తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోండి
అశోక్‌బాబుపై ఉద్యోగుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా చర్చించాలని ఏపీఎన్జీవోలు చెప్పడాన్ని ఉద్యోగులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. బిల్లుపై చర్చకు అంగీకరిస్తే రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నట్లేనని స్పష్టంచేశారు. చర్చను అడ్డుకునే ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామంటూ ఉద్యోగులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని అశోక్‌బాబుకు వారు హితవు పలికారు. చర్చ జరపడానికి సహకరించాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేయడం.. విభజనకు అంగీకరించమని చెప్పినట్టేనని, ఇలా చెప్పడం సమైక్యవాదానికి ద్రోహం చేసినట్లేనని ఉద్యోగులు, వివిధ సంఘాల నేతలు ధ్వజమెత్తారు. వారి అభిప్రాయాలివీ..
చర్చిస్తే విభజనను ఆమోదించినట్లే
రాష్ట్ర అసెంబ్లీలో విభజన అంశం గురించి చర్చిస్తే దానిని ఆమోదించినట్లే. ముఖ్యమంత్రి సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉన్నప్పుడు చర్చ అనవసరం. చర్చ లేకుండా సమైక్యాంధ్ర కోసం తీర్మానం చేయాలి. ఈ విషయంలో వైఎస్ విజయమ్మ సూచన బాగుంది.
- అబ్దుల్ బషీర్, ఏపీఎన్జీవో అసోసియేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు
ఆ పాపాన్ని ఉద్యోగులు మోయడమెందుకు?
‘‘రాష్ట్ర విభజన చేస్తున్నది కాంగ్రెస్... విభజన చేయమని చెప్పింది టీడీపీ. ఆ పార్టీలే చర్చను కోరుకుంటున్నాయి. విభజనకు సహకరిస్తున్నాయి. టీ-బిల్లుపై చర్చించడం ద్వారా రాష్ట్ర విభజనను అంగీకరించినట్లే. విభజనను వ్యతిరేకించే ఏ పార్టీ అయినా, ఎమ్మెల్యే అయినా.. టీ-బిల్లును వ్యతిరేకించాల్సిందే. సమైక్య తీర్మానం చేశాక చర్చ జరిగితే.. విభజనకు ఆమోదం తెలిపినట్లు ఉండదు. విభజనకు సహకరిస్తున్న కాంగ్రెస్, టీడీపీ చెబుతున్న మాటలు.. ఉద్యోగుల నోట పలకడాన్ని సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు అంగీకరించరు. కాంగ్రెస్, టీడీపీ పాపాన్ని ఉద్యోగులు మోయడం ఎందుకు?’’
- గోపాల్‌రెడ్డి, ఏపీఎన్జీవోల మాజీ అధ్యక్షుడు
ఉద్యోగుల ఉద్యమాన్ని తాకట్టు పెట్టవద్దు
‘‘ఇది విభజనకు వ్యతిరేకంగా పార్టీలే ఏకం కావాల్సిన సమయం. రాజకీయాల్లో తలదూర్చి ఉద్యమాన్ని తాకట్టుపెట్టకూడదు’
- సుబ్రమణ్యం, సహకార శాఖ జేఏసీ నేత
సీఎం అడుగుజాడల్లో అశోక్‌బాబు
అశోక్‌బాబు తీరు చూస్తుంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పినట్లు చేస్తున్నట్లు అర్థమవుతోంది. వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసినట్లు అసెంబ్లీలో తీర్మానం పెడితేనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది. ‘సమైక్య’ తీర్మానం ప్రవేశ పెట్టాలని వైఎస్సార్ సీపీ కోరడం తప్పా? సమైక్యం అంటేనే అరెస్ట్ చేస్తారా..?’
- దేవరాజ్, అనంతపురం జిల్లా ఏపీఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు
తీర్మానానికి పట్టుబట్టకుంటే ద్రోహమే
‘‘అశోక్‌బాబు హద్దులుమీరి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, టీడీపీలకు వంతపాడుతున్నారు. సమ్మె విరమణ తర్వాత.. మీడియా ముందు ప్రకటనలు చేయడం తప్ప అశోక్‌బాబు చేసిందేమీ లేదు. చర్చకు అంగీకరిస్తే విభజనకు ఒప్పుకున్నట్టే. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేశాకే మిగతా విషయాలపై మాట్లాడాలి’’
- వెంకట్రామిరెడ్డి, సచివాలయ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు
చర్చకు అంగీకరిస్తే.. విభజనకు ఒప్పుకున్నట్టే
Published Fri, Jan 10 2014 3:43 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement