ఫ్యాక్షన్ గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతం
Published Fri, Aug 9 2013 2:20 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, నరసరావుపేట : జిల్లాలో ఎన్నికలు వాయిదా పడిన 12 పంచాయతీల్లో గురువారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నరసరావుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో 11, గుంటూరు డివిజన్‌లో ఒక పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. పల్నాట ప్రాంతంలోని ఫ్యాక్షన్ గ్రామాల్లో సైతం పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో అధికారులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పల్నాడులోని మొత్తం 11 పంచాయతీల్లో 25,002 ఓటర్లకు 20,786 ఓట్లు పోలయి సగటు పోలింగ్ 83.14 శాతంగా నమోదైంది.
ఉదయం 9 గంటలకు 36.6 శాతం,11 గంటలకు 74.5 శాతం నమోదైంది. రొంపిచర్ల మండలం ముత్తనపల్లిలో అత్యధికంగా 96.22శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా నరసరావుపేట మండలం పెదరెడ్డిపాలెంలో 32.16 శాతం నమోదైంది. గత నెల 31న జరిగిన ఎన్నికల్లో ఐదు పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులను కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఎత్తుకెళ్లి బావిలో పడవేసిన విషయం విదితమే. దీంతో ఈ ఐదు వార్డులకు ఎన్నికలు వాయిదా వేసిన జిల్లా కలెక్టర్ గురువారం తిరిగి ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన కాంగ్రెస్‌పార్టీ మద్దతుదారులు ఓటింగ్‌లో పాల్గొనలేదు.
కేవలం టీడీపీ మద్దతుదారులు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొనడంతో ఆ గ్రామ పంచాయతీ టీడీపీకి దక్కింది. ఫ్యాక్షన్ గ్రామాలుగా ముద్ర పడిన రొంపిచర్లలో 91.16 శాతం, నాదెండ్ల మండలం తూబాడులో 92.5 శాతం, వెల్దుర్తి మండలం కండ్లకుంటలో 90.3 శాతం, శిరిగిరిపాడులో 85 శాతం పోలింగ్ నమోదైంది. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో చిన్నపాటి సంఘటన కూడా లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
వైఎస్సార్ సీపీ హవా.: పల్నాడులో ఎన్నికలు జరిగిన 11 పంచాయతీల్లో రొంపిచర్ల, ఇక్కుర్రు, తూబాడు, కండ్లకుంట, ఊడిజెర్ల, గోగులపాడులలో వైఎస్సార్ సీపీ బలపరచిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. పెదరెడ్డిపాలెం,శిరిగిరిపాడు గ్రామాల్లో తెలుగుదేశం బలపరచిన అభ్యర్థులు, అందుగులపాడు,ముత్తనపల్లిలలో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులు గెలుపొందారు. సారంగపల్లి అగ్రహారంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. గుంటూరు డివిజన్‌లోని గుంటూరు రూరల్ మండలం చల్లావారిపాలెంలో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు.
Advertisement