భోగి మంటల్లో టీ నోట్ దహనం నేడు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన సెగను భోగి రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తాకేలా ఏపీఎన్‌జీఓ అసోసియేషన్ జిల్లా శాఖ ఏర్పాట్లు చేసింది. సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ కేంద్రం తెచ్చిన టీ నోట్ బిల్లును సోమవారం భోగి మంటల్లో దహనం చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఒంగోలులోని పీవీఆర్ మునిసిపల్ హైస్కూల్ గ్రౌండ్‌ను వేదికగా చేసుకొంది.
ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు టీ నోట్‌ను దహనం చేయనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు హాజరవుతున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ శ్రీరాం హాజరవుతున్నారు. స్థానిక ఎన్‌జీఓ హోమ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భోగి మంటల్లో టీ నోట్ దహనం గురించి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ బషీర్ వెల్లడించారు. దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విభజించిందన్నారు. సీమాంధ్రకు చెందిన ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా విభజించిందన్నారు. విభజన వల్ల కలిగే నష్టాల గురించి వివిధ రూపాల్లో నిరసనలు తెలపడంతోపాటు 66 రోజులపాటు నిరవధిక సమ్మెకు దిగినా కేంద్రం ధోరణి మారలేదన్నారు.
విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. భోగి మంటల్లో టీ నోట్ దహనం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొనాలని అబ్దుల్‌బషీర్ కోరారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు, రాష్ట్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ శ్రీరాం, కో చైర్మన్ శ్రీనివాస్, లంకా దినకర్, ఎన్‌జీఓ అసోసియేషన్ నాయకులు బండి శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మి, నాసర్‌మస్తాన్‌వలి, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘ నాయకుడు చెంచయ్య, టీచర్స్ అసోసియేషన్ నాయకుడు వెంకటరావు, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నాయకుడు ప్రసాద్, ప్రభుత్వ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకుడు గోపాల్, లాయర్ల జేఏసీ నాయకుడు సిరిగిరి రంగారావు, విద్యార్థి జేఏసీ నాయకుడు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.