సాక్షి, అమరావతి : ఆపదలో ప్రాణాలు నిలిపే 108... ఊహించని వ్యాధి బారినపడితే అండగా నిలిచే ఆరోగ్య శ్రీ... మారుమూల ప్రాంత వృద్ధులు, బాలింతలకు మందులిచ్చే 104 పథకాలు చంద్రబాబు హయాంలో తిరోగమనంలో ఉన్నాయి. పేదలను స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ఆరోగ్య ఇబ్బందుల నుంచి బయటపడేసే గొప్ప ఉద్దేశంలో మహా నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన పథకాలు... ఈ ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వ అసమర్థతతో నీరుగారాయి. వైఎస్ పాలనలో విలువైన సేవలతో, పలు రాష్ట్రాల్లో అమలుకు ఆదర్శంగా నిలిచిన వాటికి... చంద్రబాబు జమానాలో నిధుల విడుదల జాప్యం, అమలులో రకరకాల ఆంక్షలతో పురిటి గడ్డపైనే నూకలు చెల్లుతున్నాయి.
2010 నుంచి పతనం ప్రారంభం
అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన ఆరోగ్య శ్రీ పథకానికి మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణంతో కష్టాలు దాపురించాయి. 2010 నాటికి 938 వ్యాధులు ఆరోగ్య శ్రీలో ఉన్నాయి. తర్వాతి ప్రభుత్వం వీటిలో 133 జబ్బులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయకూడదని, ప్రభుత్వాస్పత్రుల్లోనే చేయాలని నిబంధన విధించింది. ఒకవేళ ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు లేకపోతే రోగులు ప్రైవేటు ఆస్పత్రుల్లో నగదు చెల్లించి వైద్యం చేయించుకోవాలి.
మరోవైపు తొలినాళ్లలో పుట్టుకతోనే మూగ, చెవుడు చిన్నారులకు 12 ఏళ్ల వరకు వైద్యం చేయించుకునే అవకాశం ఉండేది. ఆ తర్వాత దీన్ని రెండేళ్ల వయసుకు పరిమితం చేశారు. దీంతో లక్షలమంది చిన్నారులు వైద్యానికి అనర్హులయ్యారు. ఇక 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే 1,600 మంది ఆరోగ్యమిత్రలను తొలగించింది. కాంక్లియర్ ఇంప్లాంట్స్ చేసే ఆస్పత్రులకు నెలకు ఒకటి మాత్రమే కొత్త కేసు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. అయితే, మన రాష్ట్రంలో ఇప్పటికీ సూపర్ స్పెషాలిటీ వైద్యం సరిగా లేకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రమాదాల్లో గాయపడినవారికి చికిత్స అందించేందుకు చాలా ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. అదేమంటే ప్యాకేజీ రేట్లు చాలడం లేదంటున్నాయి. న్యూరో, కాలేయ బాధితులకు వైద్యానికి చాలాచోట్ల ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. అన్నిటికి మించి వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోకుంటే వారిని ఆరోగ్య శ్రీ నుంచి టీడీపీ ప్రభుత్వం తొలగించింది.
మంత్రి గారికేమో సింగపూర్ వైద్యం
సామాన్యులు ఆరోగ్య శ్రీ కింద ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వెళ్లి వైద్యం చేయించుకోవడానికి అనుమతించని ప్రభుత్వం... మంత్రి విషయంలో మాత్రం ఎంతో ఔదార్యం ప్రదర్శించింది. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకష్ణుడు సింగపూర్ వెళ్లి దంత చికిత్స చేయించుకోవడానికి ఏకంగా రూ.2,88,823 మంజూరు చేసింది. రూ.15 వేలు కూడా వ్యయం కాని రూట్ కెనాల్ చికిత్సకు ఇంత మొత్తం ఖర్చేమిటని అప్పట్లో విమర్శలు వచ్చాయి.
ఆరోగ్య శ్రీకి రూ.500 కోట్ల బకాయిలు
రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందించే 650 పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఆరు నెలలుగా ప్రభుత్వం రూ.500 కోట్లపైగా బకాయి పడింది. దీంతో తమవల్ల కాదంటూ ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వానికి చెప్పేశాయి. ఇప్పటికే కొన్ని కేసులను తిప్పి పంపుతున్నాయి. చిన్నచిన్న నర్సింగ్ హోంలు మాత్రం విధిలేని పరిస్థితుల్లో స్వీకరిస్తున్నాయి. ఈ జాప్యం కారణంగా చాలామంది మృత్యువుకు చేరువవుతున్నారు. ‘బకాయిలు చెల్లించాల్సిన ప్రభుత్వం నిధులు లేవంటోంది. ఇక మేమేం చేయాలంటూ’ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి.
2014 తర్వాత ఆరోగ్యశ్రీ
- ఆరోగ్యశ్రీ భారంగా ఉందని నిధుల కేటాయింపు భారీగా తగ్గించారు.
- కాంక్లియర్ ఇంప్లాంట్స్ చికిత్సకు నిబంధనలు విధించి సర్జరీలకు కోతపెట్టారు.
- ఆరోగ్యశ్రీ చికిత్సల కంటే అదనంగా వ్యయమైతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద సాయం వర్తించదని మెలిక పెట్టారు.
- హైదరాబాద్‌లో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించదని కొర్రీ విధించారు.
- రోగులకు రవాణా చార్జీలు ఇవ్వడం లేదు
- ఇన్‌పేషెంట్‌గా చేరకముందు అయ్యే వైద్య పరీక్షలకు సొంతంగా ఖర్చు పెట్టుకోమన్నారు.
- తాజాగా... డైట్ కింద ఇచ్చే రూ.100కు కోత పెడుతూ అందరిలాగే సాధారణ డైట్ పెట్టాలని ఆదేశాలిచ్చారు.
- డైట్‌తో మిగిలిన మొత్తం రోగుల ఖాతాలో వేస్తున్నామంటున్నా జమ కావడం లేదు.
104 వాహనాల సొమ్ము కార్పొరేట్ జేబుల్లోకి
ఎక్కడైనా పదిమంది పేదలకు మేలు జరుగుతుంటే అక్కడి సర్కారు కూడా ముందుకొచ్చి మరింత ప్రోత్సాహం ఇస్తుంది. కానీ మన రాష్ట్రంలో ప్రభుత్వం 104 పథకం అమలులో కార్పొరేట్ కంపెనీకి లబ్ధి చేయడానికే మొగ్గుచూపింది. ఇలా కోట్లాది పేదలను గాలికొదిలేసి తమ జేబులు నింపుకోవడం ఏ రాష్ట్రంలోనూ ఉండదేమోనని అధికారుల్లో చర్చ జరుగుతోంది.
పిరమల్‌కు అప్పగించి..
రాష్ట్రంలో 104 వాహనాల (చంద్రన్న సంచార చికిత్స) నిర్వహణను పిరమల్ స్వాస్థ్య సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ దేశంలో అత్యంత ప్రముఖుడికి చెందినది. దీంతో రాష్ట్రంలో పిరమల్‌కు అడ్డు చెప్పేవారు లేకపోయారు. ఈ సంస్థ 2016లో వక్ర మార్గంలో టెండరు దక్కించుకున్న నాటి నుంచి రూ.కోట్లు బిల్లులు చేసుకోవడమే గాని, పేదలకు నాలుగు రకాల మందులు పంచిన దాఖలాలు తక్కువ. వాహనాలు, మందులు సమకూరుస్తూ.. డీజిల్, సిబ్బంది జీతభత్యాలకు నెలకు వాహనానికి రూ.2.44 లక్షలు చెల్లిస్తున్న ప్రభుత్వం ఇందులో సంస్థ నుంచి రూ.లక్ష కూడా ఖర్చు చేయించలేకపోయింది.
అప్పుడు రూ.1.04 లక్షలు ఇప్పుడు రూ.2.44 లక్షలు
2014కు ముందు 104 వాహనాల నిర్వహణ జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో సాగేది. టీడీపీ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వాలని నిర్ణయించి పిరమల్ స్వాస్థ్య సంస్థకు కట్టబెట్టారు. అప్పటివరకు ఒక్కో వాహనానికి నెలకు రూ.1.04 లక్షలు ఇచ్చేవారు. కానీ, పిరమల్ స్వాస్థ్య సంస్థకు వచ్చేసరికి దానిని రూ.2.44 లక్షలకు పెంచి మూడేళ్లలో రూ.240 కోట్ల పైగా చెల్లించారు.
104 వాహనాల్లో పరిస్థితిది
- మొత్తం 292లో మెజారిటీ వాహనాలకు ఫిట్‌నెస్ లేదు.
- ఇన్వర్టర్, బ్యాటరీలు లేవు. టైర్లు అరిగిపోయాయి.
- నెలలో 15,432 గ్రామాలకు వెళ్లి మందులివ్వాల్సి ఉండగా ఇందులో సగం కూడా వెళ్లడం లేదు
- ఏపీ09టీఏ2732 వాహనం 2010 ఏప్రిల్ 23న ప్రమాదానికి గురై షెడ్డులో ఉంది. ఐనా తిరుగుతున్నట్టు చూపి నెలకు రూ.2.44 లక్షలు తీసుకుంటున్నారు
- 2018 ఆగస్ట్ నుంచి సిబ్బందికి రవాణా భత్యం, డిసెంబరు నుంచి దినసరి భత్యం చెల్లించడం లేదు
- 60 రకాల మందులకు 27 కూడా లేవు గర్భిణులు, మధుమేహ రోగులకు రక్త పరీక్షలు చేసేందుకు కొన్ని నెలలుగా రసాయనాలు లేవు.
- మధుమేహం, మూర్ఛ సంబంధిత జబ్బులకు ప్రధాన మందులు లేవు.
- 60 శాతం వాహనాల్లో డాక్టర్లు లేరు.
Comments
Please login to add a commentAdd a comment