సమైక్య సభ నేపథ్యంలో పోలీసుల అలర్ట్
సమైక్య సభ నేపథ్యంలో పోలీసుల అలర్ట్
Published Thu, Sep 5 2013 1:46 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు సభ నిర్వహించనున్న నేపథ్యంలో నిరసనలు తెలిపేందుకు తెలంగాణ జేఏసీ, ప్రజా సంఘాలు సిద్ధం కావడంతో పోలీసుల్లో టెన్షన్ మొదలైంది. 7వ తేదీన ఎల్‌బీ స్టేడియంలో సభ నిర్వహించుకునేందుకు ఏపీ ఎన్జీవోలకు పోలీసు శాఖ ఇప్పటికే అనుమతించింది. ఉస్మానియా విద్యార్థి జేఏసీ, తెలంగాణ జేఏసీ తలపెట్టిన ర్యాలీలకు మాత్రం అనుమతి సాధ్యం కాదని తేల్చిచెప్పింది.
ఎల్‌బీ స్టేడియంలో 6వ తేదీన ఎమ్మార్పీఎస్ తలపెట్టిన సభకు కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో తెలంగాణ జేఏసీ, విద్యార్థి సంఘాలు, ఎమ్మార్పీఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి. ఏపీఎన్జీవోల సభకు సీమాంధ్రలోని పలు జిల్లాల నుంచి ఉద్యోగులు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఏపీఎన్జీవోల సభను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వానికి తమ సత్తా చాటాలని తెలంగాణవాదులు భావిస్తున్నారు. దాంతో శనివారం సభ సందర్భంగా ఘర్షణలు తలెత్తవచ్చని నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, అన్ని రీజియన్ల ఐజీలతో డీజీపీ వి.దినేశ్‌రెడ్డి బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Advertisement
Advertisement