N. Kiran Kumar Reddy
-
19న కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేషన్
సాక్షి, హైదరాబాద్: జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 19న పీలేరులో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరు చేరుకుంటారు. అక్కడినుంచి కలికిరికి వచ్చి రాత్రికి అక్కడ బస చేస్తారు. శనివారం ఉదయం పీలేరు చేరుకుని ఆ నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం రోడ్‌షోలో పాల్గొంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 20, 21 తేదీల్లో కూడా కిరణ్ రోడ్ షోల్లో పాల్గొంటారని తెలిపాయి. -
'పీలేరులో కిరణ్‌కు డిపాజిట్లు కూడా దక్కవు'
జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి శుక్రవారం తిరుపతిలో నిప్పులు చెరిగారు. సొంత నియోజకవర్గమైన పీలేరులో అభ్యర్థులను నిలబెట్టుకోలేని పరిస్థితి కిరణ్దంటూ ఆయన ఎద్దేవా చేశారు. అరాచక శక్తులతో వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవాలని కిరణ్ వర్గం ప్రయత్నిస్తుందంటూ ఆయన ఆరోపించారు. ఎన్ని దౌర్జన్యాలైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని మిథున్ రెడ్డి స్ఫష్టం చేశారు. పీలేరులో కిరణ్‌కు డిపాజిట్లు కూడా దక్కవని విమర్శించారు. కొన్ని మీడియా సంస్థలు కావాలని తమ పార్టీపై దుష్పచారం చేస్తున్నాయని మిథున్ రెడ్డి ఈ సందర్బంగా సదరు మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చంద్రబాబు పిరికిపంద: కిరణ్
రాష్ట్ర విభజనకు సహకరించిన పార్టీలకు ఎన్నికల్లో లెంపకాయ కొట్టాలని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. విభజించిన కాంగ్రెస్‌కు, విభజనకు అంగీకరిస్తూ రెండుసార్లు లేఖలిచ్చిన టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటు ఇవ్వకుండా ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. ఆదివారం విశాఖ బీచ్‌రోడ్‌లో విద్యార్థి సంఘం నాయకులతో ఆయన సమావేశం నిర్వహిం చారు. అంతకుముందు జై సమైక్యాంధ్ర పార్టీ గుర్తు ‘పాదరక్షలు’ను ఒక చిన్నారితో ఆవిష్కరింపచేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర తమ నినాదం కాదని, విధానమని చెప్పారు. దురదృష్టవశాత్తు చంద్రబాబు తన జిల్లా వాసేనని, తన తండ్రే కాంగ్రెస్ నుంచి టికెట్ ఇప్పించారని కిరణ్ పేర్కొన్నారు. తరువాత టీడీపీలో చేరి మామకు వెన్నుపోటుపొడిచి అధికారాన్ని చేజిక్కించుకుని పాలనాదక్షుడనే ముసుగులో అధికారం కోసం అవాస్తవాలు, అబద్దాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన ద్వారా ఇరు ప్రాంతాలు నష్టపోతాయని తెలిసీ తెలంగాణకు అనుకూలంగా రెండుసార్లు లేఖలిచ్చిన బాబు పాలనాదక్షుడెలా అవుతాడని ప్రశ్నించారు. తెలంగాణలో ఓట్లు పోతాయన్న భయంతో అసెంబ్లీలో విభజనపై ఒక్కసారి కూడా మాట్లాడలేని పిరికిపంద చంద్రబాబు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్ సబ్బం హరి, మాజీమంత్రి పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఇంట గెలవకనే.. రచ్చకు !
తిరుపతి: ఇంట గెలవకనే రచ్చ గెలిచేందుకు పోయినట్టుంది మాజీ సీఎం వ్యవహారం. ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షులుగా ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ బుధవారం పురుడు పోసుకుంటోంది. ఇందుకు గోదావరి తీరం రాజమండ్రి వేదిక కానుంది. పలు రాజకీయ సంచలనాలకు కేంద్రబిందువైన సొంత జిల్లాలోని తిరుపతిని కాకుండా అయన రాజమండ్రిని ఎంపిక చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం జిల్లాలో ఆయనకు పట్టులేకపోవడమే అని విమర్శకులు అంటున్నారు. .సుమారు మూడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు జిల్లా కాంగ్రెస్ పార్టీపై గానీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై గానీ ఎప్పుడూ పట్టులేదు. జిల్లా ప్రజల్లోనూ తనదంటూ ముద్ర వేసుకోవడంలో విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్లో కిరణ్ జై సమైక్యాంధ్ర పేరుతో కొత్త పార్టీని స్థాపించడమంటే ఇంట గెలవకనే రచ్చ గెలిచే ప్రయత్నమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కిరణ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరి దారి వారిదన్నట్టు వ్యవహరించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన తరువాత తన వెంట జిల్లా నుంచి ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యేను నిలుపుకోలేని పరిస్థితి ఆయనది. అభివృద్ధి పనులన్నింటినీ పీలేరుకు కేటాయించుకున్న కిరణ్ సొంత నియోజకవర్గంలో తనకు ఎదురు లేకుండా చేసుకునేందుకు టీడీపీకి చెందిన ఇంతియాజ్ అహ్మద్, జీవీ శ్రీనాథరెడ్డిని కాంగ్రెస్‌లో చేర్పించారు. ఒకరికి సమాచార కమిషనర్ పదవిని మరొకరికి టీటీడీ పాలకమండలిలో సభ్యత్వం ఇప్పించుకోగలిగారు. అంతకు మించి జిల్లాలో ఆయన వల్ల రాజకీయంగా ప్రయోజనం పొందిన వారు లేరంటే అతిశయోక్తి లేదు. జిల్లాను ఏ మాత్రం పట్టించుకోని కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు ఏకంగా కొత్త పార్టీ పెట్టి ఎవరిని ఉద్ధరిస్తారనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ తరువాత జిల్లా వైపు కన్నెత్తి చూడలేదు. రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు అవకాశం ఇచ్చిన జిల్లాను, నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం లేదనే అపవాదును మాజీ సీఎం మూటగట్టుకుంటున్నారు. గత నెల 19వ తేదీన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన రాష్ట్ర రాజధానికే పరిమితమయ్యారు. -
సీఎం రాజీనామాపై కోర్‌కమిటీ చర్చ!
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా సంకేతాలపై కాంగ్రెస్ కోర్‌కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది. కిరణ్ రాజీనామా చేస్తే ఏం చేయాలనే అంశంపై కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. లోక్‌సభలో మంగళవారం రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం అనంతరం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్సింగ్, రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, ఏకే ఆంటోనీ తదితరులు సమావేశమయ్యారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం కోసం అనుసరించాల్సిన వ్యూహంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలపైనా వారు చర్చించినట్లు తెలిసింది. మరోవైపు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం తన పదవికి రాజీనామా చేస్తారని సంకేతాలు అందడంతో ఈ అంశంపైనా వారు చర్చించినట్లు తెలిసింది. కొత్త ముఖ్యమంత్రిని నియమించాలా? లేక రాష్ట్రపతి పాలన విధించాలా? అనే అంశంపై మల్లగుల్లాలు పడినట్లు తెలుస్తోంది. రాజ్యసభలో బిల్లు ఆమోదం అనంతరం రాష్ట్రపతి వద్దకు బిల్లు వెళుతున్నందున ఈ నెలాఖరులోగా గెజిట్ వెలువడే అవకాశ ం ఉందని, అదే సమయంలో వచ్చే నెల తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం దాదాపుగా ఖరారైన నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై కోర్‌కమిటీ చర్చించినట్లు తెలిసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు రాష్ట్రపతి పాలన విధించాలా? లేక ప్రభుత్వాన్ని కొనసాగించి కొత్త ముఖ్యమంత్రిని నియమించాలా? అనే అంశంపై కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసిన తరువాతే తన నిర్ణయాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమైనట్లు తెలిసింది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో సమావేశమై సీఎం రాజీనామా, పార్టీలో పరిణామాలు, వ్యవహరించాల్సిన తీరుపై చర్చించినట్లు తెలిసింది. -
మూడన్నర గంటల ముచ్చట !
-
మూడన్నర గంటల ముచ్చట !
హస్తినలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దీక్ష 12.45 ప్రారంభం.. 4.15 ముగింపు పీసీసీ చీఫ్ బొత్స, సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతల హాజరు జాడలేని మంత్రులు కన్నా, పితాని, డొక్కా న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:‘‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించండి’’ నినాదంతో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో దీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 4.15 గంటలకల్లా ముగిసింది. రాష్ట్ర ఉభయ సభలు తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను పార్లమెంటులో ప్రవేశపెట్టొద్దని కోరుతూ జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన ఈ దీక్షకు సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 16 మంది మంత్రులు, 50 మందికిపైగా ఎమ్మెల్యేలు, 20 మందికిపైగా ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో వేదిక నిండిపోయింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారనే సమాచారంతో జాతీయ, రాష్ట్ర మీడియా జంతర్‌మంతర్ వద్ద మోహరించింది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రులు పళ్లంరాజు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, మాగుంట శ్రీనివాసులరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, రాయపాటి సాంబశివరావు, హర్షకుమార్, కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, సాయిప్రతాప్, మంత్రులు పార్థసారథి, శైలజానాథ్, ఆనం రామనారాయణరెడ్డి, అహ్మదుల్లా, తోట నర్సిం హులు, మహీధర్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, కాసు కృష్ణారెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, గల్లా అరుణ, బాలరాజు, వట్టి వసంత్‌కుమార్, కోండ్రు ము రళి, శత్రుచర్ల విజయరామరాజు, పలువురు ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు దీక్షలో పాల్గొన్నారు. మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పితాని సత్యనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్ మాత్రం ఎక్కడా కానరాలేదు. రాజ్‌ఘాట్ వద్ద నివాళి.. జంతర్‌మంతర్ దీక్షకు బయలుదేరేముందు సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ఏపీభవన్‌లో ప్రత్యేక మంతనాలు జరిపారు. దీక్ష అనంతరం రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు. అక్కడే ప్రణబ్‌కు అందించేందుకు నాలుగు పేజీల లేఖను సిద్ధం చేశారు. మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మునికి నేతలతో కలిసి సీఎం నివాళులర్పించారు. చిరంజీవి, పురందేశ్వరిలు రాజ్‌ఘాట్‌కు వచ్చి కిరణ్‌తో కొద్దిసేపు ముచ్చటించారు. -
వరద బాధితులకు సీఎం కిరణ్ హామీలు
=నష్టం జరగకుండా చర్యలు =అందరికీ సత్వర సాయం =వరద బాధితులకు సీఎం కిరణ్ హామీలు =ఉరుకులు పరుగులతో పర్యటన విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : తుఫాన్, వరదల వల్ల రైతులు, ప్రజల పంటలకు, ఆస్తులకు నష్టం సంభవించకుండా శాశ్వత పరిష్కార మార్గాలు చూపుతామని ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చా రు. తుఫాన్ వల్ల దెబ్బ తిన్న ప్రాంతాలను బుధవారం ఆయన పరిశీలించారు. అనకాపల్లిలోని దేవీనగర్, రాంబిల్లి మండలం పంచదార, నారాయణ పురం గ్రామాల్లో ముని గిపోయిన పంటలను, శారద నదికి పడిన గండ్లను ఆయన పరిశీలించారు. నారాయణ పురంలో ఏర్పాటు చేసిన వరద నష్టం ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రైతులు సమస్యల్లో ఉన్నప్పుడు ఆత్మ స్థైర్యం కోల్పోకుండా పోరాడాలని పిలుపు నిచ్చారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుం టుందని, పంటలు నష్టపోయిన రైతులకు స బ్సిడీ కింది విత్తనాలు అందిస్తామన్నారు. ఉద్యోగులు సమ్మెలో వున్నందువల్ల నీలం తుఫాన్ నష్టపరిహారం పంపిణీ చేయలేక పోయారనీ, జిల్లాకు రూ. 32 కోట్లు రావాల్సి ఉండగా, 22 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఈ పరిహారం త్వరలోనే పంపిణీ చేస్తామని తెలిపారు. వారం రోజులుగా జిల్లాను కుదిపేసిన తుఫాన్ నష్టం అంచనాలు వేయిస్తామనీ, బాధితులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలోసీఎం ముందుంటారని చెప్పారు. నియోజక వర్గంలో రైతులు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కోసం సీఎం కృషి చేయాలని కన్నబాబు రాజు చెప్పారు. శాశ్వత పరిష్కార మార్గాల కోసం రూ. 110 కోట్లు మంజూరు చేయాలని కోరారు. వరదల వల్ల ప్రజలు నష్టపోకుండా ఉండేందుకు కాలువల ఆక్రమణలను తొలగించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. శాసనసభ్యుడు చింతలపూడి వెంకట్రామయ్య, అవంతి శ్రీనివాసరావు, డీసీసీ అధ్యక్షుడు ధర్మశ్రీ, జిల్లా కలెక్టరు ఆరోఖ్యరాజ్‌తో పాటు పలువురు అధికారులు సీఎం పర్యటనలో పాల్గొన్నారు. మమ్నల్మి ఆదుకోండి వరదలు, తుఫాన్ల వల్ల తాము పడుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తెచ్చిన దేవీనగర్ వాసులు తమను ఆదుకోవాలని కోరారు. నారాయణ పురం సమీపంలో నీట మునిగిన వరి పొలాలను సీఎం చూశారు. రైతులతో మాట్లాడారు. అనకాపల్లి సమీపంలోని కొండకొప్పాక బ్రిడ్జి మీద నుంచి నీటి ప్రవాహాన్ని చూశారు. ఆక్రమణలు తొలగించి, శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోక పోవడం వల్లే తరచూ తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు సీఎం దృష్టికి తెచ్చారు. ఆగమేఘాల మీద వరద పర్యటన సాయంత్రం 4 గంటలకు విశాఖ విమానాశ్ర యం చేరుకున్న సీఎం ఆగమేఘాల మీద వర ద ప్రాంతాల్లో పర్యటనను ముగించారు. రైతు లు, వరద బాధితుల సమస్యలు సావధానంగా వినడానికి ఎక్కడా సమయం కేటాయిం చలేదు. నారాయణపురం లో రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేసినప్పటికీ సమయాభావం పేరుతో దాన్ని రద్దు చేశా రు. సీఎం పర్యటనలో జనం సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ రాష్ట్రం విడిపోకుండా ఉండేలా చూడాలని కోరారు. నేడు కాకినాడకు సీఎం : గురువారం కాకినాడకు బయల్దేరనున్నారు. ఉదయం 8.30 గంటలకు ప్రభు త్వ అతిథి గృహం నుంచి బయల్దేరి జైలు రోడ్డు ప్రాంతంలో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం ఉదయం 9.05 గంటలకు హెలికాప్టర్లో కాకినాడకు వె ళతారు. -
ప్రజల్ని సీఎం మభ్యపెడుతున్నారు: విశ్వరూప్
ఆయనపై నమ్మకం లేకే పదవికి, పార్టీకి రాజీనామా చేశా: విశ్వరూప్ సమైక్యాంధ్రపై స్థిరమైన నిర్ణయం తీసుకున్న జగన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను మభ్యపెట్టేలా ఉన్నాయని మాజీ మంత్రి పి.విశ్వరూప్ విమర్శించారు. సీఎం మాటలకు, చేతలకు పొంతన లేదని ధ్వజమెత్తారు. ఆయనపై నమ్మకం లేకనే పదవికి, పార్టీకి రాజీనామా చేశానని పేర్కొన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని విశ్వరూప్ శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన విషయంలో సీఎం కిరణ్ చేస్తున్న వ్యాఖ్యలు.. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రులు తీరు చూస్తే రోజుకొక మాట చెబుతూ ప్రజల్ని గందరగోళంలోకి నెడుతున్నారని దుయ్యబట్టారు. తాను సమైక్యవాదానికి కట్టుబడే మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ఆయన వివరించారు. సమైక్యాంధ్రకోసం స్థిరమైన స్టాండ్ తీసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి పనిచేయడానికి తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్యాకేజీలకు తాము పూర్తి విరుద్ధమని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనేది తమ ఏకైక డిమాండ్ అని విశ్వరూప్ స్పష్టం చేశారు. -
లెక్కలు సెటిల్ చేసుకోవడంలో సీఎం బిజీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనను పూర్తిగా విస్మరించి, వసూళ్ళపైనే దృష్టి పెట్టారని తెరాస నేత హరీష్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణకు పైసా ఇవ్వకుండా చిత్తూరులో తాగునీటి పథకానికి ఏకంగా రూ.6 వేల కోట్లు కేటాయించడం ఏమిటని మండిపడ్డారు. చిత్తూరులో తాగు నీటికి నిధులు కేటాయిస్తూ జీవో విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం తెరాస నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి నిరసన తెలిపారు. ఈ జీవోను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే ప్రయత్నంలో సిఎం ఉన్నారని, రాష్ట్రంలో అనిశ్చితి కొనసాగుతున్నా, కాంట్రాక్టులు, బిడ్డింగులు ఆగడం లేదని ఆరోపించారు. లెక్కలు సెటిల్ చేసుకునే దిశగా ముఖ్యమంత్రి ఫైళ్ళపై విరామం లేకుండా సంతకాలు చేస్తున్నారని ఆరోపించారు. చిత్తూరు మంచినీటి పథకానికి కేబినెట్ అనుమతి లేకుండానే రూ.6 వేల కోట్లు కేటాయిస్తూ ఎలా జీవో విడుదల చేశారని ప్రశ్నించారు. దీనికి ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ జీవోను నిలిపివేయాలని సీఎస్‌ను కోరానని హరీష్‌రావు చెప్పారు. కిరణ్‌కు కొనసాగే అర్హత లేదు: దిలీప్ కిరణ్‌కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఎంతమాత్రం లేదని తెలంగాణా రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ నేత, ఎమ్మెల్సీ దిలీప్ వ్యాఖ్యానించారు. సీఎం సీమాంధ్రకే పరిమితమయ్యారని విమర్శించారు. వరంగల్ విమానాశ్రయానికి రూ.25 కోట్లు ఇవ్వలేని ముఖ్యమంత్రి, గన్నవరం ఎయిర్‌పోర్టుకు రూ.125 కోట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అన్నింటా పక్షపాతమే: పోచారం ముఖ్యమంత్రి పక్షపాత ధోరణి వల్ల అన్ని శాఖల్లోనూ తెలంగాణ పట్ల వివక్ష కొనసాగుతోందని తెలంగాణ ప్రాంత నేత పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణ వాదులు రెచ్చిపోవడం ఖాయమని హెచ్చరించారు. -
హైదరాబాద్.. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిది: కిరణ్‌కుమార్
హైదరాబాద్ ఏ ఒక్క ప్రాంతానికో సంబంధించినది కాదని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిదీ అని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మరోసారి నిరసన గళం వినిపించారు. ఓ ఇంటర్వ్యూలో కిరణ్ మాట్లాడుతూ ఒక సమస్యను పరిష్కరించడానికి మరో పెద్ద సమస్యను సృష్టించరాదని అన్నారు. పార్టీ కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనల్ని పరిష్కరించనిదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ముందుకెళ్లడం చాలా కష్టమని కిరణ్ అన్నారు. తెలంగాణపై నోట్‌ను కేంద్ర కేబినెట్ ముందు చర్చకు పెట్టిన తర్వాత అసెంబ్లీ ఆమోదం కోసం పంపుతామన్న కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటనపై పైవిధంగా స్పందించారు. తెలంగాణ ప్రకటన వెలువడ్డాక కాంగ్రెస్, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్ననిరసనల గురించి కిరణ్ ప్రస్తావించారు. కాంగ్రెస్‌తో ఘర్షణాత్మక వైఖరి అవలంభిస్తారా అన్న ప్రశ్నకు.. 'పార్టీ వ్యతిరేక వైఖరికి సంబంధించిన విషయం కాదిది. ప్రజల భయాందోళనలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. లక్షలాది ప్రజలు తమ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు. వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నాపై ఉంది' అని కిరణ్ బదులిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం గురించే సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తున్నారన్నారు. పార్టీ కంటే రాష్ట్రం, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు. విభజన వల్ల చాలా సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. నదీ జలాల పంపిణీతో పాటు హైదరాబాద్‌తో ఉన్న విద్య, వైద్య సదుపాయాలు, ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి చాలా సమస్యలు వస్తాయని వివరించారు. హైదరాబాద్‌లో పెట్టుబడుతు పెట్టినందువల్లే సీమాంధ్ర నాయకులు విభజనను వ్యతిరేకిస్తున్నారన్నవాదనతో ఆయన విభేదించారు. 'నేను హైదరాబాద్‌లో పుట్టి, ఇక్కడే చదువుకుని పెరిగాను. 53 ఏళ్ల తర్వాత ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిని కాదంటే ఎలా? హైదరాబాద్ మాదని ఎవరూ చెప్పరాదు. హైదరాబాద్ సుదీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిది' అని ముఖ్యమంత్రి అన్నారు.