హస్తినలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దీక్ష
12.45 ప్రారంభం.. 4.15 ముగింపు
పీసీసీ చీఫ్ బొత్స, సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతల హాజరు
జాడలేని మంత్రులు కన్నా, పితాని, డొక్కా
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:‘‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించండి’’ నినాదంతో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో దీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 4.15 గంటలకల్లా ముగిసింది. రాష్ట్ర ఉభయ సభలు తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను పార్లమెంటులో ప్రవేశపెట్టొద్దని కోరుతూ జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన ఈ దీక్షకు సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 16 మంది మంత్రులు, 50 మందికిపైగా ఎమ్మెల్యేలు, 20 మందికిపైగా ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో వేదిక నిండిపోయింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారనే సమాచారంతో జాతీయ, రాష్ట్ర మీడియా జంతర్‌మంతర్ వద్ద మోహరించింది.
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రులు పళ్లంరాజు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, మాగుంట శ్రీనివాసులరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, రాయపాటి సాంబశివరావు, హర్షకుమార్, కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, సాయిప్రతాప్, మంత్రులు పార్థసారథి, శైలజానాథ్, ఆనం రామనారాయణరెడ్డి, అహ్మదుల్లా, తోట నర్సిం హులు, మహీధర్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, కాసు కృష్ణారెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, గల్లా అరుణ, బాలరాజు, వట్టి వసంత్‌కుమార్, కోండ్రు ము రళి, శత్రుచర్ల విజయరామరాజు, పలువురు ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు దీక్షలో పాల్గొన్నారు. మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పితాని సత్యనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్ మాత్రం ఎక్కడా కానరాలేదు.
రాజ్‌ఘాట్ వద్ద నివాళి..
జంతర్‌మంతర్ దీక్షకు బయలుదేరేముందు సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ఏపీభవన్‌లో ప్రత్యేక మంతనాలు జరిపారు. దీక్ష అనంతరం రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు. అక్కడే ప్రణబ్‌కు అందించేందుకు నాలుగు పేజీల లేఖను సిద్ధం చేశారు. మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మునికి నేతలతో కలిసి సీఎం నివాళులర్పించారు. చిరంజీవి, పురందేశ్వరిలు రాజ్‌ఘాట్‌కు వచ్చి కిరణ్‌తో కొద్దిసేపు ముచ్చటించారు.
మూడన్నర గంటల ముచ్చట !
Published Thu, Feb 6 2014 1:49 AM | Last Updated on Sat, Jun 2 2018 3:39 PM
Advertisement