రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను, విభజన వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించడానికి వచ్చే నెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తాము తలపెట్టిన సమైక్య సభకు అనుమతి ఇవ్వాలని, లేదంటే ఇవ్వలేమని తేల్చిచెప్పాలని ఎపీఎన్జీవోలు పోలీసులను కోరారు.
సమైక్య సభకు అనుమతిపై పోలీసులకు ఏపీఎన్జీవోల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను, విభజన వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించడానికి వచ్చే నెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తాము తలపెట్టిన సమైక్య సభకు అనుమతి ఇవ్వాలని, లేదంటే ఇవ్వలేమని తేల్చిచెప్పాలని ఎపీఎన్జీవోలు పోలీసులను కోరారు. సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి తదితరులు శుక్రవారం డీజీపీ దినేష్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మను కలిసి సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అనుమతి మంజూరు చేస్తే శాంతిభద్రతల సమస్య తలత్తే అవకాశముందని పోలీస్ కమిషనర్ చెప్పారని ఏపీఎన్జీవో నేతలు వెల్లడించారు. ఉన్నతాధికారులకు నివేదించామని, రెండు మూడు రోజుల్లో చెబుతామని హామీ ఇచ్చారని వారు చెప్పారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి సభకు అనుమతిపై మాట్లాడటానికి ప్రయత్నించామని, అయితే ఆయన బిజీగా ఉండటం వల్ల కలవలేకపోయామని ఏపీఎన్జీవో నేతలు తెలిపారు.