విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మణ రెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 2వ తేదీన సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి తెలిపారు. కర్నూలులోని గుత్తి పెట్రోల్ బంకు సమీపంలోని కేఎస్‌ఆర్ కన్వెన్షన్ హాలులో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే సదస్సుకు ఏపీ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ అజేయకల్లం, రిటైర్డ్ డీజీపీ ఆంజనేయరెడ్డి, సమాచార హక్కు మాజీ కమిషనర్ పి. విజయబాబు, డాక్టర్ వి.బ్రహ్మారెడ్డి, జనవిజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షుడు నాగేశ్వరం నరసింహ ముఖ్యఅతిథులుగా హాజరవుతారని వివరించారు. బుధవారం నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జన చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో ఏపీలోని 13 జిల్లా కేంద్రాల్లో సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో రాజకీయ అవినీతి తారస్థాయి చేరుకోవడంతో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయన్నారు. స్వయంగా ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, అధికారులు అవినీతికి పాల్పడడంతో ఘోరమైన పరిస్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారన్నారు. విద్య, ఆరోగ్యం, వైద్యం, తలసరి ఆదాయాల్లో దేశంలో ని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ అట్టడుగు స్థాయిలో ఉందన్నారు. ప్రతి ఒక్కరి తలపై రూ. 90 వేలు అప్పు ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.
రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్క రూ సదస్సుకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ కుప్ప కూలిందని, రైతుల పొలాలు రాత్రికి రాత్రే రెక్కలు కట్టుకొని ఎగిరిపోతున్నాయని రిటైర్డ్ తహసీల్దార్, ఏపీ ముస్లిం లీగ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ రోషన్ అలీ విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతుల భూములకు ఎంతో భద్రత ఉండేదన్నారు. 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన సీఎం చంద్రబాబునాయుడు రాజ్యాంగాన్ని ఎలా పరిరక్షిస్తారని అర్చక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటసాయి నాథ్ ప్రశ్నించారు. అవినీతిని పారదోలేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషిగా సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సుల్లో పాల్గొని విజయవంతం చేయాలని నాగేశ్వరం నరసింహ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని వక్ఫ్, క్రిస్టియన్, దేవాలయాల భూములను టీడీపీ నాయకులు కబ్జాచేస్తున్నారని అడ్వొకేట్ అజయ్‌కుమార్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment