12 నుంచి ఆర్టీసీ బస్సులన్నీ బంద్ రైళ్లు.. కిటకిట.. | The RTC Andhra Union has decided to boycott | Sakshi
Sakshi News home page

12 నుంచి ఆర్టీసీ బస్సులన్నీ బంద్ రైళ్లు.. కిటకిట..

Published Sat, Aug 10 2013 4:06 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

The RTC Andhra Union has decided to boycott

సాక్షి, గుంటూరు : గడచిన వారం రోజుల నుంచి రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. దూరప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ టికెట్లు అయిపోయాయి. నెల రోజుల వరకూ ప్రధాన రైళ్లలో బెర్తులు దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రయాణికులు గత్యంతరం లేని స్థితిలో తత్కాల్ టికెట్లపై ఆధారపడుతున్నారు. వారంరోజుల నుంచి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. అన్ని ప్రధాన పట్టణాల్లోనూ ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు జరుగుతున్నాయి. 
 
 ఈ కారణంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలు తగ్గాయి. మూడు జిల్లాల్లోనూ నాలుగైదు రోజులపాటు బస్సులు డిపోల నుంచి బయటకురాలేదు. ఈ క్రమంలో వివిధ రకాల పనుల మీద దూరప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీనికితోడు ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ఇదే జరిగితే గుంటూరు నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, రాజమండ్రి, అమలాపురం, పుట్టపర్తి, శ్రీశైలం వంటి దూరప్రాంతాలకు బస్సులు నడిచే ప్రసక్తే లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైలు ప్రయాణాల వైపు మొగ్గుతున్నారు, ఒకవేళ రాస్తారోకోలు జరిగినా రైలు ప్రయాణం సురక్షితంగా ఉంటుందన్న అభిప్రాయంతో ఎక్కువమంది ఉద్యోగులు, వ్యాపారులు ముందస్తుగా రైలు టికెట్లను రిజర్వ్ చేసుకుంటున్నారు. 
 
 వారంరోజుల నుంచి రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన రైళ్లలోనూ బెర్తులు నిండిపోయాయి. గుంటూరు మీదగా నడిచే నారాయణాద్రి, విశాఖ, చెన్నై, కొచ్చిన్, ఫలక్‌నుమా, జన్మభూమి, నర్సాపూర్, ప్రశాంతి, వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌లకు రిజర్వేషన్ టికెట్లు దొరకడం కష్టమైంది. స్లీపర్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు ఫస్ట్‌క్లాస్ ఏసీ టికెట్లు కూడా పూర్తయ్యాయి. ప్రశాంతి, ఫలక్‌నుమా, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లకు వెయిటింగ్ లిస్టు దాటి రిగ్రెట్ సమాచారం వస్తోంది. ఒక్కో ట్రైన్‌లో వెయిటింగ్ లిస్టు చాంతాడంత కనిపిస్తోంది. శుక్ర, శని, ఆదివారాలు సెలవులు కావడంతో షిర్డీ, బెంగళూరు, హైదరాబాద్ వెళ్లాలని రెండురోజుల ముందు రిజర్వేషన్ టికెట్ల కోసం బండెడు ఆశతో కౌంటర్లకు వెళ్లిన ప్రయాణికులకు వెయిటింగ్‌లిస్టులు వెక్కిరించాయి. గురువారం రాత్రి గుంటూరు నుంచి ప్రయివేటు బస్సుల్లో ఆయా ప్రాంతాలకు ప్రయాణంచేశారు. ఇదే సరైన సమయంగా భావించిన ప్రయివేట్ ట్రావెల్స్ యజమానులు హైటెక్ బస్ చార్జీలను పెంచి వసూలు చేస్తున్నారు. గత్యంతరం లేని స్థితిలో ప్రయాణికులు వీటినే ఆశ్రయిస్తున్నారు. 
 
 తత్కాల్ టికెట్లకు డిమాండ్.: దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వేరేమార్గం లేక తత్కాల్ టికెట్‌ల కోసం క్యూ కడుతున్నారు. గుంటూరు అరండల్‌పేటలోని రైల్వే రిజర్వేషన్ కార్యాలయంలో రోజూ ఉదయం 10 గంటలకు సాధారణ రిజర్వేషన్ టికెట్ కౌంటర్ల కంటే తత్కాల్ టికెట్ కౌంటర్లే కిటకిటలాడుతున్నాయి. ఇవి కూడా అందనివారు ప్రయాణాలను వాయిదా వేసుకోలేక బాడుగ కార్లు బుక్ చేసుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement