samaikya meeting
-
సమైక్య సభకు అనుమతించాలి: అశోక్‌బాబు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సమైక్య సభ నిర్వహించే హక్కు అందరికీ ఉందని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. ఎవరు సభ పెట్టినా ప్రభుత్వం అనుమతించాలని ఆయన సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 19న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమైక్య శంఖారావం సభకు వెళ్లాలా, లేదా అనేది చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. స్పీకర్‌కు రాజీనామాలు ఇచ్చినా సీమాంధ్ర ఎంపీల ఇళ్ల వద్ద ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆంటోనీ కమిటీకి ఎలాంటి అధికారం లేదని, కేవలం పార్టీ కమిటీ మాత్రమేనని.. అలాంటి కమిటీకి తాము ఎలాంటి నివేదిక ఇవ్వబోమని తెలిపారు. రేపు అసెంబ్లీ గాంధీ విగ్రహం వద్దకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఎంపీలు రాజీనామాలే చేయడమే కాకుండా అధికార హోదా వదులుకుని నియోజకవర్గాలకు రావాలని అశోక్‌బాబు డిమాండ్ చేశారు. -
సమైక్యవాదాన్ని బలంగా వినిపించాం: ఏపీఎన్జీవోలు
హైదరాబాద్: ఏపిఎన్జీఓల ఆధ్వర్యంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో హైదరాబాద్‌లోని ఎల్బి స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సమైక్య సభ విజయవంతం అయిందని ఏపీఎన్జీవోలు పేర్కొన్నారు. ఈ బహిరంగ సభలో తాము సమైక్యవాదాన్ని బలంగా వినిపించామని చెప్పారు. తాము ఏర్పాటుచేసిన ఈ సభ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. విభనపై గత కొన్నిరోజులుగా సాగుతున్న సమ్మెను విరమించే ప్రసక్తే లేదని తెలిపారు. విభజన విషయమై టీఎన్జీవోలతో చర్చలు జరిపేందుకు ఏపీఎన్జీవోలు సిద్ధమేనని చెప్పారు. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాలో సదస్సు నిర్వహిస్తే స్వాగతిస్తామని ఏపీఎన్జీవోలు స్పష్టం చేశారు. కాగా, ఏపి ఎన్జీఓల సమైక్య సభకు వ్యతిరేకంగా చేపట్టిన తెలంగాణ బంద్ కూడా విజయవంతమైంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు తావులేకుండా ఒక పక్క తెలంగాణ బంద్, మరో పక్క సమైక్యాంధ్ర బహిరంగ సభ ప్రశాంతంగా జరిగిపోయాయి. పోలీసులకు టెన్షన్ తగ్గింది. బహిరంగ సభ మూడు గంటల 20 నిమిషాల సేపు సాగింది. ఉదయం 10 గంటల నుంచి స్టేడియం దగ్గర సందడి మొదలైంది. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు సీమాంధ్ర జిల్లాల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చారు. మహిళా ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
సమైక్య సభను అడ్డుకుంటే.. తెలంగాణను అడ్డుకుంటాం: అశోక్‌బాబు
సీమాంధ్ర ప్రజల సహకారం లేకుండా తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదని, హైదరాబాద్‌లో సమైక్య సభను అడ్డుకుంటే ఢిల్లీలో తాము తెలంగాణను అడ్డుకుంటామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు హెచ్చరించారు. గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ వాదాన్ని వినిపించడానికే సభ ఏర్పాటు చేస్తున్నామని, ఎవరికీ వ్యతిరేకంగా కాదని పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సభను అడ్డుకుంటామంటూ కొంత మంది నాయకులు మాట్లాడడం సరికాదన్నారు. ప్రత్యేకవాదంలో బలముంటే.. తమ సభ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు సృష్టించవద్దని చెప్పారు. సభ సజావుగా సాగడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు ఉద్యోగులకు మాత్రమే అనుమతి లభించిందన్నారు. ‘గుర్తింపు కార్డులతో పాటు మేం జారీ చేసిన ప్రత్యేక కార్డులు ఉన్న ఉద్యోగులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. రాజకీయ పార్టీల నాయకులు పోలీసుల అనుమతితో స్టేడియంలోకి వస్తారు. అయితే, వారికి వేదికపై ప్రసంగించే అవకాశం ఉండదు’ అని తెలిపారు. రాజకీయ నేతలు తమ సభకు వస్తే తప్పేముందని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సభ నిర్వహణకు పోలీసులు అనుమతించినా ఎల్బీ స్టేడియం అధికారులు సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిచోటా సభ నిర్వహణ ఏర్పాట్లకు అవరోధం కల్పిస్తున్న స్టేడియం అధికారుల తీరును తప్పుపట్టారు. ఎల్బీ స్టేడియంలో సభకు ఏవైనా ఆటంకాలు తలపెడితే స్టేడియం బయటే సభను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఏపీఎన్జీవో నగర శాఖ అధ్యక్షుడు పి.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున సమైక్యవాదులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదికలో ప్రతి ఒక్కర్నీ భాగస్వాములను చేసే శాశ్వత కార్యాచరణను త్వరలో రూపొందించనున్నట్లు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. తర్వాతి దశలో హైదరాబాద్‌లో భారీ మానవహారం, సమైక్య ఆవశ్యకతను తెలియజేసేలా అన్ని కాలనీలలో సమావేశాలు నిర్వహణతో పాటు నగరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. సభా ప్రాంగణానికి బూర్గుల రామకృష్ణారావు, సాంస్కృతిక కళావేదికకు గురజాడ అప్పారావు పేరిట నామకరణం చేశారు. ముఖద్వార వేదికకు కాకతీయ ద్వారం అని, వీఐపీ ద్వారానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ద్వారం అని పేరు పెట్టారు. సభ ప్రాంగణంలో తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లోని పోరాట యోధుల చిత్రపటాల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. నవంబర్‌లో భారీ సభ.. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట నిర్వహిస్తున్న సభను ఉద్యోగ వర్గాలకే పరిమితం చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. భారీ స్థాయిలో జన సమీకరణ అవసరం లేదని, 50-60 వేల మంది ఉద్యోగులతో సభ జరిపితే విజయవంతమయినట్లుగానే భావిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. సీసీఎం, ఎంఐఎం పార్టీలనే సభకు ఆహ్వానించారు. రాజకీయ నాయకులను సభకు తీసుకురావడానికి పెద్దగా ప్రయత్నించకూడదనే నిర్ణయానికి వచ్చారు. సమైక్యవాదాన్ని నమ్ముతున్న అన్ని వర్గాల ప్రజలు, విభజనను వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీలను కలిసి, నవంబర్‌లో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే దిశగా ఉద్యోగ, కార్మిక సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. -
ఏదో ఒకటి తేల్చిచెప్పండి : ఏపీఎన్జీవో
సమైక్య సభకు అనుమతిపై పోలీసులకు ఏపీఎన్జీవోల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను, విభజన వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించడానికి వచ్చే నెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తాము తలపెట్టిన సమైక్య సభకు అనుమతి ఇవ్వాలని, లేదంటే ఇవ్వలేమని తేల్చిచెప్పాలని ఎపీఎన్జీవోలు పోలీసులను కోరారు. సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి తదితరులు శుక్రవారం డీజీపీ దినేష్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మను కలిసి సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనుమతి మంజూరు చేస్తే శాంతిభద్రతల సమస్య తలత్తే అవకాశముందని పోలీస్ కమిషనర్ చెప్పారని ఏపీఎన్జీవో నేతలు వెల్లడించారు. ఉన్నతాధికారులకు నివేదించామని, రెండు మూడు రోజుల్లో చెబుతామని హామీ ఇచ్చారని వారు చెప్పారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి సభకు అనుమతిపై మాట్లాడటానికి ప్రయత్నించామని, అయితే ఆయన బిజీగా ఉండటం వల్ల కలవలేకపోయామని ఏపీఎన్జీవో నేతలు తెలిపారు.