ప్రజల్ని సీఎం మభ్యపెడుతున్నారు: విశ్వరూప్
ఆయనపై నమ్మకం లేకే పదవికి, పార్టీకి రాజీనామా చేశా: విశ్వరూప్
సమైక్యాంధ్రపై స్థిరమైన నిర్ణయం తీసుకున్న జగన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను మభ్యపెట్టేలా ఉన్నాయని మాజీ మంత్రి పి.విశ్వరూప్ విమర్శించారు. సీఎం మాటలకు, చేతలకు పొంతన లేదని ధ్వజమెత్తారు. ఆయనపై నమ్మకం లేకనే పదవికి, పార్టీకి రాజీనామా చేశానని పేర్కొన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విశ్వరూప్ శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన విషయంలో సీఎం కిరణ్ చేస్తున్న వ్యాఖ్యలు.. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు.
అదేవిధంగా కేంద్ర మంత్రులు తీరు చూస్తే రోజుకొక మాట చెబుతూ ప్రజల్ని గందరగోళంలోకి నెడుతున్నారని దుయ్యబట్టారు. తాను సమైక్యవాదానికి కట్టుబడే మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ఆయన వివరించారు. సమైక్యాంధ్రకోసం స్థిరమైన స్టాండ్ తీసుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి పనిచేయడానికి తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్యాకేజీలకు తాము పూర్తి విరుద్ధమని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనేది తమ ఏకైక డిమాండ్ అని విశ్వరూప్ స్పష్టం చేశారు.