ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు అనుమతి
Published Wed, Sep 4 2013 1:27 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈనెల 7వ తేదీన ఏపీఎన్జీవోలు తలపెట్టిన సభకు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసినట్లు దక్షిణ మండలం డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి మంగళవారం వెల్లడించారు. ‘ఇది కేవలం ఉద్యోగులు నిర్వహిస్తున్న సభ’ అంటూ అనుమతి కోరిన నేపథ్యంలో కేవలం గుర్తింపు కార్డులు చూపించిన ఉద్యోగుల్ని మాత్రమే స్టేడియం లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులను కూడా అనుమతించబోమన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని, ర్యాలీలు తీయడం మాత్రం నిషేధమని పేర్కొన్నారు.
భద్రతా కారణాల నేపథ్యంలో సభా ప్రాంగణంలోకి వాటర్ బాటిళ్లు, బ్యాగులు తదితర వస్తువులను తీసుకురావటానికి అనుమతించబోమని చెప్పారు. ఏపీఎన్జీవోలు నిర్వహించే సభను ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని కొందరు ప్రకటన చేసిన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలను చేపడుతున్నారు. నగర పోలీసులతోపాటు సాయుధ విభాగం, కేంద్ర బలగాలను సైతం స్టేడియం చుట్టూ మోహరించనున్నారు. స్టేడియానికి దారి తీసే అన్ని మార్గాల్లోనూ ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రత్యేక నిఘా కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఎలాంటి అపశ్రుతులు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సభను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణ జిల్లాలనుంచీ ప్రముఖుల హాజరు!
‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు తెలంగాణ జిల్లాల నుంచి కొంతమంది ప్రముఖులను సభావేదికపైకి తేవడం ద్వారా తమ సభ కేవలం 13 జిల్లాల సభ కాదన్న సందేశం ఇవ్వడానికి ఉద్యోగ సంఘాల నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. జంట నగరాల్లో సమైక్యవాదం వినిపిస్తున్న ఎమ్మెల్యేలను గుర్తించడానికి ఇప్పటికే కసరత్తు మొదలైంది. సభకు ఎమ్మెల్యేలను పంపించాలని ఎంఐఎం నాయకత్వానికి విజ్ఞప్తి చేయగా.. సభకు తమ ప్రతినిధులను పంపిస్తామని, అరుుతే, ఎమ్మెల్యేలను పంపించే విషయమై తర్వాత తవు నిర్ణయం చెబుతామని ఆ పార్టీ నేతలు చెప్పినట్లు తెలిసింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులును కూడా సభకు ఆహ్వానించగా, పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం చెబుతామని ఆయన చెప్పారని సమాచారం. సమైక్యవాదాన్ని వినిపిస్తున్న తెలంగాణ నేతలను సభకు తీసుకురావడానికి ఉద్యోగ సంఘాల నేతలు ప్రయత్నిస్తున్నారు. సభ నిర్వహణ ఏర్పాట్ల పర్యవేక్షణకు ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు సారధ్యంలో 25 మందితో సమన్వయ కమిటీ ఇప్పటికే ఏర్పాటైంది. ఏర్పాట్లపై హైదరాబాద్‌లోని పలు కాలనీవాసులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని కాలనీల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను సభకు తరలించే విధంగా ప్రణాళిక రూపొందించారు. జిల్లాల నుంచి జన సమీకరణకు కూడా కసరత్తు చేస్తున్నారు.
శాంతి ర్యాలీలకు అనుమతి ఇస్తారా?
హైదరాబాద్‌లో 7వ తేదీనాడే శాంతిర్యాలీల నిర్వహణకు అనుమతించాలని ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) జేఏసీ, తెలంగాణ రాజకీయ జేఏసీ కూడా పోలీసులకు విజ్ఞప్తి చేశారు. నిజాం కళాశాల నుంచి గన్‌పార్కు వరకు శాంతి ర్యాలీకి ఓయూ జేఏసీ, సిటీ కాలేజీ నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీకి తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్ణయించారుు. రెండు ర్యాలీలూ ఎల్బీ స్టేడియం మీదుగానే సాగనున్నాయి. అయితే ఈ ర్యాలీలకు ఇప్పటివరకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎల్బీ స్టేడియం మీదుగా సాగే ర్యాలీలకు అనుమతి వచ్చే అవకాశం లేదని పోలీసు వర్గాలు చెప్పాయి. అయితే ర్యాలీ వూర్గాన్ని మార్చుకుంటే అనుమతి విషయం పరిశీలించే అవకాశం ఉందని ఆవర్గాలు పేర్కొన్నాయి.
Advertisement