చంద్రబాబు పిరికిపంద: కిరణ్
రాష్ట్ర విభజనకు సహకరించిన పార్టీలకు ఎన్నికల్లో లెంపకాయ కొట్టాలని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. విభజించిన కాంగ్రెస్‌కు, విభజనకు అంగీకరిస్తూ రెండుసార్లు లేఖలిచ్చిన టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటు ఇవ్వకుండా ప్రతీకారం తీర్చుకోవాలన్నారు.
ఆదివారం విశాఖ బీచ్‌రోడ్‌లో విద్యార్థి సంఘం నాయకులతో ఆయన సమావేశం నిర్వహిం చారు. అంతకుముందు జై సమైక్యాంధ్ర పార్టీ గుర్తు ‘పాదరక్షలు’ను ఒక చిన్నారితో ఆవిష్కరింపచేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర తమ నినాదం కాదని, విధానమని చెప్పారు. దురదృష్టవశాత్తు చంద్రబాబు తన జిల్లా వాసేనని, తన తండ్రే కాంగ్రెస్ నుంచి టికెట్ ఇప్పించారని కిరణ్ పేర్కొన్నారు. తరువాత టీడీపీలో చేరి మామకు వెన్నుపోటుపొడిచి అధికారాన్ని చేజిక్కించుకుని పాలనాదక్షుడనే ముసుగులో అధికారం కోసం అవాస్తవాలు, అబద్దాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడని ధ్వజమెత్తారు.
రాష్ట్ర విభజన ద్వారా ఇరు ప్రాంతాలు నష్టపోతాయని తెలిసీ తెలంగాణకు అనుకూలంగా రెండుసార్లు లేఖలిచ్చిన బాబు పాలనాదక్షుడెలా అవుతాడని ప్రశ్నించారు. తెలంగాణలో ఓట్లు పోతాయన్న భయంతో అసెంబ్లీలో విభజనపై ఒక్కసారి కూడా మాట్లాడలేని పిరికిపంద చంద్రబాబు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్ సబ్బం హరి, మాజీమంత్రి పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.