భగీరథ సారథి..వైఎస్‌ | Irrigation Projects Man Of Andhra Pradesh YS Rajasekhara Reddy | Sakshi
Sakshi News home page

భగీరథ సారథి..వైఎస్‌

Published Sat, Mar 23 2019 7:36 AM | Last Updated on Sat, Mar 23 2019 8:34 AM

Irrigation Projects Man Of Andhra Pradesh YS Rajasekhara Reddy - Sakshi

సాక్షి, అమరావతి : ఒకనాడు అన్నపూర్ణగా భాసిల్లిన తెలుగు నేల దుర్భిక్షం బారిన పడటాన్ని చూసి చలించిపోయిన మహా నేత వైఎస్‌  రాజశేఖరరెడ్డి... కరువనేది ఎరుగుని నేలగా మార్చడానికి జలయజ్ఞం చేపట్టారు. సముద్రం వైపు  ఉరకలెత్తుతున్న  గోదావరిని... పరుగులిడుతున్న కృష్ణవేణిని... కదలిపోతున్న వంశధారను తెలుగు నేలలకు మళ్లించి... సస్యశ్యామలం చేయడానికి అహోరాత్రులు శ్రమించారు. ఐదేళ్లలోనే రూ.53,205.29 కోట్ల వ్యయంతో 17 ప్రాజెక్టులు సంపూర్తిగా, మరో 24  ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి 18.48 లక్షల కొత్త ఆయకట్టుకు నీరందించారు.

2.07 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఉమ్మడి రాష్ట్ర సాగునీటి చరిత్రలో ఇదో రికార్డు. కేవలం రూ.17,368 కోట్లతో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామంటూ ప్రగల్భాలతో అధికారం చేపట్టి... ఐదేళ్లలో రూ.65,345.45 కోట్లు ఖర్చు చేసినా ఒక్కటంటే ఒక్కదానినీ గట్టెక్కించలేకపోయారు చంద్రబాబు. వైఎస్‌ హయాంలోనే పూర్తయినవాటికి గేట్లు ఎత్తుతూ, అదంతా తన ఘనతేనంటూ పూటకో నాటకం, రోజుకో రియాలిటీ షోతో రక్తికట్టించారు. 

ఉమ్మడి ఏపీ 1994 నుంచి 2004 మధ్య వరుస కరవులతో తల్లడిల్లింది. దేశానికి ధాన్యాగారంగా భాసిల్లిన తెలుగు నేల కరవు కాటకాలతో అలమటించింది. పదిమంది ఆకలి తీర్చే అన్నదాత.. సాగుపై ఆశలు కోల్పోయి, అప్పుల భారంతో బలవన్మరణాలకు పాల్పడ్డాడు. మహా ప్రస్థానం పాదయాత్రలో అడుగడుగునా ఎదురైన ఇలాంటి ఘట్టాలు వైఎస్‌ను కదలించాయి. అధికారంలోకి వస్తే గోదావరి, కృష్ణా జలాలను ప్రతి ఎకరాకు అందించి, కరవు రక్కసిని తరిమికొడతానని ఆ సందర్భంగా బాస చేశారు.

2004 మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే... అనేక ప్రాజెక్టులకు కార్యరూపం ఇచ్చారు. 2004–05లో రాష్ట్ర బడ్జెట్‌ అంచనా వ్యయం రూ.51,142.92 కోట్లు. కానీ, రూ.1,33,730 కోట్ల వ్యయంతో ఒకేసారి 86 సాగునీటి ప్రాజెక్టుల పనులకు అనుమతిచ్చేశారు. కొత్తగా 97.69 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు 23.53 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రణాళిక రూపొందించారు. 



గేట్లెత్తి... గొప్పలు 
వైఎస్‌ హయాంలో పూర్తయిన తోటపల్లి, గాలేరు–నగరి, హంద్రీ–నీవా తదితర ప్రాజెక్టుల గేట్లు ఎత్తి జాతికి అంకితం చేసి వాటిని తానే చేసినట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవానికి ఐదేళ్లలో ప్రాజెక్టుల పేరుతో టీడీపీ ప్రభుత్వంలోని వారు దొరికినంత దోచుకున్నారు. ఇందులో సీఎం బినామీలు, కోటరీ కాంట్రాక్టర్లకు తప్ప రైతులకు ప్రయోజనం చేకూరలేదని మాజీ సీఎస్‌లు ఐవైఆర్, అజేయ కల్లం పలు సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు. తాజాగా పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ సైతం ప్రాజెక్టుల టెండర్లలో చంద్రబాబు సర్కారు అక్రమాలను ఎత్తిచూపి, అందుకు తాను బాధ్యత వహించలేనని హై పవర్‌ కమిటీ నుంచి తప్పుకోవడం గమనార్హం. 

బాబు కుయుక్తులను తట్టుకుని 
మహా నేత చేపట్టిన జలయజ్ఞంపై అప్పట్లో చంద్రబాబు కుయుక్తులకు దిగారు. సరిహద్దు రాష్ట్రాలను ఉసిగొల్పుతూ ప్రాజెక్టులను అడ్డుకునేలా న్యాయస్థానాల్లో కేసులు వేశారు. చివరకు సొంత నియోజకవర్గం కుప్పంలో పాలార్‌ నదిపై ఒకటిన్నర టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన జలాశయం పనులకు అడ్డుతగిలి, దానికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో కేసులు వేసేలా తమిళనాడు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టారని నాడు టీడీపీ సీనియర్‌ నేతలే విమర్శించారు. చంద్రబాబు సైంధవుడిలా అడుగడుగునా అడ్డుతగిలినా వైఎస్‌ వెనుకడుగు వేయలేదు.

అప్పుడు... ఇప్పుడు... 
వైఎస్‌ మరణం జలయజ్ఞానికి శాపంగా మారింది. 2009 నుంచి 2014  మధ్య రూ.44,851.71 కోట్లు ఖర్చు చేసి... మిగిలిన కొన్ని పనులే పూర్తి చేయగలిగారు. విభజన నేపథ్యంలో రూ.17,368 కోట్లతో అంతా అయిపోతుందని అధికారం చేపట్టిన తొలినాళ్లలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. కానీ, ఇప్పటికి రూ.65,435.45 కోట్లు ఖర్చు చేసినా చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టూ లేదు.

పారదర్శకంగా టెండర్లు...
ప్రాజెక్టుల పనులకు ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానించి వైఎస్‌ పారదర్శకత పాటించారు. దీంతో దేశ, విదేశాల నుంచి కాంట్రాక్టర్లు వచ్చారు. వారి మధ్య టెండర్లలో పోటీతో సగటున 15 శాతం తక్కువకే బిడ్లు దాఖలై ఖజానాకు రూ.పదివేల కోట్లపైగా ఆదా అయ్యాయని సాగునీటి ప్రాజెక్టుల సలహాదారు సీతాపతిరావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి సీవీఎస్‌కే శర్మ పలు వేదికలపై పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు పనులు శరవేగంగా పూర్తిచేసేలా వైఎస్‌ పరుగులు పెట్టించారు. బడ్జెట్‌ కేటాయింపుల కన్నా అధికంగా ఖర్చు చేశారు. వంశధార రెండో దశ ప్రాజెక్టుకు ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేస్తే, వెంటనే రీ డిజైన్‌ చేసి, ట్రిబ్యునల్‌ను ఒప్పించి మెప్పించారు.

వైఎస్‌ చలవతోనే రైతులకు మేలు 
నాకు హంద్రీ–నీవా కాలువ కింద ఎకరం పొలం ఉంది. ఇందులో వేరుశనగ పంట వేశా. నీటికి కొరత లేకపోవడంతో పంట బాగా వచ్చింది. మళ్లీ ఇప్పుడు రెండో పంటగా జొన్న వేశా. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో కూడా రెండు పంటలకు నీటికి ఎలాంటి ఢోకా లేదు. ఇదంతా వైఎస్సార్‌ పుణ్యమే. ఆయన చలువతో ఎంతో మంది రైతులకు మేలు జరుగుతోంది.  
–  చిన్నగొల్ల చిట్టిబాబు, పందికోన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement