్యాభర్తల బదిలీలకు వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. దీంతో కొద్ది రోజులు నిషేధం సడలించి కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలి స్తోంది. అందుకే ముఖ్యమంత్రి తుది నిర్ణయం మేరకు ఏప్రిల్‌లో బదిలీల కౌన్సెలింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశముందని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
గత ఏడాది సైతం ఏప్రిల్‌లో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రతిపాదనను ప్రభుత్వం చివరి నిమిషంలో తోసిపుచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య విభజన ప్రక్రియ పూర్తి కాకపోవటం, అన్ని శాఖల మధ్య ఉద్యోగుల కేటాయింపు కసరత్తు జరుగుతుండటంతో బదిలీలపై వెనక్కి తగ్గింది. రెండ్రోజుల కిందట టీఎన్‌జీవో నేతలు దేవీప్రసాద్, కారెం రవీందర్‌రెడ్డి, హమీద్ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి మరోమారు బదిలీలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, గృహ నిర్మాణ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించకుండా ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి ఉద్యోగుల బదిలీలతో పాటు హెల్త్‌కార్డుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చినట్లు తెలిసింది.