కేంద్ర కార్యాలయాలు మూత
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదముద్ర వేస్తూ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ఏపీఎన్జీవో నేతలతో పాటు సమైక్యవాదులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు.
అనంతపురంలో ప్రభుత్వ వైద్యులు సర్వజనాసుపత్రిలో ఓపీ విభాగాన్ని మూసివేసి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఎన్జీవోనేతలు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అనంతపురంలో టీడీపీ నేతలు రాష్ట్రపతి బొమ్మతో శవయాత్ర నిర్వహించి.. పిండ ప్రదానం చేశారు.
కడప జిల్లాలోని పోస్టల్, టెలికాం, పీఎఫ్, ఐఓసీతో పాటు అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. పులివెందులలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వేరుగా ఆందోళన చేపట్టారు.
చిత్తూరు జిల్లాలో తిరుపతి, మదనపల్లె, చిత్తూరు ఆర్‌డీవో కార్యాలయాల్లో, కలెక్టరేట్‌లో రెవెన్యూ ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు. గ్రీవెన్స్ సెల్ నిర్వహించలేదు. చిత్తూరు, మదనపల్లె, తిరుపతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏపీ ఎన్‌జీవోలుకొంతసేపు నిరసన తెలిపారు.
కర్నూలులోని ఆదాయపు పన్ను కార్యాలయం, సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయం, పాతబస్టాండ్, బి.క్యాంప్‌లోని ప్రధాన పోస్టల్ కార్యాలయాలు, రివర్‌వ్యూ కాలనీలోని ఎల్‌ఐసీ, వివిధ టెలికాం కార్యాలయాలను ఉద్యోగులు ముట్టడించారు. ప్రజాదర్బార్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించగా కలెక్టర్ జోక్యంతో వెనుదిరిగారు.
శ్రీకాకుళంలో సమైక్యవాదులు పోస్టాఫీసు, బీఎస్‌ఎన్‌ఎల్, బీమా సంస్థల కార్యాలయాల వద్దకు వెళ్లి విధులు నిర్వహించకుండా సిబ్బందిని అడ్డుకున్నారు. అనంతరం వారిని బయటకు పంపి కార్యాలయాలను మూసివేయించారు. జిల్లా పరిషత్ ఉద్యోగులు విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట మానవహారం చేపట్టారు. రె వెన్యూ ఉద్యోగులు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద దీక్ష చేశారు.
విజయనగరం జిల్లాలో ఉద్యోగులు పోస్టల్, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాలను మూయించారు. కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌సెల్‌ను అడ్డుకున్నారు. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట తెలుగు జాతి దుష్టశక్తులకు శాంతి హోమం నిర్వహించారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు, చింతలపూడిలో బీఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసీ, సెంట్రల్ ఎక్సైజ్, ఇన్‌కమ్ ట్యాక్స్ తదితర కార్యాలయూలకు సమైక్యవాదులు తాళాలు వేరుుంచారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎన్జీఓలు తపాలా, ఎల్‌ఐసీ, ఎఫ్‌సీఐ, బీఎస్‌ఎన్‌ఎల్ తదితర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూయించి వేశారు. కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజమండ్రిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు సీటీఆర్‌ఐ, ఓఎన్జీసీ, గెయిల్ సంస్థల కార్యాలయాల ఎదుట ఎన్జీఓలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
గ్రేటర్ విశాఖ మున్సిసిపల్ కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది జీవీఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట జీఓఎం సభ్యుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.