అక్కడ మోదం.. ఇక్కడ ఖేదం
రాష్ట్ర విభజన అంశంలో సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు భయపడినంతా జరుగబోతోందా? విభజన వల్ల ముందుగా నష్టపోయేది ఉద్యోగులేనంటూ అవి ఆందోళన చెందినట్టే ప్రమాద పరిస్థితులు చుట్టుముడుతున్నాయా? ప్రస్తుత పరిణామాలు ఆ అనుమానాలను బలపరిచేలా ఉన్నాయి. విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఉద్యోగులు భిన్నమైన పరిస్థితిని చవిచూస్తున్నారు. తెలంగాణ ఉద్యోగులకు మోదం.. సీమాంధ్ర ఉద్యోగులకు ఖేదం అనే రీతిలో పరిస్థితులు మారాయని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది.
సాక్షి, మచిలీపట్నం : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ నెల రెండో తేదీన తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ అక్కడి ఉద్యోగులపై ఎనలేని ప్రేమ చూపారు. ప్రమాణ స్వీకారం రోజునే తెలంగాణలో పనిచేసే ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. జీతభత్యాలు, పదోన్నతులు తదితర అంశాలపై ఆయన సానుకూలంగా స్పందించడంతో తెలంగాణ ఉద్యోగుల్లో ఆనందం ఉప్పొంగింది.
ఇటువంటి పరిస్థితిలో ఈ నెల ఎనిమిదిన అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేస్తున్న చంద్రబాబు ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపుతారా అనే అనుమానాలు రేగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రూ.15 వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉందని, దీంతో ఉద్యోగులకు కొత్త రాయితీల మాటెలా ఉన్నా జీతాల చెల్లింపులు సకాలంలో జరుగుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిధుల లభ్యతను బట్టే చెల్లింపు!
జిల్లాలో సుమారు 35 వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సుమారు 15 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరందరికీ ట్రెజరీ (ప్రభుత్వ ఖజానా) నుంచి జీతాలు చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర విభజన ప్రక్రియ జూన్ రెండో తేదీతో పూర్తికావడంతో మే నెల జీతాలు సక్రమంగానే వచ్చాయి. ఇప్పుడు లోటు బడ్జెట్‌తో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ జీతాల చెల్లింపు కష్టమేనని ఉద్యోగులు కలవరపడుతున్నారు. జీతాల బిల్లులు ఈ నెల 20న ట్రెజరీకి చేరే అవకాశం ఉండటంతో ఆ రోజు ఉన్న నిధుల లభ్యతను బట్టి చెల్లింపుపై నిర్ణయం ఉంటుందని పలువురు అధికారులు చెబుతున్నారు. జూన్ జీతాలపై నీలినీడలు కమ్ముకోవడంతో ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగులకు తగిన హామీ ఇవ్వాల్సి ఉంది.
బాబు ఏం చేస్తారో?
ఈ నెల ఎనిమిదిన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబుపై ఉద్యోగులు గంపెడాశలు పెట్టుకున్నారు. తెలంగాణలో ఉద్యోగులకు కేసీఆర్ వరాలు ఇవ్వడంతో సీమాంధ్ర ఉద్యోగులకు చంద్రబాబు ఎటువంటి వరాలు ఇస్తారోనని ఉద్యోగ సంఘాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.