సమైక్య సభను అడ్డుకుంటే.. తెలంగాణను అడ్డుకుంటాం: అశోక్‌బాబు
సమైక్య సభను అడ్డుకుంటే.. తెలంగాణను అడ్డుకుంటాం: అశోక్‌బాబు
Published Fri, Sep 6 2013 2:49 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
సీమాంధ్ర ప్రజల సహకారం లేకుండా తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదని, హైదరాబాద్‌లో సమైక్య సభను అడ్డుకుంటే ఢిల్లీలో తాము తెలంగాణను అడ్డుకుంటామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు హెచ్చరించారు. గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ వాదాన్ని వినిపించడానికే సభ ఏర్పాటు చేస్తున్నామని, ఎవరికీ వ్యతిరేకంగా కాదని పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సభను అడ్డుకుంటామంటూ కొంత మంది నాయకులు మాట్లాడడం సరికాదన్నారు. ప్రత్యేకవాదంలో బలముంటే.. తమ సభ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు సృష్టించవద్దని చెప్పారు. సభ సజావుగా సాగడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు ఉద్యోగులకు మాత్రమే అనుమతి లభించిందన్నారు. ‘గుర్తింపు కార్డులతో పాటు మేం జారీ చేసిన ప్రత్యేక కార్డులు ఉన్న ఉద్యోగులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. రాజకీయ పార్టీల నాయకులు పోలీసుల అనుమతితో స్టేడియంలోకి వస్తారు. అయితే, వారికి వేదికపై ప్రసంగించే అవకాశం ఉండదు’ అని తెలిపారు. రాజకీయ నేతలు తమ సభకు వస్తే తప్పేముందని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సభ నిర్వహణకు పోలీసులు అనుమతించినా ఎల్బీ స్టేడియం అధికారులు సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిచోటా సభ నిర్వహణ ఏర్పాట్లకు అవరోధం కల్పిస్తున్న స్టేడియం అధికారుల తీరును తప్పుపట్టారు.
ఎల్బీ స్టేడియంలో సభకు ఏవైనా ఆటంకాలు తలపెడితే స్టేడియం బయటే సభను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఏపీఎన్జీవో నగర శాఖ అధ్యక్షుడు పి.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున సమైక్యవాదులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదికలో ప్రతి ఒక్కర్నీ భాగస్వాములను చేసే శాశ్వత కార్యాచరణను త్వరలో రూపొందించనున్నట్లు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. తర్వాతి దశలో హైదరాబాద్‌లో భారీ మానవహారం, సమైక్య ఆవశ్యకతను తెలియజేసేలా అన్ని కాలనీలలో సమావేశాలు నిర్వహణతో పాటు నగరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. సభా ప్రాంగణానికి బూర్గుల రామకృష్ణారావు, సాంస్కృతిక కళావేదికకు గురజాడ అప్పారావు పేరిట నామకరణం చేశారు. ముఖద్వార వేదికకు కాకతీయ ద్వారం అని, వీఐపీ ద్వారానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ద్వారం అని పేరు పెట్టారు. సభ ప్రాంగణంలో తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లోని పోరాట యోధుల చిత్రపటాల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు.
నవంబర్‌లో భారీ సభ..
సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట నిర్వహిస్తున్న సభను ఉద్యోగ వర్గాలకే పరిమితం చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. భారీ స్థాయిలో జన సమీకరణ అవసరం లేదని, 50-60 వేల మంది ఉద్యోగులతో సభ జరిపితే విజయవంతమయినట్లుగానే భావిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. సీసీఎం, ఎంఐఎం పార్టీలనే సభకు ఆహ్వానించారు. రాజకీయ నాయకులను సభకు తీసుకురావడానికి పెద్దగా ప్రయత్నించకూడదనే నిర్ణయానికి వచ్చారు. సమైక్యవాదాన్ని నమ్ముతున్న అన్ని వర్గాల ప్రజలు, విభజనను వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీలను కలిసి, నవంబర్‌లో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే దిశగా ఉద్యోగ, కార్మిక సంఘాలు ప్రయత్నిస్తున్నాయి.
Advertisement
Advertisement