Save AP meeting
-
2న కర్నూలులో సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 2వ తేదీన సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి తెలిపారు. కర్నూలులోని గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని కేఎస్ఆర్ కన్వెన్షన్ హాలులో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే సదస్సుకు ఏపీ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ అజేయకల్లం, రిటైర్డ్ డీజీపీ ఆంజనేయరెడ్డి, సమాచార హక్కు మాజీ కమిషనర్ పి. విజయబాబు, డాక్టర్ వి.బ్రహ్మారెడ్డి, జనవిజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షుడు నాగేశ్వరం నరసింహ ముఖ్యఅతిథులుగా హాజరవుతారని వివరించారు. బుధవారం నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జన చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో ఏపీలోని 13 జిల్లా కేంద్రాల్లో సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో రాజకీయ అవినీతి తారస్థాయి చేరుకోవడంతో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయన్నారు. స్వయంగా ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, అధికారులు అవినీతికి పాల్పడడంతో ఘోరమైన పరిస్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారన్నారు. విద్య, ఆరోగ్యం, వైద్యం, తలసరి ఆదాయాల్లో దేశంలో ని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ అట్టడుగు స్థాయిలో ఉందన్నారు. ప్రతి ఒక్కరి తలపై రూ. 90 వేలు అప్పు ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్క రూ సదస్సుకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ కుప్ప కూలిందని, రైతుల పొలాలు రాత్రికి రాత్రే రెక్కలు కట్టుకొని ఎగిరిపోతున్నాయని రిటైర్డ్ తహసీల్దార్, ఏపీ ముస్లిం లీగ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ రోషన్ అలీ విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతుల భూములకు ఎంతో భద్రత ఉండేదన్నారు. 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన సీఎం చంద్రబాబునాయుడు రాజ్యాంగాన్ని ఎలా పరిరక్షిస్తారని అర్చక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటసాయి నాథ్ ప్రశ్నించారు. అవినీతిని పారదోలేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషిగా సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సుల్లో పాల్గొని విజయవంతం చేయాలని నాగేశ్వరం నరసింహ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని వక్ఫ్, క్రిస్టియన్, దేవాలయాల భూములను టీడీపీ నాయకులు కబ్జాచేస్తున్నారని అడ్వొకేట్ అజయ్‌కుమార్ విమర్శించారు. -
సమైక్య బస్సులపై దాడిని ఖండించిన ఆర్టీసీ సంఘాలు
శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన సేవ్ ఏపీ సభకు హాజరై తిరిగి వెళుతున్న సమయంలో బస్సులపై దాడి చేయడాన్ని ఆర్టీసీ ఈయూ, ఎన్ఎంయూ ఖండించాయి. ఈమేరకు రెండు సంఘాలు ఆదివారం వేర్వేరుగా పత్రికా ప్రకటనలు విడుదల చేశాయి. ప్రజాస్వామ్యయుతంగా, అత్యంత క్రమశిక్షణతో సభకు వచ్చిన వారిపై దాడులు చేయడాన్ని హేయమైన చర్యగా పేర్కొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు బాలమునెయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపాయి. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశాయి. అపోలో ఆసుపత్రికి తరలింపు శనివారం బస్సులపై జరిగిన దాడిలో గాయపడిన సత్యనారాయణ(వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి, రాజమండ్రి)ని వనస్థలిపురంలోని స్థానిక ఆసుపత్రి నుంచి ఆదివారం ఆపోలో ఆసుపత్రికి తరలించారు. దవడ ఎముక విరగడంతో పాటు పలు చోట్ల గాయాలయ్యాయి. దవడ ప్రాంతంలో శస్త్ర చికత్స అవసరమని డాక్టర్లు తెలిపారు. ఏపీఎన్జీవో నాయకులు ఆసుపత్రిలో ఉండి చికిత్స చేయిస్తున్నారు. -
ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు అనుమతి
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈనెల 7వ తేదీన ఏపీఎన్జీవోలు తలపెట్టిన సభకు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసినట్లు దక్షిణ మండలం డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి మంగళవారం వెల్లడించారు. ‘ఇది కేవలం ఉద్యోగులు నిర్వహిస్తున్న సభ’ అంటూ అనుమతి కోరిన నేపథ్యంలో కేవలం గుర్తింపు కార్డులు చూపించిన ఉద్యోగుల్ని మాత్రమే స్టేడియం లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులను కూడా అనుమతించబోమన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని, ర్యాలీలు తీయడం మాత్రం నిషేధమని పేర్కొన్నారు. భద్రతా కారణాల నేపథ్యంలో సభా ప్రాంగణంలోకి వాటర్ బాటిళ్లు, బ్యాగులు తదితర వస్తువులను తీసుకురావటానికి అనుమతించబోమని చెప్పారు. ఏపీఎన్జీవోలు నిర్వహించే సభను ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని కొందరు ప్రకటన చేసిన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలను చేపడుతున్నారు. నగర పోలీసులతోపాటు సాయుధ విభాగం, కేంద్ర బలగాలను సైతం స్టేడియం చుట్టూ మోహరించనున్నారు. స్టేడియానికి దారి తీసే అన్ని మార్గాల్లోనూ ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రత్యేక నిఘా కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఎలాంటి అపశ్రుతులు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సభను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ జిల్లాలనుంచీ ప్రముఖుల హాజరు! ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు తెలంగాణ జిల్లాల నుంచి కొంతమంది ప్రముఖులను సభావేదికపైకి తేవడం ద్వారా తమ సభ కేవలం 13 జిల్లాల సభ కాదన్న సందేశం ఇవ్వడానికి ఉద్యోగ సంఘాల నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. జంట నగరాల్లో సమైక్యవాదం వినిపిస్తున్న ఎమ్మెల్యేలను గుర్తించడానికి ఇప్పటికే కసరత్తు మొదలైంది. సభకు ఎమ్మెల్యేలను పంపించాలని ఎంఐఎం నాయకత్వానికి విజ్ఞప్తి చేయగా.. సభకు తమ ప్రతినిధులను పంపిస్తామని, అరుుతే, ఎమ్మెల్యేలను పంపించే విషయమై తర్వాత తవు నిర్ణయం చెబుతామని ఆ పార్టీ నేతలు చెప్పినట్లు తెలిసింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులును కూడా సభకు ఆహ్వానించగా, పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం చెబుతామని ఆయన చెప్పారని సమాచారం. సమైక్యవాదాన్ని వినిపిస్తున్న తెలంగాణ నేతలను సభకు తీసుకురావడానికి ఉద్యోగ సంఘాల నేతలు ప్రయత్నిస్తున్నారు. సభ నిర్వహణ ఏర్పాట్ల పర్యవేక్షణకు ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు సారధ్యంలో 25 మందితో సమన్వయ కమిటీ ఇప్పటికే ఏర్పాటైంది. ఏర్పాట్లపై హైదరాబాద్‌లోని పలు కాలనీవాసులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని కాలనీల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను సభకు తరలించే విధంగా ప్రణాళిక రూపొందించారు. జిల్లాల నుంచి జన సమీకరణకు కూడా కసరత్తు చేస్తున్నారు. శాంతి ర్యాలీలకు అనుమతి ఇస్తారా? హైదరాబాద్‌లో 7వ తేదీనాడే శాంతిర్యాలీల నిర్వహణకు అనుమతించాలని ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) జేఏసీ, తెలంగాణ రాజకీయ జేఏసీ కూడా పోలీసులకు విజ్ఞప్తి చేశారు. నిజాం కళాశాల నుంచి గన్‌పార్కు వరకు శాంతి ర్యాలీకి ఓయూ జేఏసీ, సిటీ కాలేజీ నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీకి తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్ణయించారుు. రెండు ర్యాలీలూ ఎల్బీ స్టేడియం మీదుగానే సాగనున్నాయి. అయితే ఈ ర్యాలీలకు ఇప్పటివరకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎల్బీ స్టేడియం మీదుగా సాగే ర్యాలీలకు అనుమతి వచ్చే అవకాశం లేదని పోలీసు వర్గాలు చెప్పాయి. అయితే ర్యాలీ వూర్గాన్ని మార్చుకుంటే అనుమతి విషయం పరిశీలించే అవకాశం ఉందని ఆవర్గాలు పేర్కొన్నాయి.