మద్యం సరఫరాకు బ్రేక్
- ‘విభజన’ నేపథ్యంలో..
- జిల్లాలో మూతపడిన లిక్కర్ బేవరేజెస్
- జూన్ 7 వరకు అదే పరిస్థితి
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అధికారులు
- జిల్లాలో అదనంగా 50 వేల కేసుల విక్రయం
- వైన్, బార్ షాపుల వద్ద నిల్వలు ఫుల్
సాక్షి, విజయవాడ : జిల్లాలో మద్యం సరఫరా నిలిచిపోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లిక్కర్ బేవరేజెస్‌ను విభజించి ఆదాయ వ్యయాలు, అప్పులు, ఇతర లెక్కలు చూసుకోవటానికి బేవరేజెస్‌కు సెలవులు ప్రకటించారు. దీంతో ఎక్సైజ్ శాఖ, బేవరేజ్ అధికారులు జిల్లాలో మద్యం కొరత తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దీంతో వైన్‌షాపులు, బార్‌లకు నెలవారీగా లెసైన్స్ స్థాయిని బట్టి కేటాయించే దానికంటే అదనంగా కేటాయింపులు జరిపారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో చివరి నెలలో జిల్లాలో మద్యం విక్రయాలు భారీగా జరిగినట్లయింది.
మూడు నెలలుగా వ్యాపారాలూ అంతంతే..
జిల్లాలో 294 వైన్‌షాపులు, 155 బార్‌లు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు జిల్లాలో మూడు లక్షల కేసుల మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. దీంతో జిల్లాలో నెలకు సుమారు రూ.105 కోట్ల మద్యం అమ్మకాలు సాగుతుంటాయి. గడిచిన మూడు నెలలుగా జిల్లాలో మద్యం విక్రయాలు బాగానే జరిగాయి కానీ వ్యాపారాలు ఆశించిన రీతిలో జరగలేదు. ఎన్నికల కోడ్, వరుస ఎన్నికల నేపథ్యంలో పోలీసు, ఎక్సైజ్ అధికారుల తనిఖీలు, దాడులు ముమ్మరంగా సాగాయి. ఈ క్రమంలో వ్యాపారులు భారీగా నిల్వలు చేసుకోకపోవటంతో ఆశించిన మేరకు వ్యాపారం జరగలేదు.
సెలవులతో మరింత ఇబ్బంది...
ఈ క్రమంలో ప్రస్తుతం వేసవికాలం కావటంతో మద్యం విక్రయాలు బాగుంటాయని ఆశించిన వ్యాపారులకు బేవరేజెస్ సెలవులు కొంత ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల మద్యం కంపెనీల నుంచి వచ్చే మద్యానికి ఏపీ బేవరేజెస్ స్టిక్కర్ల ద్వారా విక్రయాలు జరిపేవారు. జూన్ 2న అపాయింటెడ్ డే కావటంతో రెండు రాష్ట్రాలు ఏర్పడనున్నాయి.
దీంతో రాష్ట్ర విభజనకు ముందే బేవరేజస్‌ను రెండు రాష్ట్రాలకు సమ పద్ధతిలో కేటాయించాలని ఎక్సైజ్‌శాఖ నిర్ణయించింది. దీంతో ఈ నెల 27 నుంచి జూన్ 7 వరకు ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో విభజన ప్రకియ పూర్తయ్యే వరకు బేవరేజస్ మూసివేయాలని నిర్ణయించి నిల్వలు ఉన్న మద్యాన్ని పూర్తిస్థాయిలో విక్రయించారు. పదిరోజుల పాటు మద్యం సరఫరా ఉండకపోవటంతో అనివార్యంగా కొరత ఏర్పడనుంది.
రోజుకి జిల్లాలో సగటున పదివేల కేసుల విక్రయాలు జరగుతుంటాయి. నెలాఖరు కావటం, లెసైన్స్ కాలపరిమితి ముగియనుండటంతో వైన్‌షాపుల్లో దాదాపు 30 శాతం కంటే తక్కువగానే నిల్వలు ఉన్నాయి. ఈక్రమంలో పదిరోజుల విక్రయాలుకు గాను జిల్లాలో లక్ష కేసుల మద్యం అవసరం ఉంది. కాని కొరత నేపథ్యంలో 10 రోజులకు అదనంగా 50 వేల కేసులను మాత్రమే బేవరేజెస్ అధికారులు మంజూరు చేసి వ్యాపారులకు విక్రయించారు.
వ్యాపారుల వద్ద ఉన్న నిల్వలు, కేటాయింపులు పదిరోజులకు పూర్తిస్థాయిలో సరిపోయే అవకాశం ఉంది. జిల్లాలోని విజయవాడ, గుడివాడ ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలో రెండు బేవరేజ్‌లు ఉన్నాయి. వీటిద్వారా జిల్లాలోని వైన్‌షాపులకు, బార్‌లకు మద్యం సరఫరా జరుగుతుంది. జిల్లాలో షాపులకు అదనపు నిల్వలు కేటాయించామని ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ గోళ్ల జోసఫ్ తెలిపారు. జిల్లాలో పదిరోజులు మద్యం సరఫరా జరిగే అవకాశం లేకపోవటంతో ముందస్తు ఏర్పాట్లు చేశామని చెప్పారు.